ఎంవిఆర్ భవనం నుండి
పుడమిటివి జనసాహిత్యం
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవిఆర్ మానవ వికాస రచనలు
ఇంటికెళ్లి వీరనాగులు “నులక’ మంచం మీద ఒరిగిండు. తెల్లారితే ఏదో జరుగుతది, ఏమి చేయాలే, ఏమన్నా అంటే ఎట్లా? ఈశ్వరితో మాట్లాడింది ఎవరైనా చూసి సెప్పిళ్ల, మా అయ్యకు సెప్పితే ఇంకేముంది అక్కడ తన్నులు బడుడు ఏమో కానీ ఇక్కడ వాయిల్ బరిగేలు ఇరుగుతాయి. నులక మంచమీద అటు ఇటు బొర్ర బట్టిండు. రాఘవయ్య దొర రమ్మన్నడని మా తాతకు సెప్పితే,నాకు పెద్ద బలం ఏదన్న ఐతే తాతకు విషయం చేరవేయాలి.వామ్మో ఆ ముసలోడు వయసోని లెక్క ఉంటడు,మా అయ్యకంటే ఎక్కువ విషయం సెప్పితే వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి మక్కలిరుగా తంతడు. తెల్లారితే ఎట్లా, గుండె లబ్ డబ్ లబ్ డబ్ మంటూ జర ఎక్కువ కొట్టుకుంటాంది. ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిదరలోకి జారుకున్నాడు.
పొద్దుగాల్నే రాఘవయ్య దొర, అరేయ్ సెంద్రిగా.
అయ్యా సెప్పండి.
వీరు గాడు వచ్చిండారా,
వానికి ఎంత బలుపు రా!
తెల్లారంగానే ఇంటిముందు ఉండమన్నా, వానికి భయం లేకుండా పోయింది. ఏడిరా వాడు? రాఘవయ్య కోపంతో ఊగి పోతాండు.
నాత్రి ఎగులు వారంగానే ఇంటికి రమ్మని రాఘవయ్య సెప్పిన పొద్దేక్కిన సానసేపటి దాకా వీరనాగులు అడుగు పెట్టలేదు.
మళ్ళా దొర, అరేయ్ సెంద్రిగా, వాడు వచ్చిండార?
రాలే దొర, ఎలమోడిని ఇంటికి పంపించాల్నా ఏందీ?
సెంద్రయ్యకు వణుకుడు పుడుతాంది. రాత్రి ఈశ్వరితోని, వీరనాగులు మాట్లాడేది, సూసిన విషయం ఎవడన్న సెప్పితే, సెప్పినోడు వీరు గానితో పాటు సెంద్రయ్య వున్నాడంటే బతుకుతామా … వామ్మో! ఇది ఎటుతిరిగి ఎటు పోతుందో తెల్తలేదు. వీడు జప్పున వత్తె బాగుండు. ఒరేయ్ వీరుగా,తొందరగా రారా! ఈడ ఏమి జరుగుతాందో అర్ధం కాక మనసులోనే గులుగు తాండు సెంద్రయ్య.
ఇంతలో ఎదురుగా వీరనాగులు కనపించిండు.హమ్మయ్య వీరుగాడు వచ్చిండు, అని ఊపిరి తీడుకున్నడు
మీరు ఇట్లా అన్నరో లేదో , అగో దొర, వీరు గాడు ఇప్పుడే ఇంటిలోపలికి అడుగు పెడుతాండు
రాఘవయ్య కోపంతో, ఒరేయ్ వీరుగా, దొరల మాటలకు విలువలేదారా? ఏడీకి పోయినావురా?
దొరా, పొద్దుగాల్నే ఎద్దులను తీసుకొని పొలం కాడికి పోయిన.
అవి ఎవరికీ ఇనయ్. సరే సరే, ఏందిరా పెద్దోనివి అయిపోయినావ?
లేదు దొర.
ఎక్కడ నేర్సుకున్నావురా?
ఏంటిది దొర, ఏంటిదా, సూసినవ వీడి బలుపు.
అదేరా పాటలురా, పాటలు బాగా పాడుతున్నావు కదా?
మా తాత దగ్గర దొర.
ఇప్పుడు ఏడున్నడురా మీ తాత?
కమ్మరి కేశవుల దగ్గర.దొర
ఎందుకురా?
తెల్వదు దొర.
మీ తాతకు గూడా పొగరు ఎక్కువేరా పడుసోడోలే ఊళ్ల బడి తిరుగుతాండూ,అది నీలో ఆగుపిస్తుందిరా.
ఎందుకు పిలిసిన్నో తెలుసా?
తెల్వదు దొర.
ఎర్రగా బుర్రగా ఉన్నావని, బలుపార.
ఏమి మాట్లాడకుండా
మౌనంగా వున్నడు వీరనాగులు, ఆక్షణంలో ఇగ అయిపోయింది. ఇషయం తెలిసిపోయింది కావచ్చు, ఏమి జరుగతదో తెల్వదు. మనసుల అనుకున్నడో లేదో, ఏందిరా ఏడ ఆలోచిస్తున్నావు?
ఏడ లేదుదొర.
సరే సరే, నువ్వు ఊళ్ళల్ల సిరుతల రామాయణం సెప్పుతావు కదా?
అవును దొర.
పదిఊళ్ళు తిరిగుతానావు కదా, మంది బలం పెరిగి. కళ్ళు నెత్తికెక్కి పోయినాయరా…
ఏమి మాట్లాడకుండా అలాగే ఉండి పోయాడు.
మా పెద్ద బామ్మర్ది, అదేరా దొరసానమ్మ పెద్ద తమ్ముడు, కబురు పెట్టిండు. గా మద్యల నువ్వు ఏదో ఊళ్ల కథలు సెప్పి పాటలు పాడినావట, గది ఇన్నోళ్లు మా బామ్మర్దికి సెప్పిలట. ఆ ఊరి ఎలోడిని పంపించిండు, మా బావకు సెప్పమని, వాళ్ళ ఊళ్ల వీరనాగులు,ఉంటాడంట అని. నీ పేరు దొరకంటే ఎక్కువ పోతాందిరో. సరే, నీతో కథసెప్పియాలనని, ఎలోన్నే పంపిండు. నా మాటగా సెప్పుతున్న, ఈ వినాయక చవితికి తొమ్మిది రాత్రులు
మీ బలగం అంతా వెళ్లి అక్కడ కథసెప్పాలే. మిమ్మల్ని వాళ్ళు బాగాచూసుకుంటారు. మాటతప్పిందో, ఇగ ఎట్లుంటదో తెల్వదు.
అట్లా రాఘవయ్య దొర అన్నడో లేదో, వీరానాగులు ఊపిరి తీసుకున్నాడు. అప్పటికే బయపడుతున్న సెంద్రయ్యకు, ముఖంలో పానం పోయి వచ్చినట్టు కనిపిస్తుంది.
తప్పకుండా దొర. మీరు సెప్పినంక ఇనకుంటా ఉంటమా…
సరే సరే, నేను వాళ్లకు కబురు చేస్తాను.
అనుకుంటా కండువా భుజానవేసుకుని, ఇంట్లోకి రాఘవయ్య అడుగు పెడు తున్నడు.
ఇంతల ఈశ్వరి ఎదురుగా వచ్చి, బాపు, గా సింత సెట్టుకు కాసిన ఓనకాయలు తెప్పియ్యవా అన్నది. ఒరేయ్ సెంద్రిగా, సేంద్రిగా బిడ్డకు ఓనగాయలు తీసుకొచ్చి ఇయ్యమన్నడు. వద్దులేరా గట్టిగా గాలోత్తే కొట్టుక పోతావు, నీకేడ వాకైతది కని, వాడు ఎత్తుకు ఎత్తుకున్నడు.
అరేయ్ వీరుగా, నా బిడ్డకు ఓనగాయలు తెంపుకొచ్చి ఇయ్యి.
సరే దొర.
మాట్లాడుకుంటనే, అరేయ్ సెంద్రిగా, పనోళ్లకు జీతగాళ్ళకు అందరికి సెప్పు.
దొర సానమ్మ, నేను, మా సిన్నత్త ఇంటికి పోయి ఫలహారం పండుగున్నది, పొద్దుగూకే కళ్ళ వత్తం. గుర్రపు బండిని కట్టమని సెప్పు.
అనుకుంటా ఇంట్లకు పోయిండు.
