
[2: సీఎం ప్రారంభించనున్నపైలాన్

ఎలకంటి నరేష్
బ్యూరో ఇన్ చీఫ్ పుడమిటివి
రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి ములుగు జిల్లా వేదిక కానుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల మధ్య మెరుగైన అనుసంధానం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న భారీ రహదారి అభివృద్ధి కార్యక్రమానికి ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ములుగు నుంచి శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ కార్యక్రమానికి గుర్తుగా ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తొలి దశలో 2,145 రహదారులను సుమారు 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి ప్రధాన రహదారులకు నిరంతర అనుసంధానం కల్పించేలా ఈ ప్రణాళికను రూపొందించారు.
గ్రామీణ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చడంతో పాటు పల్లెల నుంచి పట్టణ ప్రాంతాల వరకు మెరుగైన రహదారి అనుసంధానం కల్పించాలనే దూరదృష్టితో ప్రభుత్వం బృహత్తర కార్యాచరణకు రూపకల్పన చేసింది. ప్రతి గ్రామాన్ని మండల కేంద్రంతో రెండు వరుసల రహదారితో, మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రంతో నాలుగు వరుసల రహదారితో, జిల్లా కేంద్రాన్ని రాష్ట్ర కేంద్రంతో ఆరు వరుసల రహదారితో అనుసంధానించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
పంచాయతీరాజ్ పరిధిలోని రహదారులను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ప్రభుత్వం, బ్యాంకులు, నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో ఆర్థిక వనరులను సమకూర్చుకొని ఈ భారీ రహదారి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కార్యరూపంలోకి తీసుకురానున్నారు.
మెరుగైన రహదారులు గ్రామీణ ప్రజల జీవన విధానంలో ప్రత్యక్ష మార్పు తీసుకురానున్నాయి. రైతులు తమ పంటలను మార్కెట్లకు సులభంగా తరలించుకోవడం, విద్యార్థులు విద్యాసంస్థలకు సౌకర్యవంతంగా చేరుకోవడం, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు వేగంగా అందుకోవడం, ఉపాధి అవకాశాలు విస్తరించడం వంటి అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి.
ముఖ్యంగా అటవీ, గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్న ములుగు వంటి జిల్లాలకు మెరుగైన రహదారి అనుసంధానం అభివృద్ధికి కీలకంగా మారనుంది. రహదారుల నిర్మాణాన్ని హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టనున్నారు. నిర్మాణ వ్యయంలో ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం కానుండగా, పనులు పూర్తయిన అనంతరం కూడా నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చేలా దీర్ఘకాలిక నిర్వహణ విధానాన్ని అమలు చేయనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత 15 సంవత్సరాల పాటు సంబంధిత నిర్మాణ సంస్థలే రహదారుల నిర్వహణ బాధ్యతలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. దీంతో రహదారుల నిర్మాణంతో పాటు వాటి నాణ్యత, మన్నికకు కూడా భరోసా కలగనుంది.
ఈ బృహత్తర రహదారి అభివృద్ధి కార్యక్రమానికి ములుగు జిల్లా వేదిక కావడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం నుంచే, ఆమె శాఖకు సంబంధించిన రాష్ట్రస్థాయి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండటం విశేషం. అటవీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్న ములుగు జిల్లాను ప్రారంభ వేదికగా ఎంపిక చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల రహదారి అనుసంధానానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టమవుతోంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి మెరుగైన రహదారులే కీలకమన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమం ములుగు నుంచే ప్రారంభం కావడం జిల్లాకు గర్వకారణంగా నిలవడంతో పాటు, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది.