సేద బాయి -ఎపిసోడ్ 03

పుడమిటివి -జనసాహిత్యం

ఎంవిఆర్ భవనం నుంచి

నాగబెల్లి జితేందర్ సామ్రాట్

ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి -ఎం వి ఆర్ మానవవికాస రచనలు

కన్నెపిల్లలంతా ముచ్చట్లు వేసుకుంటూ పగలబడి నవ్వుతాళ్లు. ఆమే నీళ్లను తోడ టానికి బాయిలో బొక్కెనను వేసింది. బొక్కేనలలోకి సగంకంటే ఎక్కువ నీళ్లే సేరినయి.బాయి వైపుకి ఒళ్లంతా బురదతో వస్తున్న వీరనాగులును చూసి కన్నెపిల్లలు నవ్వులు ఆపారు.

ఆమె బొక్కెనను గిరక మీద తాడుతో లాగుతున్నది. వెనక్కి చూసింది. అంతే, బురదతో ఉన్న వీరనాగులును చూసి తాడును వదిలి తొర్లి పడబోయింది.అంతే
ఒక్క ఉదటున ఆమె నడుము మీద సెయ్యి వేసి గట్టిగా పట్టుకొని తాడును లాగాడు. గిర్రగిర్రా గిరుక తిరుగుతాంది. బొక్కెన పైకి వచ్చి ఇద్దరి మీద నీళ్లు గుమ్మరించినట్టు పడ్డాయి.

ఈశ్వరి… ఈశ్వరి…” అంటూ తోటి ఆడపిల్లలు అరుస్తున్నారు. ఒళ్లంతా నీళ్లు పడంగానే ఇద్దర ఒకరికొకరుగట్టిగాపట్టుకున్నారు.తాచుపాములుఅల్లుకున్నట్లు.  ఇద్దరి మధ్య గాలికుడా దూరలేనంత పెనవేసుకున్నారు.వాళ్ళు మైమరచి వున్నారు ఇంతలో తాడుతో సహా బకీటు గబుక్కున బాయిలోకి పడిపోయింది.

ఇరవై రెండేళ్ల వీరనాగులుకు పద్దెనిమిది ఏళ్ల ఈశ్వరి అంటే ఎనలేని ప్రేమ. ఆమె అచ్చం పోతపోసిన బొమ్మలెక్కనే అందంగా ఉంటది. ఆమె కాళ్ల సవ్వడి విని తన్మయత్వం పొందే అతనికి, ఆమె తనను పెనవేసుకోవడంతో ఆ మైకం నుండి బయటకు రాలేకపోయాడు.

కర్ణం దొరబిడ్డను బాయికాడ, వెలివాడ పిల్లగాడు ముట్టుకున్నడని ఆ ఊరంతా ఒకరి నుండి ఒకరికి పాకిపోయింది  ఇంకేముంది… “అంటరానోడు ఆ పిల్లను ముట్టుకుంటాడా? సంగతెందో చూద్దాం!” అంటూ కోపంతో ఊగిపోతూ, ఇయ్యాల సాటింపు చేయమని హుకుం జారీ చేసిండు ఊరి దొర.”రేపు పొద్దుగాల్నే ఊరి సివరన రాల సెట్టుకాడికి అందరూ రావాలి,” అని చెప్పిండు.

ఇగ మల్లిగాడు డప్పు చేతిన పట్టుకొని సందులుతిరుగుకుంటా…”ఇన్నోళ్లు, ఇననోళ్లు.. ఎవరో! రేపు ఊరుఊరంతా   రాల సెట్టుకాడికి రావాలి వుల్లో…” అంటూ సాటింపు చేస్తూ ఊరంతా తిరిగిండు.

అసలు గాపిల్ల బాయికాడికి ఎందుకు పోయింది? వీరానాగులు కోసమా! బాయిలపడబోయిన ఆమెను పట్టుకుని కాపాడడు కదా మరి ఎందుకు సాటింపు చేస్తున్నారు ఇది అమ్మలక్కలు ఊరిపోరగాల్ల మెదడులల్ల తోలుస్తున్న ప్రశ్నలు ఈ తెల్లారితే ఎట్లా ఉంటదో గానీ ఈ రాత్రి ఏమైతదో కదా దొర కన్నెర్రా జేసిండు ఎట్లుంటదో అక్కడ నిలబడ్డ అందరి నోళ్లల్లో నుండి వస్తున్న మాటలు ఇంతలో దొర మనుషులు వాడలపొంటి
తిరుగుతున్నారు భయంతో అందరూ ఇళ్లలోకి వెళ్లి తలుపులు పెట్టుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *