
పుడమి టివి
సాహిత్యం -సామాజికం
దండమూడి శ్రీచరణ్
9866188266
భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లా, ఫ్రీలాన్స్ రచయిత
నేను చివురులు చెప్పే గుసగుసలు వినడం మానివేసినప్పుడనుకుంటాను
నిన్ను గమనించడం వదిలివేశాను
. చెట్ల కొమ్మల మధ్య కుహూరుతాలు కూడా నన్ను స్పందింపజేయడం వదిలివేశాయి.
గ్రీష్మం నిష్కర్షగా దాడిచేస్తున్నప్పుడు ఒక దాహార్త పధికుడిని ఉపేక్షిస్తూ తలుపులు మూసివేశాను
. రహదారుల గుండా నడిచిపోతూ పేవ్మెంట్లపై ఈడిగిలదీసుకొని పడుకొని వున్న జీవశ్చవాలను విసుగుతూ దాటి నడిచాను.
అక్కడే అనుకుంటా,ఓ చింపిరి దుస్తుల పిల్ల తన దైన్యాన్ని చాపి నాకేసి ఆబకళ్లతో చూసింది
.నేను జేబులు తడుముకున్నట్లు నటిస్తూ,ఆ పిల్లపై వెకిలిగా నవ్వి ముందుకు నడిచాను..
అంతలో అకస్మాత్తుగా ఓ పిచ్చివాడు నన్నడ్డగించాడు.
“అంతా ద్రోహం,దుర్మార్గం,అదిగో నెత్తురు కారుతున్న శిరస్సులను డేగలు ఎత్తుకుపోతున్నాయి
,తప్పుకోండి వెధవల్లారా”,అంటూ వెఱ్ఱిగా నవ్వుతూ అతను వెనుదిరిగి పరిగెత్తాడు.
నేను ఆ హఠాత్ సంఘటననుంచి కుదుటపడి నా జేబులు తనిఖీ చేసుకున్నాను.
నా డబ్బులు భద్రంగా వున్నాయి. కానీ గుండెలోనే ఎక్కడో కలుక్కుమంది.
వెంటనే తేరుకొని ఇంటికేసి నడిచాను
. ఇంటిలోకి వెళ్ళాక అన్నీ భద్రంగా వుండడంతో నిట్టూర్పు
విడిచాను.దుప్పటి కప్పుకొని నిద్రకుపక్రమించాను.
ఆ రాత్రి వేళ ఎవరో సన్నగా రోదిస్తున్న శబ్దం వినపడింది.
అది ఎవరిది?నేను దిక్కులేకుండా వదిలేస్తే నిస్సహాయంగా
రోగంతో, ఆకలితో మరణించిన నా తల్లిదా?లేక నాతో సరిపడక పిచ్చిదై ఉరేసుకున్న నా భార్యదా?
పిచ్చివాడిదా?రోడ్డుపై బిచ్చకత్తె పిల్లదా?ఎవరిదైతేనేం..నాకనవసరం!
దుప్పటి పైకి లాక్కొని పడుకున్నాను.
నిశీధిలో ఈదురుగాలిలో ఎగిరిపడుతున్న ఆకుల సవ్వడి కూడా నాకు వినిపించడం లేదు.కానీ
నా గుండె కొట్టుకుంటున్న చప్పుడు మాత్రం గది గోడల మధ్య ధ్వనిస్తోంది.
గుండె మళ్లీ ఒకసారి కలుక్కుమంది.
కిటికీలోంచి ఏదో చనిపోయిన కమురు వాసన వేసింది.
అది నాలోంచి చనిపోయిన మనిషి వాసనలా తోచింది!అవును,అది మనిషి అనేవాడు చనిపోయిన కమురు వాసన!!