ఎంవిఆర్ భవనం నుండి
పుడమిటివి జనసాహిత్యం
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవిఆర్ మానవ వికాస రచనలు
ఎక్కడ వద్దంటే అక్కడ నేనుంటా (ఎక్కడ నిషేధం విధిస్తారో అక్కడికి నేను వస్తా ) ఇది ప్రజాకవి కాళోజీ మాట, మాటే కాదు తెగువకూడ అంతే, ఒకవైపు దేశ వ్యాప్తంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం కొనసాగుతుంది . కాంగ్రెస్ , ఆర్యసమాజ్, కమ్యూనిస్టులతో పాటు అనేక సంస్థలు దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యాయి.
స్వాతంత్ర పోరాటంలో ఇంకా ప్రజల్ని పెద్ద ఎత్తున సన్నద్ధం చేయడం కోసం గణపతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రతి పల్లెల్లో జరపాలని బాలగంగాధర్ తిలక్ పిలుపు నిచ్చారు. ప్రజలను ఎక్కువ సమీకరించె వేదికలుగా గణపతి మండపాలు ఉంటాయని అక్కడ స్వాతంత్ర్య పోరాట కాంక్షను ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు అనే ఆలోచనతో బాలగంగాధర్ పిలుపు నిచ్చారు.
నిజాం రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. నిజాం పాలనలో వున్నా ప్రతి గ్రామం నిజాం చర్యలను ప్రతిఘటిస్తూ ముందుకు సాగుతుంది. నిజాం నవాబ్ అతని అనుచరులు, రజాకార్లు, దొరలు ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ప్రతి పల్లెకు బాలగంగాధర్ పిలుపు మనిషి నుండి మనిషికి చేరిపోయింది. వినాయక చవితిఉత్సవాలకు ప్రజలు సన్నద్ధం అవుచున్నారు. ఈ విషయం తెలిసిన నిజాం నవాబ్ వినాయక చవితి ఉత్సవాలపై కన్నెర్ర చేశాడు. తొమ్మిది రాత్రులు జరిగే ఉత్సవాలకి నిమజ్జనం రోజు ఇచ్చే సెలవులను రద్దు చేశాడు.
ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలకు తొమ్మిది రోజులు ఎలాంటి ఆటంకాలు కలిగించని నిజాం సర్కార్ నిమజ్జనం రోజున సెలవు ప్రకటించేది.నిజాంనవాబ్ ఒక్క సారిగా గణపతి నిమజ్జనానికి ఇచ్చే సెలవులను రద్దు చేయడంతో ఓరుగల్లు ప్రజలు భగ్గుమన్నారు. , మరో వైపు దేశ స్వాతంత్ర్యపోరాటంలో ప్రతి పల్లెలో గణపతి ఉత్సవాలని నిర్వహించాలని బాలగంగాధర్ ఇచ్చిన పిలుపు ప్రజల్ని ఇంకా సంఘటితం చేయడానికి దోహదపడింది.ప్రతి పల్లెనుండి నిజాం నిర్ణయానికి వ్యతిరేకిస్తూ వినాయక ఉత్సవాలకు నిర్వహించడానికి ప్రజలు సన్నద్ధమయ్యారు..
వినాయకఉత్సవాలపై నిజాంనిర్ణయానికి వ్యతిరేకంగా పల్లెలన్నీ కదిలాయి. ఆసమయంలో హనుమకొండ కాలేజ్ యేట్ లో,హైస్కూల్ విద్యను అభ్యసిస్తున్న కాళోజీ నారాయణరావుతో పాటు కొంతమంది విద్యార్థులు వినాయక చవితి ఉత్సవాలకు సన్నద్దమవ్వడమే కాకుండా గణపతి ఉత్సవాలపై ఆంక్షలు ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కదిలించారు.ప్రతి పాఠశాలలో పేపర్ల పై రాసి తమ ప్రదానోపాధ్యాయులకి అందచేశారు. విద్యార్థులందరు ఏర్పాటు చేసుకున్న విద్యార్థిసంఘానికి కాళోజి నారాయణరావు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పాఠశాలల బంద్ కు కాళోజిపిలువు నివ్వడంతో ఒక్క సారిగా
విద్యార్థి లోకం సంఘీటితంగా కదిలివచ్చారు.అదేవిధంగా వరంగల్ ప్యాట ( పట్నం ) తో,పాటు అనేక గ్రామాల పాఠశాలల నుండి పెబ్బే (క్లాస్ లీడర్ల) ల నాయకత్వంలో పదహారు వందలమంది విద్యార్థులచే సంతకాలు సేకరించి నిజాం నవాబ్ కు పంపించారు.
విద్యార్థుల అభ్యర్థనపై నిజాం నవాబ్ స్పందించక పోవడమే కాకుండ .నిజాం సర్కార్ పోలీస్ హుకుం జారీ చేసింది.సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవ్వరు ప్రయత్నించిన కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థి లోకం నిజాం నిర్ణయాన్ని తిరస్కరించి. వినాయక చవితి నిమజ్జనానికి సన్నద్ధమయ్యింది.
