పుడమిటివి న్యూస్

సిఎం పర్యటన ఏర్పాట్లను పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్న మంత్రి సీతక్క తదితరులు

ఎలకంటి నరేష్
బ్యూరో ఇన్ చీఫ్ పుడమిటివి
ముస్తాబైన మేడారం.. మెరిసిపోతున్న పైలాన్, నూతన కలెక్టరేట్
రూ.16,007 కోట్ల రహదారి అభివృద్ధికి ములుగు నుంచి శ్రీకారం
రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు పైలాన్.. రూ.63.50 కోట్ల నూతన కలెక్టరేట్ ప్రారంభం
ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి
:: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
***
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో మేడారం నుంచి ములుగు వరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.
ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించనున్న మేడారం, ములుగు ప్రాంతాల్లో జరుగుతున్న తుది ఏర్పాట్లను శనివారం మంత్రి సీతక్క,మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తో కలిసి పరిశీలించారు.ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్, గట్టమ్మ సమీపంలోని పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి పైలాన్, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, అభివృద్ధి పనుల పైలాన్ ప్రాంతాలను, మేడారం వనదేవతల ప్రాంగణం, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాలు, చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ ప్రాంతం, ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్, పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రతి ప్రాంతంలో భద్రత, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
మేడారంలో ప్రత్యేక ఏర్పాట్లు
ముఖ్యమంత్రి మేడారం చేరుకునే హెలిప్యాడ్‌ను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడంతో పాటు హెలిప్యాడ్ నుంచి సమ్మక్క–సారలమ్మ వనదేవతల ప్రాంగణం వరకు రహదారులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. వనదేవతల దర్శనం, ప్రత్యేక పూజలు, మొక్కులు సమర్పించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులతో సమన్వయం చేసుకొని ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు.
వనదేవతల ప్రాంగణంలో బారికేడింగ్, క్యూలైన్లు, వీఐపీ, వీవీఐపీ ఏర్పాట్లు, భద్రతా సిబ్బంది నియామకం, అత్యవసర మార్గాలు, విద్యుత్, తాగునీటి సదుపాయాలను సిద్ధం చేశారు. ప్రాంగణంలో మిగిలిన నిర్మాణ వ్యర్థాలు, గ్రానైట్ రాళ్లను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ల్యాండ్ స్కేపింగ్, మొక్కలు, పూలతో సుందరీకరణ పనులు చేపట్టి వనదేవతల ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించే కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేశారు. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కూర్చునే సదుపాయం, తాగునీరు, వైద్య సహాయం తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రూ.16,007 కోట్ల రహదారి అభివృద్ధికి ములుగు వేదిక
రాష్ట్ర గ్రామీణ రహదారుల అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి ములుగు జిల్లా వేదిక కానుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారుల మధ్య మెరుగైన అనుసంధానం కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్యమంత్రి ములుగు నుంచి శ్రీకారం చుట్టనున్నారు.
రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ కార్యక్రమానికి గుర్తుగా ములుగు గట్టమ్మ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ పైలాన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పైలాన్ పరిసరాల్లో పారిశుధ్యం, విద్యుత్, అలంకరణ, భద్రత, వీఐపీ రాకపోకలు, పార్కింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 2,145 రహదారులను 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసే కార్యక్రమానికి ఈ పైలాన్ ప్రతీకగా నిలవనుందని పేర్కొన్నారు. ములుగు నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం రాష్ట్ర గ్రామీణ రవాణా వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తుందని తెలిపారు.
రూ.63.50 కోట్లతో నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం
ములుగు జిల్లా ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలను ఒకేచోట అందించే లక్ష్యంతో రూ.63 కోట్ల 50 లక్షల నిధులతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు.
నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో కలెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం, స్టేట్ ఛాంబర్, వివిధ శాఖల కార్యాలయాలు, విద్యుత్, జనరేటర్ సదుపాయం, తాగునీరు, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. కార్యాలయ ఆవరణలో పారిశుధ్యం, సుందరీకరణ, ల్యాండ్ స్కేపింగ్, విద్యుత్ దీపాల అలంకరణతో పాటు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడంతో నూతన కలెక్టరేట్ కార్యాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
నూతన కలెక్టరేట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, వీఐపీ వాహనాల పార్కింగ్, ప్రజలు, అధికారులు కూర్చునేందుకు అవసరమైన ఏర్పాట్లు, బారికేడింగ్, పోలీస్ బందోబస్తు, అగ్నిమాపక, వైద్య బృందాలు, అంబులెన్స్ తదితర అత్యవసర సేవలను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు.
అదేవిధంగా జిల్లాలో చేపట్టిన రూ.868 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను సూచించే నూతన కలెక్టరేట్ పైలాన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో పైలాన్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పైలాన్ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
డిగ్రీ కళాశాల హెలిప్యాడ్ సిద్ధం
మేడారం పర్యటన అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకోనున్న నేపథ్యంలో హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్, వైద్య బృందాలు, వీఐపీ వాహనాలు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలిప్యాడ్ నుంచి గట్టమ్మ పైలాన్, నూతన కలెక్టరేట్ వరకు ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనే ప్రతి అధికారి తమకు అప్పగించిన బాధ్యతపై పూర్తి అవగాహనతో ఉండాలని, చివరి నిమిషంలో ఏ సమస్య తలెత్తినా సమయస్ఫూర్తితో పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యే వరకు సంబంధిత అధికారులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎక్కడా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ వ్యవస్థలు సిద్ధంగా ఉంచాలని, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలకు ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్
నిర్ణీత పర్యటన షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు మేడారం చేరుకుంటారు. అక్కడి నుంచి సమ్మక్క–సారలమ్మ వనదేవతల ఆలయానికి చేరుకొని మధ్యాహ్నం 1.40 గంటల నుంచి 1.50 గంటల వరకు వనదేవతలను దర్శించుకుంటారు.
అనంతరం వనదేవతల ప్రాంగణం వేదికగా చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసి, భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.
మేడారం కార్యక్రమాల అనంతరం హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి గట్టమ్మ ఆలయ సమీపంలో రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్ వద్దకు చేరుకొని మధ్యాహ్నం 2.30 గంటలకు పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు రూ.868 కోట్ల అభివృద్ధి పనులను సూచించే పైలాన్‌ను ప్రారంభించి, రూ.63 కోట్ల 50 లక్షల నిధులతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్ నుంచి హనుమకొండ జిల్లా పరకాల పర్యటనకు బయలుదేరుతారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మేడారం నుంచి ములుగు వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అధికారులు, పోలీస్ శాఖ, వివిధ విభాగాల సిబ్బంది సమన్వయంతో పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి సీతక్క తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు,జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వస్సల్ టోప్పో, భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్, ఏటూరు నాగారం ఎఎస్పీ మనన్ భట్,అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, ఆర్డీవో కృష్ణవేణి,స్థానిక ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.