బీజేపీ ఓటర్ల జాబితాలతో ప్రమాదకర రాజకీయాలు చేస్తోంది

పుడమిటివి న్యూస్

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్

ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులే తమ సొంత నియోజకవర్గాల్లో గెలవలేని ప్రమాదకర పరిస్థితులను బీజేపీ తీసుకొచ్చిందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆరోపించారు. ఓటర్ల జాబితాల నిర్వహణలో నిర్లక్ష్యం, ఓటు చోరీ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ప్రతి ఓటును కాపాడుకునే బాధ్యత బూత్ స్థాయి నాయకులపై ఉందని ఎంపీ పేర్కొన్నారు.

పరకాల ఎన్‌ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సదస్సుకు శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి,మహ్మద్ అయూబ్ గార్లతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా SIR (Special Intensive Revision) ప్రక్రియ, ఓటర్ల జాబితా నిర్వహణ, బూత్ స్థాయి బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, ప్రతి బూత్ ఏజెంట్ పార్టీకి సైనికుడిలా పనిచేయాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు, ఓటర్ల వివరాలు, ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రజలు తరచూ నివాస ప్రాంతాలు మార్చడం, అద్దె ఇళ్లలో నివసించడం, ఉద్యోగాల కారణంగా చిరునామాలు మారడం వల్ల ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వం నిలుపుకోవడం సవాల్‌గా మారుతోందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో SIR ప్రక్రియ అత్యంత కీలకమని పేర్కొన్నారు.

గతంలో 2002లో నిర్వహించిన SIR ప్రక్రియ మళ్లీ 2026లో చేపడుతున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, బూత్ ఏజెంట్లు దీన్ని అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని మ్యాపింగ్ చేయడం, కొత్త ఓటర్ల గుర్తింపు, మారిన ఓటర్ల వివరాల సవరణ, అనుమానాస్పద నమోదుల పరిశీలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో SIR పేరుతో ఓటర్ల జాబితాల్లో జరుగుతున్న మార్పులను గమనించాలని, తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఓటు చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని పేర్కొన్నారు. “మన ఓటును మనమే కాపాడుకోవాలి. ప్రతి BLA ఒక సైనికుడిలా పనిచేయాలి” అని పిలుపునిచ్చారు.

బూత్ లెవల్ ఏజెంట్లు, BLOలతో కలిసి వచ్చే మూడు నెలలు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఓటర్ల జాబితానే ఎన్నికల్లో గెలుపుకు తొలి అడుగు అని అన్నారు. ఇప్పటికే డివిజన్‌ల వారీగా ఇన్‌చార్జిలను నియమించామని, రేపటి నుంచి బూత్ స్థాయి కన్వీనర్లు, ఏజెంట్లు, ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

అనంతరం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూపొందించిన “బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్‌బుక్”ను ఆవిష్కరించి BLAలు, డివిజన్ ఇన్‌చార్జ్‌లకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వీడియో పంపించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *