ఈ కాలం “సామాజిక సాహితీ శాస్త్రవేత్తకు” మట్టిబిడ్డలు అంకితం

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
సీనియర్ జర్నలిస్ట్
ఎడిటర్ ఇన్ చీప్
పుడమిటివి &ఎం వి ఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్

సర్వం కోల్పోతున్న అణచివేయబడ్డ సమాజం కళ్ళనుండి ఉబికి వచ్చిన కన్నీళ్లు నేలపై దుమికి మట్టిపాలైనప్పుడు వాటిని దోసిలల్లో ఒడిసిపట్టలేము కదా కనుచూపు మేరకు ఆవహించిన చీకటి బతుకుల్లో ఇంకిన కన్నీటి ధారల ఆమట్టి పొరల్ని అద్దుకొని అక్షరాలకు పురుడు పోసి చరిత్రలో దాచివేయబడ్డ దోచివేయబడ్డ యుద్ధాల గాయాలను, తెగిన తలలు, పారిన నెత్తుటి చరిత్రను తొంగి చూస్తూ భవిష్యత్తును ముందుచూపుతో వెయ్యేళ్ళు వర్ధిల్లే విధంగా దార్శనికులు ఈ భూమిపై జన్మిస్తూనే వుంటారు. పతనావస్థకు చేరుకుంటున్న జర్నలిజం కనుమరుగవుతున్న మానవ సంబంధాలు మత, కుల,రుగ్మతలు, రాజకీయ దిగజారుడు విధానాలపై చివరకు మట్టిలో కలిసిపోతామని తెలిసిన మనుషులుగా జీవించలేని మానవ సమాజంపై సాహితివేత్తగా పాత్రికేయుడిగా, సంపాదకుడిగా ప్రతి సందర్భంలోనూ తనదైన శైలితో అక్షరవెలుగులై కె. శ్రీనివాస్ గారు నడుస్తున్న చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా తన రచనల్లో కనిపిస్తారు

నల్గొండ జిల్లా కండ్లగుంట గ్రామంలో అళహ సింగరాచార్యులు రంగమ్మ దంపతులకు జన్మించిన శ్రీనివాస్ సర్ తన పదవ ఏట నుండే రచనలు కొనసాగించారు. కవిత్వం చిన్న కథలు, పేరడీలు, అనువాదాలతో మొదలయ్యి సంభాషణ, కొత్తవంతెన, అనేక సందర్భాలు, జూన్ 2 పుస్తకాలు తాను రాసిన అనేక సామాజిక అంశాలు, ఒక అక్షరయుద్ధం ప్రకటించినట్లు సమాజ మార్పుకోరుకునే ఒక సాహితీ యోధుడి ఆవేదన ఆకాంక్ష కనిపిస్తోంది. ఇవ్వాల సిద్ధించిన తెలంగాణ కోసం వెన్నెముకై నిలబడిన ఉద్యమశక్తి, ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి పత్రికలలో పనిచేసి ఆంధ్రజ్యోతిలో సంపాదకులుగా పదవి విరమణ చేశారు అనేక అవార్డ్స్ పొందారు.

 

సాధారణ జర్నలిస్ట్ గా ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న సమయంలో వరంగల్ అగ్రికల్చర్, వరంగల్ రూరల్ వార్తలను రాస్తున్న, నాలాంటి వాడికి నాతోటి జర్నలిస్ట్ లకు ఎడిటర్లతో పెద్దగా పరిచయాలు వుండవు. మాట్లాడే అవకాశం కూడా వుండదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికకు వరంగల్ లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. ఆ సమయంలో అసిస్టెంట్ ఎడిటర్ గా కొనసాగుతున్న శ్రీనివాస్ సర్ ప్రత్యేక కాలమ్స్ ను ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా , వైద్యం, స్పోర్ట్స్, సాహిత్యం, వ్యవసాయం వార్తలకు ప్రతి వారంలో ఒక ప్రత్యేక కాలం ఇవ్వడం అందులో, వ్యవసాయం పై ‘కృషి’ రెండు పేజీలను కేటాయించి నా పేరుతో పేజీలు రాయించడం జరిగింది. దీంతో వ్యవసాయ వార్తలు రైతులపై నేను రాసిన ప్రత్యేక కథనాలు నాకు మంచి గుర్తింపు తెచ్చాయి.

హన్మకొండ చౌరస్తా రాగన్న దర్వాజ వద్ద వున్న ఆంధ్రజ్యోతి కార్యాలయంలో జరిగిన రిపోర్టర్ ల సమావేశంలో మనిషి లో కలిగే మార్పులపై అద్భుతమైన జీవిత సత్యాన్ని చెప్పారు కె ఎస్ గారు. ప్రతి మనిషి జీవితంలో మూడు రకాల మార్పు జరుగుతుంది. శారీరక మార్పు, బాల్యం నుండి వృద్దాప్యం వరకు శరీరంలో వచ్చే మార్పు దీన్ని ఎవరు ఆపలేరు అది జరిగిపోతుంది.రెండవది కాలానుగుణంగా వచ్చే మార్పు. వాన, ఎండ, చలి హెచ్చుతగ్గుల మూలంగా మనిషిలో వచ్చే మార్పు. ఇక మూడవది మనిషిలో వచ్చే అత్యున్నతమైన మార్పు. గురు బోధనలు పుస్తక పఠనం, విద్య మనం ఎలాంటి మనుషులతో ప్రయాణంచేస్తే అలాగే జీవనశైలి ఉంటుందనేది అంటే శారీరకంగా కాలానుగుణంగా జరిగే మార్పు సర్వ సాధారణం. అలాగే ఒక మొబైల్ నెట్ వర్క్ లో ఉన్న కొటేషన్ బట్టి వన్ ఐడియా చేంజ్ యువర్ లైఫ్ ఒక ఆలోచన నీ జీవితాన్నీ మార్చేస్తుంది అన్నట్లు,శ్రీనివాస్ సర్ అందించిన స్పూర్తి వ్యాఖ్యాలు నాలాంటి వాడిని కదిలించాయి.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న సమయంలో తెలంగాణ ఆకాంక్ష లేని ఇక్కడి ప్రజల అభిప్రాయాలు రాయాలని పత్రిక స్వేచ్ఛపై స్పష్టత ఇచ్చారు.కె ఎస్ గా తెలుగు ప్రజలకు పత్రిక పాఠకులకు, సాహితీకారులకు సుపరిచితులైన శ్రీనివాస్ సర్ రాసిన వేలాది వ్యాసాలు లక్షలాది మందిని కదిలించాయి.పాలకుల విధానాలపై ప్రశ్నించే గొంతుకగా తమ సమస్యలను పరిష్కరించుకునే ప్రజలకు ఆయుధమై ధైర్యాన్ని చూపాయి.

కులం గలవాడు, గోత్రంబు గలవాడు విద్యచేత విర్రవీగు వాడు పసిడి గలవాని బానిసకొడుకులు విశ్వధాభిరామ వినురవేమ.. అన్నట్లు కులం,గోత్రం విద్యచేత విర్రవీగు వ్యక్తులు డబ్బున్న వాళ్లకు బానిసలు అని చెప్పారు. దానికి విరుద్ధంగా రాజ్యాన్ని రాజు ఆజ్ఞను, రాజు ఇచ్చే పారితోషికాలు నజరాలను లెక్క చేయకుండా భాగవతాన్ని రాజును ధిక్కరించి తన ఇష్ట దైవానికి అంకితమిచ్చిన పోతన లాంటి కవులు, కాళోజీ ధిక్కార స్వరాలు కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి స్వాతంత్ర్య యోధుల జీవితాలకు వెలకట్టలేము. ప్రజలకోసం తమ సాహిత్యాన్ని జీవితాలను త్యాగంచేసి ప్రజల్లో జీవిస్తున కొందరి లాగే తెలుగు రాష్ట్రాల్లో వెలుగువెలిగిన ఆంధ్రజ్యోతి పత్రికకు సంపాదకులుగా వుండి తన రచనల్లో పత్రిక వార్తల్లో,సంపాదకీయాల్లో తనదైన శైలితో అవినీతి పైన అన్యాయం జరిగిన చోట పాలకులను నిత్యం ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారం అయ్యేవరకు ప్రజల వెంట నిలబడుతున్న అక్షరగొంతుక కె ఎస్ గారి నుండి అక్షరాయుధాలువస్తాయనే భయం పాలకులకు వుంది. స్తబ్దతకు గురైన ప్రతిపక్షాలను సైతం కదిలిస్తాయి.

పదమూడేళ్ళు మాత్రమే ఆంధ్రజ్యోతిలో కొనసాగిన నాలాంటి వాడికి ఆ పత్రిక ఇచ్చిన స్వేచ్ఛ లెగ్ వర్క్ నాజీవన శైలిలో మార్పు తీసుకవచ్చాయి. బ్యూరో చీప్ లుగా రఘునాథ్, ప్రసేన్, రాజేశ్వర్ రావు, చిలుమల్ల సుధాకర్ లు ఎడిషన్ ఇంచార్జి లు విజయ్, శంకేసి శంకర్ రావులు ఇచ్చిన వార్తల స్వేచ్ఛ వ్యవసాయ వార్తలే కాకుండా, టాస్క్స్ పోర్స్, నిఘా లాంటి ప్రత్యేక విభాగాలలో జయరాజ్, సదాశివ కామేష్ లు ఫోటో గ్రాఫర్లు దాసరి శ్రీనివాస్, గొట్టె వెంకన్న, సుధాకర్, హరీష్ లు సహకారం మరువలేనిది. మాతృ సంస్థ గా భావించే ఆంధ్రజ్యోతి పత్రిక పైన సాధారణంగానే సంపాదకుల పైన ఆత్మీయత ఉండవచ్చు కానీ ఆంధ్రజ్యోతి వదిలివేసి పదేళ్లు అవుతుంది. కె ఎస్ గారు రాసిన వ్యాసాలు, జీవనశైలి నన్ను ఎక్కువగా కదిలించాయి. ఏదో ఒక సందర్భంలో,హైదరాబాద్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో కలిసినప్పుడు కలిగిన ఆనందం నడుస్తున్న చరిత్రతో సంభాషించినట్లు వుండేది.

ప్రపంచ దేశాలలో పర్యటించిన కెఎస్ గారు వివిధ దేశాల ప్రజల జీవన విధానం మీద అధ్యయనం చేయడం అందులో జాతి వివక్షతపై చాలదేశాలలో జరిగిన సంఘటనలను అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేసిన విధానం చూసి విదేశాల నుండే ఈ దేశములో అణగారిన అణచివేయబడ్డ కులాలపై, అధ్యయనం చేసిన సంపాదకుడిగా దళితులకు ఈ దేశంలో మ్యూజియం ఉండాలని రాసిన కథనం ఈ దేశంలో అత్యంత వివక్షతో జీవించిన,జీవిస్తున్న మనుషులపైన తాను రాసిన ప్రతి అక్షరం కదిలించింది పాలకులు దళిత సమాజం పై జరిగిన దాడులు వివక్షతపై మ్యూజియం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిబద్ధతను ఆచరించాల్సిన అవసరం వుంది. అక్షరాల ఊట చెలిమే కె ఎస్ గారి రచనలు నిరంతరం పదాలుగా, కథనాలుగా, కావ్యాలుగా ప్రజల్లో చైతన్యపు వెలుగులై ప్రకాశిస్తుంటాయి. సాధారణంగా మౌనంగా నిరాడంబరంగా కనిపించే కె ఎస్ గారు సందర్భోచితంగా మాట్లాడే గొప్ప వక్త. ప్రతి మాట స్పష్టతగా ఉండటమే కాకుండా కొత్త ఆలోచనలను కలిగిస్తూ ప్రతి మనిషిని సృజన శీలిగా తీర్చిదిద్దుతాయి.

మావూరి ప్రజల పైన రాసిన ‘మట్టిబిడ్డలు’ పుస్తకాన్ని శ్రీనివాస్ సుధ దంపతులకు అంకితమివ్వాలని ఆలోచించిన వెంటనే కె ఎస్ గారిని కలిశాను. అంగీకరించడానికి సుముఖంగా లేడనీ అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇలాంటివాటికి దూరంగా ఉంటారనేది కె ఎస్ గారితో పరిచయమున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయిన అక్కడే కాసేపు నేను మౌనంగా నిలబడ్డాను. ఎందుకో సార్ సరే అన్నాడు. మా మట్టిబిడ్డల పుస్తకాన్ని కె ఎస్ గారికి అంకితమివ్వడం అంటే నికార్సైన జర్నలిస్ట్ కు ఇచ్చినట్టు, సాహితి సమాజానికీ ఇచ్చినట్టు అనుకోని నాలో తెలియని ఆనందం పెల్లుబికింది. నా కళ్ళల్లో కన్నీళ్లు చెమ్మగిల్లాయి. ఇది మట్టిబిడ్డల పుస్తకంకు దక్కిన అరుదైన అవకాశంగా భావించాను.

హైదరాబాద్ లో జరిగిన సాహితి సభల్లో సుధ మేడం ను చూశాను ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ గా పనిచేసిన చిలుమల్ల సుధాకర్, ఎడిషన్ ఇంచార్జ్ శంకేషి శంకర్ రావులు అనేక మంది సుధ మేడం నిక్కచ్చి తనం సాహిత్యం,పరిశీలన జర్నలిజం గూర్చి చెప్పారు.నేను 1994 లో ఆంధ్రసారస్వతపరిషతో తెలుగు పండిట్ శిక్షణ పొందాను పరీక్షలు రాయలేదు అక్కడ బోధించిన గురువుల్లో ఒకరు అళహ సింగరాచార్యులు ఇటీవల మరణించిన తర్వాత మా గురువు గారు కె ఎస్ గారి తండ్రిగారని తెలిసింది.

మా ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కె శ్రీనివాస్ సుధ దంపతులకు మట్టిబిడ్డల పుస్తకాన్ని అంకితమిస్తున్నాను అని చెప్పిన వెంటనే చాలా మంది నుండి వచ్చిన ప్రశ్న కె ఎస్ గారు అంగీకరించారా, అవును అంటే ఇది చాలమందికి నమ్మశక్యంకాలేదు. మరో ప్రశ్న ఆవిష్కరణకు వస్తారా అని చాలా మంది అడిగారు. వస్తున్నారని చెప్పాను. కె ఎస్ గారికి కూడా కొంతమంది ఫోన్ చేసి అడిగినట్లున్నారు, 12 అక్టోబర్ న వరంగల్ లో జరిగే సాహితీ సమావేశాలకు తప్పకుండా రండి అంటూ మట్టిబిడ్డల పుస్తకావిష్కరణకు వస్తున్నారు కదా.. అని అడిగారట. ప్రస్తుతం వున్న మీడియా పనిలో సమయం దొరకలేని పరిస్థితుల్లో అవును అక్కడి మనుషుల మీద, జితేందర్ మీద ప్రేమతో వస్తున్నాను ఇంకా ఎక్కడికి రాలేనని చెప్పారని తెలిసింది.

మట్టి బిడ్డల పుస్తకావిష్కరణ అంకితోత్సవ సభలో కె ఎస్ గారు సుధ మేడం గారు ఇద్దరు కూడా మట్టిబిడ్డలను మాకు ఎందుకు అంకితమిచ్చారో అర్ధం కాలేదన్నారు. ఇది అందరిలో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది.సభావేదికపై నేను మాట్లాడాల్సి వుండగా సమయాభావం వల్ల నేను ప్రసంగించలేకపోయాను. అసలు ఎందుకు అంకితమిచ్చానో చెప్పలేకపోయాను.

మరో భూ ప్రపంచం కోసం విశ్వంలో పరిశోధించే ఖగోళ శాస్త్రవేత్తలు, వైద్య శాస్త్రవేత్తలుఅన్ని జీవులమీద అధ్యయనం చేసే వాళ్ళు
ఎవరైనా పరిశోధించి నిరూపించగలిగినదే కదా శాస్త్రం అంటే ఇప్పుడు అక్షరాలతో సమాజ నిర్మాణం జరిగే శాస్త్రం నిలబడాలి. అందుకే పరిశోధన గ్రంథాలను కవితలను కథలను అనేక సాహిత ప్రక్రియలతో తెలుగు సమాజంలో నిలబడిన వ్యక్తి ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా వుండాల్సిన జర్నలిజం మీడియా పునాదులు కుంగి పోతున్న సమయంలో ఈ సమాజంకోసం చైతన్యపు తొలి పొద్దులై వెలుగులు పంచుతున్న కొందరిలో ఒక్కరైనా డాక్టర్ కె. శ్రీనివాస్ గారు ఈ కాలం “సామాజిక సాహితీ శాస్త్రవేత్త” గా మా మట్టిబిడ్డల తరపున భావిస్తున్న.

విద్యావంతులు,ఉపాధ్యాయులు ఎక్కువగా వున్న మా అక్షరపల్లిగా పిలువబడే మా ఆరేపల్లిలోశ్రీనివాస్ సర్ ఎడిటోరియల్ చదివిన వాళ్ళున్నారు. అందుకే సకలజీవుల కోసం చెట్టుపుట్ట మట్టి పంచభూతాలు బాగుండాలని,నిరంతరం ఆలోచించే బుద్ధి జీవులైనకె. శ్రీనివాస్-సుధ దంపతులకుమా అందరి అభిప్రాయంతోఆరేపల్లి మట్టిబిడ్డల పుస్తకాన్ని అంకితం ఇచ్చాను.🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *