పుడమిటివి -జనసాహిత్యం

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి -ఎంవి ఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్
లచ్చవ్వ కొడుకుతో పాటు సుట్టుపక్కలోల్లను రమ్మనమంది. వీధి ముందు నిలబడి, “లచ్చుమయ్య, సాంబయ్య, ఎల్కయ్య… అందరూ నాగళ్లను కట్టండి. గట్టిగా వానపడ్డదంటే నాగళ్లు సాగవు. ఎకరం, రెండు ఎకరాలు కాదు. ఈ గుట్టకాడి నుండి కంచెదాకా దున్నాలే,” అంటూ అందరినీ పురమాయించింది.
అంగట్లనుండి బ్యారం జేసిన కాడి నుండి రెండేళ్లు అయినా కాలేదు. ఎప్పుడు ఎడ్లు ఇట్ల సేయకపాయె. ఎందుకో ఇట్ల జెయబట్టే. “ఇయ్యాల నాకు కోపం వచ్చే టట్లు సేయద్దు,” అంటూ ఎడ్లను దొడ్డినుండి నాగలికి కట్టిండు.
ఒక ఎద్దు మరో ఎద్దుతో రాను అన్నట్లు ఒక దిక్కుకు గుంజుకుపోతాంది. “చల్!” అని రెండింటి ఈపుల మీద గట్టిగా సరిసిండు. ఇగ నాగలి గట్టి పానది.
పొంటి పోతున్న వీరనాగులుకు పడుసు అమ్మాయిలు ఎదురయ్యిళ్లు. నాగలి ఎనుకనే కాళీ బిందెలు పట్టుకొని వస్తాళ్లు. నడుమున బిందెలు ఎత్తుకొని కొందరు ఎదురుగా వస్తాళ్లు.
వీరనాగులు కళ్ళు ఎవరికోసమో వెదుకుచున్నాయి. ఆ అందాల రాణి కానరాకపోవడంతో కొంచెం దిగులుగా పొలం వైపుకు నాగలితో వెళ్లాడు. నేలంతా సెరువులెక్క వున్నది. వీరనాగులు నాగలితో పొలమంతా దున్నడం మొదలు పెట్టిండు. ఎనక నాలుగు నాగళ్లు వత్తానయి. అందరూ సంబురంగా పొలం దున్నడం మొదలు పెట్టిల్లు.
ఆమె కన్పించకపోవడంతో వీరనాగులులో దిగులు ఇంకా ఎక్కువయ్యింది. ఎద్దుల్ని కదిలిస్తూ సాగుతున్నాడు. గప్పుడే కంచెకాడి పచ్చని సెట్లపొదల నుండి సిన్నగా కాలిగజ్జెల సప్పుడు సెవులపడ్డది.
గంతే ఒక్కసారిగా ఉషారొచ్చింది వీరనాగులుకు. ఎక్కడి నుండి వస్తుందో తల తిప్పి సూడబట్టిండు. ఇగ నాగలితో దున్నేడమే మరచిపోయిండు. ఇంతలో ఒక ఎద్దు నాగలిని ఇడిసే ప్రయత్నం చేసింది. నాగలి కర్ర మీద కాలు వేసిన వీరనాగులుకు ఏమి జరిగిందో తెలిసేలోపే బురదలో పడిపోయిండు. ఎడ్లు నాగలిని ఇడిసి ఉరక బట్టినయి.
లేవలేక పోతున్న వీరనాగులును ఎల్లయ్య, సాంబయ్యలు పైకి లేపిల్లు. ఒళ్లంతా బురద రాసుకున్నట్లు వుంది. ఒళ్లంతా మట్టివాసన బురదను కడుక్కోవడానికి గట్లపొంటి నడుసుకుంటా నడుసుకుంటూ వెళ్లుచున్నాడు. అడుగులు ఎత్తాండుగాని మనసు ఎక్కడో వుంది.