నిజాం ఆంక్షలను వ్యతిరేకిస్తూ వినాయక చవితిఉత్సవాలకు విద్యార్థులు .కాళోజి నేతృత్వంలో వందలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. మడికొండ నుండి వినాయక విగ్రహాన్ని ఎడ్ల బండి పై ఊరేగింపుగా మొదలు పెట్టారు అంతే రాంపూర్, ధర్మసాగర్, దర్గా, వడ్డేపల్లి, హన్మకొండ కుమార్ పల్లి వరంగల్, పైడిపల్లి కాశీబుగ్గ, ఏనుమాముల, మొగిలిచర్ల కొత్తపేట దేశాయిపేట, పైడిపల్లి ఆరెపల్లి, వంగపహాడ్ కడిపికొండ తరాలపల్లి, భట్టుపల్లి,కాజేపేటల రంగసాయిపేట, కరీమాబాద్, ఖిలా వరంగల్,ఉర్సు,నుండి వందలలాది మంది ప్రజలు విద్యార్థులకు మద్దతుగా కదిలారు.ఊరేగింపును విద్యార్థుల నాయకత్వంతో బ్యాండ్ మేళాలతో ముందుకు సాగింది.
వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలిస్ నాక ముందు నుండి వినాయక ఊరేగింపు బ్యాండ్ మేళాలతో ఊరేగింపు కొనసాగుతుంది. ముస్లింలు ప్రార్థన చేస్తున్న సమయంలో బ్యాండ్ మేళాలు ఉపయోగించి వినాయక ఊరేగింపు చేశారని, నమాజ్ సమయంలో శబ్దాలు చేసి పవిత్రతకు భంగం కలిగించారని ఆరోపిస్తూ కాళోజీతొ పాటు కొంతమంది పైన నిజాం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఒక్క సారిగా నిజాంకు వ్యతిరేకంగా యువకులు రోడ్ల పైకి వచ్చారు. నగరమంతా నైజాం పోలీసులు, రజాకార్లు, నిజాం అనుకూల వ్యక్తులు ఊరేగింపులో పాల్గొన్న యువకుల ఇళ్లపై పడి దాడి చేస్తూ వస్తువులను ఆహారపదార్థాలను ద్వంశం చేశారు. పోలీసులకు దొరికిన యువకులను చితకబాదుతూ అదుపులోకి తీసుకొని పోలీస్ నాకాకు తరలించారు.
ఆనోటా ఈ నోటా వినాయకుడి ఊరేగింపు చేసినవారిపై నిజాం పోలీసులు కేసు నమోదు చేయడం కొందరిని అరెస్టు చేయడంతోపాటు విద్యార్థులను ఘోరంగా చితకబాధారు అనే వార్త దావానములు వ్యాపించడంతో, ఒక్క సారిగా ఓరుగల్లు భగ్గుమన్నది . యువకులు, విద్యార్థులపై కేసులు ఎత్తి వేయాలని అరెస్టు చేసిన వారిని విడుదల వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. నిజాం పోలీసులు కర్ఫ్యూ విధించారు రోడ్లపైకి ఎవరైనా వస్తే అరెస్ట్ చేస్తాం ఆందోళన చేస్తే కాల్పులు జరుపుతామని హెచ్చరించారు.
నిజాం పోలీసుల హెచ్చరికలను ఉద్యమకారులు లెక్కచేయకుండా పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళలు సైతం ఎక్కువ సంఖ్యలో కదిలారు. దీంతో పోలీసులకు వణుకుపుట్టింది, నవాబుకు సమాచార మిచ్చారు. పరిస్థితి చేజారుతుండటంతో
నిజాం నవాబ్ ఉద్యమ కారులతో చర్చలు జరిపెందుకు సిద్ధమయ్యి ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేశారు
నిజాం నవాబ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలో నిజాం సర్కార్ ఉన్నత అధికారులతో పాటు వరంగల్ కు చెందిన హిందుమతం , పార్సీమతం ముస్లింమతానికి సంబంందించిన ముగ్గురితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.
నిజాం సర్కార్ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో ఉన్న సభ్యులు ముగ్గురు, విద్యార్థి సంఘంతో స్థానిక ప్రజలతో, ఇంతేజార్ గంజ్ నాకలోని పోలీసులతో విచారించారు. దాదాపు మూడు నెలల పాటు సాగిన విచారణ అనంతరం ముగ్గురు సభ్యులు తాము విచారణ చేసిన రిపోర్ట్ ను నిజాం నవాబ్ కు పంపించారు.అందులో హిందువు సభ్యుడు అది ముస్లిమ్ ల ప్రార్థన మందిరం అక్కడ బ్యాండ్ మేళాలు వాయించడం తప్పు కాబట్టి విద్యార్థులు చేసింది ముమ్మాటికీ తప్పు అని రిపోర్టు రాసి పంపాడు.. పార్సీ మతానికి చెందిన వ్యక్తి కూడ అదే విధంగా వినాయక ఊరేగింపు మత విశ్వాసాలకు విరుద్ధంగా జరిగిందని రిపోర్టు ఇచ్చాడు. ఇక ముస్లిం సభ్యుడు మాత్రం అది ముస్లిమ్ ల ప్రార్థన చేసే స్థలం కాదని, అది పోలీస్ కాన,మాత్రమే నని అది ఎప్పటికి మజీద్ కాదని తేల్చి చెప్పిన.వివరణను నిజాం కు అందచేశారు.
విధినిర్వహణలో వున్నా పోలీసులు నమాజ్ సమయంలో మజీద్ కు వెల్లలేని పరిస్థితి వున్నప్పుడు పోలీస్ స్టేషన్ ఇళ్లల్లో నైనా ప్రయాణంలో నైనా ప్రార్ధన చేసుకుంటారని వివరిస్తూ ఇంతేజర్ గంజ్ పోలిస్ కానల్,అందులో నమాజ్ ను పోలిసులు సాధారణంగా చేసుకున్నారు. అది నమాజ్ చేసుకునే ముస్లింల మజీద్ కాదని తేల్చి చెప్పారు.
గ్రామాలలో ముస్లిం ఉద్యోగులు పట్వారీ ఇళ్లకు వెళ్లుతారు. నమాజ్ సమయంలో పట్వారీలు తమ ఇంటిలోనే ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. ఆ పట్వారీలు ఎక్కువమంది బ్రాహ్మణులే వున్నారు అలాంటప్పుడు. బ్రాహ్మణల ఇళ్లల్లో నమాజ్ చేసుకోవడం వల్ల అవి మజీద్ లు కాదు కదా అలా కానప్పుడు. వినాయక ఊరేగింపులో విద్యార్థులు మజీద్ లోకి వెళ్ళలేదు, నిబంధన ఉల్లంఘించలేదని రిపోర్టు పంపించాడు.
త్రిసభ్య కమిటీలో హిందూమతం,పార్షి మతం ప్రతినిధులు ఇచ్చిన రిపోర్టును సత్యదూరంగా వున్నాయని భావించి వాళ్ళ రిపోర్ట్ ను నిజాంనవాబ్ తోసిపుచ్చికమిటీలోని ముస్లిం సభ్యుడు ఇచ్చిన రిపోర్టును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు.
అంతే కాకుండా గ్రామాలలో పాలకులైన ముస్లింలు, వాళ్ళ స్వంత ఇంటిలో నమాజ్ చేస్తే అవి మజీద్ లు కావని గుర్తించాలని వెల్లడించి, విద్యార్థులపైననే కాకుండా వినాయక ఊరేగింపులో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తి వెయాలని ఉత్తర్వులు జారీ చేశారు
ఒక వేళ కఠిన చర్యలు తీసుకుంటే వినాయక ఊరేగింపు స్వాతంత్ర్య ఉద్యమానికిపెద్దఎత్తునప్రజలనుకదిలిస్తుందని గూడాచారులు ఇచ్చిన సమాచారం మేరకు నిజాం నవాబ్ నిర్ణయం తీసుకున్నారు.
ఓరుగల్లులోని ప్రతి పల్లెల్లో శివరాత్రి, వినాయక నవరాత్రి ఉత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదికలయ్యాయి. వీదినాటికలు, చెక్క భజనలు, గొల్లసుద్దులు అనేక జానపద నృత్యాలు పాటలతో స్వాతంత్ర్య పోరాటానికి ప్రజల్ని కదిలించే ప్రధాన భూమికను పోషించాయి.
నిజాంవ్యతిరేక ఉద్యమంలో ఓరుగల్లులో ఆర్యసమాజ్ ,కాంగ్రెస్ కమ్యూనిస్టు ల ప్రభావం వుంది. ప్రజలు నిజాం సర్కార్ నుండీ విముక్తి పోరాటంలో అజ్ఞాత జీవితాన్నీ బహిరంగ పోరాటలకు సిద్దపడ్డారు.
వినాయక చవితిపై నిషేధం విధించాలని చూసిన నిజాం నవాబు ప్రజలు చేసిన తిరుగుబాటుకు ఉద్యమానికి తోకముడిచి వెనక్కితగ్గారు. ఈ ఉద్యమం అన్ని వర్గాలప్రజలను నిజాం వ్యతిరేక ఉద్యమంలో సన్నద్ధం అయ్యే విధంగా దోహదపడింది. నిజాం పై పోరాటానికి ప్రజలు సంఘటీతం కావడానికి. వేదికగా నిలిచించింది. అనేక మంది ఉద్యమకారులను స్వాతంత్ర్య పోరాటంలో అజ్ఞాత జీవితం వైపు. మళ్ళించింది. వినాయక చవితి స్వాతంత్ర్య పోరాటానికి వేదికగా నిలిచి నిజాం సర్కార్ నేలకూలే వరకు కొనసాగింది.అది ఒక సాంస్కృతిక విప్లవంగా, నిజాం పాలనను సమాధి చేసింది.
( 1997 లో కాళోజి ద్వారా విన్న సమాచారం,అలాగే సమాచారం అందించిన నాగిళ్ల రామశాస్త్రి గారికి, పొట్లపల్లి శ్రీనివాస్ గారికి కృతఙ్ఞతలు )
