సేదబాయి నవల ఎపిసోడ్ 07

ఎంవిఆర్ భవనం నుండి
పుడమిటివి జనసాహిత్యం

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవిఆర్ మానవవికాస రచనలు.

ఊరంత ఒక్క కట్టుగా ఉండి వీరానాగులు కోసం వెతుకు తాళ్ళని తెలిసి దొర మండిపడ్డడు. రజాకార్లకు అనుచరిడిగ ప్రజల మీద అరాచకాలు చేస్తున్న దొరతొత్తులైన “హైదర్ సాహెబ్, మైనొద్దీన్, మదార్ సాహెబ్ లను పిలుపించుకొని,ఊరిప్రజల మీద దాడి చేయమని హుకుంజారీచేసిండు. “ఎవ్వడు దొర’ నీమాటకు ఎదురు సెప్పేది, ఒక్కొక్కడిని, ఒక్కొక్కడిని కిళ్లకు కీళ్ళు ఇరగొడుతా తలలుతీసి నీ కాళ్ళముందు పడేత్త అంటూ హైదర్ సాహెబ్, అతని అనచరులు,చేతిలో పొడవాటి కత్తులు పట్టుకొని గుర్రాల మీద ఊరోళ్లు వెతుకుతున్న సెట్లళ్లకు పోయ్యిళ్ళు.

పొదలనుండి వాసన వత్తాందని, పొదల కాడికిఎల్లినోళ్లు నోరేళ్ళబెట్టారు. జంగపిల్లి సచ్చి, బాగా ఉబ్బి పురుగులు బట్టి, సెడవాసన వస్తాంది.ఆ వాసన భరించలేక ముక్కులు మూసుకొని ఆక్కడినుండి వెళ్లిపోయారు.ఒకవైపు కంపు వాసన మరో వైపు “దొడ్డుఈగలు’ గుయ్యి గుయ్యి మంటూ సుట్టు తిరుగుతాంటే ఉండబట్టలేక శివయ్య సాంబయ్య, చంద్రయ్యలు కాసింత దూరం పోయి పరుపుబండమీద కూసున్నరు.

ముగ్గురు కాసేపు ఏమి మాట్లాకుండ మౌనంగా వున్నరు.ఇంతల సాంబయ్యకలగజేసుకొని ఒరేయ్ చంద్రయ్య కాళ్ళుజర  గుంజబట్టే తిరిగితిరిగి యాస్ట కొచ్చింది. ఈడ ఒరిగి నిద్రపోవాలె అనిపిస్తాంది, నిద్ర రాదు గాని ఆగిన గా ముచ్చట జరఇగ ఏమి జరిగిందో సెప్పర?అన్నాడో లేదో చంద్రయ్య గయ్యిమని లేసిండు ఏందేందీ ఏమి సెప్పాలరా! ఎనకటికి ఒకడు పేమతో పిల్లనిత్త అల్లుడా అంటే లేసి లేసి పోయి లేకిడిదాన్ని సేసుకున్నడంట వాళ్ళ పేమ ఎట్ల మొదలయ్యిందో సెప్పుతాంటే సోది సెప్పేటోన్నిలెక్క నేను సెప్పేది సేవిన బెట్టకుండా, కుదురగా ఉండకుండ లేసిలేసి అటుఇటు తిప్పబట్టిరి సచ్చిన పిల్లికాడికి తీసుకపోయి ఆ కంపువాసన నసలానికి ఎక్కేటట్టు సేత్తిరి, కడుపులంత దేవులాడి పేల్సుక రాబట్టే ఇగ ఏమిసెప్పాలే సెప్పు అంటూ చంద్రయ్య గుస్సాయించ బట్టిండు. ఇంతల అరేయ్ చంద్రిగ ఏమిసెప్పుతావో సెప్పురా అన్నడు శివయ్య. నేను సెప్పుతాంటే ఇనకుండా వుంటే ఊకోను మరి ఇగ ఇను అని సెప్పబట్టిండు.

వాడు పాటఎత్తుతున్నడంటే… ఎవడ్రా చంద్రిగా సాంబయ్య అనంగనే ఇగ సూడు మద్యల రాకు అన్న కదా! వీరనాగులే పాటపాడితే అడవిల వున్న నెమలి ఎగురుతది , కోకిల సంబురపడుతది గట్ల పాడుతడు. ఆ సింత సెట్టు కాడ, సింతకాయలు ఈశ్వరీని ఎత్తుకొని తెంపిఇచ్చిన తర్వాత వారం రోజులకే రాఘవయ్య గడీ ముందు చిరుతల రామాయణం,సెప్పబట్టీళ్ళు ఆడమగ పిల్లజెట్రా ఊరంతా వచ్చిళ్ళు. రాఘవయ్య కూడా రెండుకర్ర కుర్చీలు పాలేరు మల్లయ్యతో తెప్పించుకొని ఒక కుర్చీల రాఘవయ్య మరో కుర్చీబిడ్డఈశ్వరితో దర్జాగా కూసున్నడు. ఇగ సిరుతల రామాయణం మొదలయ్యింది.

ఆరడుగుల ఎత్తు తెల్లముఖం, సొగసరి తనం అందరిలో కలిసి పోయే గుణం రాగమెత్తితే అందరూ మంత్రముగ్దలు కావల్సిందే అగొ గట్లాంటి వీరనాగులు రామునివేషం వేషిండు,. రాములోరి కథ సెప్పుతాం ఇగ ఇనండి అంటూ కథ మొదలయ్యింది. వీరనాగులు పాటపాడుకుంటూ జనం మధ్యలోకి రావంగానే ఒక సప్పట్లు కాదు సుట్టూ కానుగ నూనెతో వెలుగుతున్న కాగడాల మధ్య వీరనాగులు ముఖం ఇగ వెలిగిపోతాంది. “అగో ‘గా వెలుగులోనే ఈశ్వరీ ముఖం చూసిండు. ఆ వెలుగంత ఆమే ముఖంలోనే వీరనాగులుకు కనపడ్డది. ఈశ్వరిని చూసిన వీరనాగులు కథ బాగసెప్పాలనుకున్నాడుఅందరూ కథలోకి వెళ్లారు.

రాముడు,సీతమ్మతల్లీ లక్ష్మణుడు రాజ్యం ఇడిసి పోతాళ్ళు వాళ్ళు అడవులకు పోతాళ్ళని ఒక్కోక్కరు గోళ్లున ఏడవబట్టీళ్ళు రాజ్యమంత కన్నీళ్లు పెట్టుకున్నదని సెప్పుతాంటే అక్కడ వున్న ప్రతి ఒక్కరి కళ్ళనుండి జలజల కన్నీళ్లు నేలపైన దుముకుతున్నయి.ఇగ అడవిలోకి పోతున్న వాళ్ళు అందరి మధ్య నుండి కాసింత సీకట్లకు పోయిళ్లు,

ఇంతల వీరనాగులు గోసి ఊడిపోయి,ఊగులాడు తున్నది ఎవ్వలు సూడలేదు కదా అనుకోని దబదబా అడుగులు వేసి సర్రున రాఘవయ్య ఇంట్లోకి పోయిండు. అంత సికటిలో,గోసి సదురుకుంటాండు. గప్పుడు సిన్నగా గజ్జెల సవ్వడి ఇనపడ్డది గీసీకట్ల గజ్జెల సవ్వడి ఏందీ జరా అటుఇటు జూసిండు. అంతే ఎదురుగా ఈశ్వరీ! సిన్నగా ఎవరూ,అన్నడు అటునుండి సమాధానం లేదు ఆమే అక్కడి నుండి కదులుతలేదు నెమ్మదిగా దగ్గరికి పోయిండు. ఈశ్వరి అని తెలిసిన మళ్ళా ఎవరు నువ్వు అనిఅడగబట్టిండు. అయిన సమాదానం లేదు. వీర నాగులుకు సేమటలు బట్టినయి ఎవరైనా సూత్తేఎట్లా? అని. సిన్నగా ఆమే భుజం మీద సెయ్యివేసి ముఖం ఇటుతిప్పమన్నడు. ససేమీర ముఖం తిప్పుతలేదు.ఈశ్వరి ఒంటరిగా కలిసింది అనే సంతోషం ఇట్ల ఎవరైన సుత్తారనే భయం ఇదంతా దూరం నుండి చంద్రయ్య గమనిస్తాండు.వీళ్ళమద్యలోఏదోజరుగుతాంది అని. చంద్రయ్య వాళ్ళవంకనే సుత్తాండు,

ఇంతల ఒరేయ్ వీరనాగులు ఏడవున్నావురా ఏడీకి పోయినావు ఏందిరా కథ మొదలు పెట్టాలె అన్న పిలుపు వినిపించింది.అంతే ఈశ్వరిని ఇడిసి వీరనాగులు అటు వైపు చూసి పోవాల్న వద్దా అని ఆలోచించబట్టిండు

(మరో ఎపిసోడ్ లో కలుద్దాం
ఇంకా వుంది )

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *