
వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

ఎలకంటి నరేష్
తెలంగాణ బ్యూరో చీఫ్ పుడమిటివి
* ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయని తెలిపారు. రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో వరంగల్ రూపురేఖలు మరింతగా మారబోతున్నాయని పేర్కొన్నారు..
అభివృద్ధి, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతోందని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. అర్హులైన పేదలకు మాత్రమే రేషన్ కార్డులు అందేలా చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన అవకతవకలకు తావులేకుండా నిజమైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అలాగే మామునూరు విమానాశ్రయం వరంగల్ ప్రజల చిరకాల కల అని, అది 2028లో సాకారం కానుందని ఎంపీ తెలిపారు. అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మెగా టెక్స్టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వరంగల్ అభివృద్ధిపై పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, జిల్లాకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ముందడుగు వేసి కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కృషి చేస్తున్నారని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలము కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు.
వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఎంపీ తెలిపారు. దాదాపు రూ.6,500 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. ప్రజల చిరకాల కల అయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
వైద్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని కడియం కావ్య పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడంతో పాటు వరంగల్‌లో 24 అంతస్తులతో అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ఆస్పత్రి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
విద్యా రంగంలోనూ ప్రభుత్వం విస్తృతంగా మార్పులు తీసుకొస్తోందని ఎంపీ తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుతో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు గృహప్రవేశాలు జరిగాయని, ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేస్తూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని తెలిపారు. మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
వరంగల్ అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు మంజూరు చేయడంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సహకరిస్తున్నారని ఎంపీ డా.కడియం కావ్య అభినందించారు. భవిష్యత్తులోనూ జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేయకుండా విమర్శలకే పరిమితమవుతున్నాయని అన్నారు. ప్రజలు కళ్లారా జరుగుతున్న అభివృద్ధిని గమనించి, పనితీరును బట్టి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ , అదనపు కలెక్టర్ రవి, ఆర్డీఓ వెంకటేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.