సన్నాసి వేషాలెంది

పుడమిటివి జనసాహిత్యం

సామ్రాట్ పలుకులు

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమి టివి -ఎంవిఆర్ మానవవికాసరచనల పబ్లికేషన్స్

రోడ్లపై గుంతలు పూడ్చే దాకా
తడిబట్టలతో కూర్చోండి…
కొన్ని ప్రమాదాలైనా తప్పుతాయి.
చెత్తతో నిండి, నీళ్లతో కంపు వాసన కొడుతున్న
మురికి కాల్వలను
యంత్రాంగాన్నంతా నిలబెట్టి శుద్ధి చేయించండి.
ముక్కులు మూసుకుని పోకుండనైనా ఉంటారు.
బడుల్లో మూత్రశాలలు లేక,
పారిశుద్ధ్య కార్మికులు లేక
అరిగోస పడుతున్న ఆడపిల్లల గోస తగలకుండా చూడండి.
కాసింత పుణ్యం మూటగట్టుకుంటారు.
అరవై ఆరు డివిజన్లలో
ఆరు ఫాగింగ్ మిషన్లు కూడా లేక,
డెంగ్యూ, మలేరియాతో అల్లాడుతున్న నగరవాసులకు
మీ అధికార–ప్రతిపక్ష బలంతో వాటిని తెప్పించండి.
కొందరి చావులనైనా ఆపగలుగుతారు.
చెప్పుకుంటూ పోతే
తలనిండా సమస్యలే ఉన్నాయి.
ఈ మట్టిపై వెలిసిన
కాకతమ్మ శక్తిపీఠం,
భక్తుల నమ్మకమైన
భద్రకాళి తల్లి ముందు
సవట మాటలు… సన్నాసి వేషాలేంది!
సవాళ్లు విసరుడేంది…
తడిబట్టలతో ప్రమాణాలు చేసుడేంది…
మైలపడ్డదని పసుపు నీళ్లు చల్లుడేంది…
మా ఓరుగల్లు ఇలవేల్పు,
అమ్మలకే అమ్మ
కొట్లాది మంది భక్తుల కొంగు బంగారం
కండ్లు ఎర్ర చేయక ముందే…
మా ఓట్లతో పుట్టిన నేతల్లారా!
వేల కోట్ల నిధులు ఎటు మాయమైనాయో
ఎవరికివారికే ఎరుక.
ఆ గుట్టు విప్పి,
లెక్కలు అడిగే ఓపిక
ఎవరికీ లేదాయే…
మీ ప్రమాణాలకూ, సవాళ్లకూ సాక్షిగా,
మహానగరాన్ని అద్దంలా చేయండి.
పల్లెల్లో పచ్చటి తోరణాలు నింపండి.
కాసింత ఊరటైనా లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *