అభివృద్ధితోనే రాయలసీమకు కొత్త గుర్తింపు ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

పుడమిటివి ఆంధ్రప్రదేశ్ న్యూస్

ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

 

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ -ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి

 

కరువు తో పోరాడిన రాయలసీమను ఇకపై కరువు సీమగా కాకుండా, ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

రైతులకు సాగు నీటి సదుపాయాలను మెరుగుపకరచడంతోపాటు, పంటలను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు అవసరమైన రహదారులు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, అదనపు విలువ లభించేలా ఆధునిక కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు సమగ్ర వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి రాయలసీమ రైతుల ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌తోపాటు ప్రపంచ మార్కెట్‌కు చేరేలా చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.

శుక్రవారం మదనపల్లెలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన మహోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మాల సీతారామన్ , ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాయలసీమ గొప్ప చరిత్రకు, ప్రత్యేకమైన సంస్కృతికి, ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిన నేల. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన ఈ ప్రాంతం ఒకప్పుడు అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఫ్యాక్షన్‌ రాజకీయాల ప్రభావంతో అశాంతికి గురైన సందర్భాలు ఉన్నాయి.

అభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన ప్రాంతంలో పచ్చని చెట్లను సైతం నరికి వేసిన పరిస్థితులు చూశారు. ఆ పరిస్థితుల నుంచి రాయలసీమను బయటకు తీసుకువచ్చి, అభివృద్ధి బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారు. 2024లో మీరు అందించిన ప్రజా తీర్పు ఈ మార్పుకు మరింత బలాన్ని ఇచ్చింది. ప్రజలు ఇచ్చిన ఆ విజయంతోనే ఈ రోజు రాయలసీమలో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి కార్యక్రమాలకు బాటలు పడ్డాయి.

రెండేళ్లలో రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులు

పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత 2 ఏళ్లలో రూ.8 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టాం. అందులో భాగంగా రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో, అందులో రాయలసీమ ప్రాంతాన 62 వేల ఎకరాల్లో 28 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఉద్యాన పంటల సాగును విస్తరించాం. నీటి సంరక్షణలో భాగంగా దాదాపు 70 వేల ఫామ్ పాండ్లను నిర్మించి, అదనంగా 50 వేల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చాం. రూ.4,500 కోట్లకు పైగా నిధులతో 23 వేలకు పైగా రహదారి పనులను చేపట్టి, 5 వేల కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశాం. ఉపాధి హామీ నిధులతో ప్రాజెక్ట్ జలధార ద్వారా నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేస్తూ, రాయలసీమను నీటి భద్రత ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా ఎన్నో చర్యల చేపట్టాం. తద్వారా ఈ ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరిగాయి.

45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ యాపిల్ సాగు

రాయలసీమ రైతుల పట్టుదలకు ఉద్యాన సాగులో వస్తున్న మార్పులే నిదర్శనం. సాధారణంగా యాపిల్ సాగుకు అనుకూలంగా భావించని 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అనంతపురం ప్రాంతంలోనూ కూడా కె.ఎల్.డి. యాపిల్ సాగు సాధ్యమైంది. రాయలసీమలో మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, నిమ్మ, స్వీట్ ఆరెంజ్ తోపాటు డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, ఆపిల్, బెర్రీస్ వంటి అధిక విలువ కలిగిన పంటలను కూడా సాగు చేస్తున్నారు. మదనపల్లె ఆసియాలోనే అతిపెద్ద టమాటా సాగు ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. రాయలసీమలో ఉద్యాన పంటలకు ఉన్న అపారమైన సామర్థ్యానికి ఇది నిదర్శనం.

మూడు దశల్లో రూ. లక్ష కోట్ల ప్రణాళిక

ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద రూ.40 వేల కోట్ల ప్రభుత్వ పెట్టుబడితో పాటు, రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తూ, రాబోయే 3 సంవత్సరాల్లో 3 దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. రాయలసీమతో ఎల్ పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను కలుపుకుని మొత్తం 10 జిల్లాల్లోని 201 క్లస్టర్లలో ఈ ప్రణాళిక అమలు కానుంది. సాగునీటి కోసం రూ.21 వేల కోట్లతో రిజర్వాయర్లు, కాలువలు, చెరువులను అభివృద్ది చేసి 9 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడంతోపాటు 4.3 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరిస్తున్నాం. 6.5 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ ను విస్తరిస్తున్నాం. మరో రూ.15 వేల కోట్లతో 6 లక్షల హెక్టార్లలో ఉద్యానవన సాగును విస్తరించి, ప్రస్తుతం ఉన్న 8.4 లక్షల హెక్టార్ల ఉద్యాన విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సుమారు రూ.4, 500 కోట్లతో దాదాపు 6 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం.

రైతు పొలం నుంచి ప్రపంచ మార్కెట్ వరకు

రైతు పండించిన పంటకు సరైన విలువ లభించేలా కోల్డ్ స్టోరేజీలు, ప్యాక్‌హౌస్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వాల్యూ అడిషన్ సెంటర్లు, ఎగుమతి మౌలిక వసతులను ఉద్యానవన క్లస్టర్లతో అనుసంధానం చేయబోతున్నాం. పంట ఉత్పత్తి నుంచి నిల్వ, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్, ఎగుమతుల వరకు పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఈ మౌలిక వసతుల ద్వారా 40 నుంచి 45 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని నష్టపోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. మూడో సంవత్సరం నుంచి సుమారు రూ.81 వేల కోట్ల అదనపు గ్రాస్ వ్యాల్యూ అడిషన్‌తో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 లక్షల ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కు శంకుస్థాపన చేశాం. ఈ సంస్థ రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు డిజిటల్ అగ్రికల్చర్, ప్రిసిషన్ ఫార్మింగ్, క్రాప్ మానిటరింగ్, స్మార్ట్ ఇరిగేషన్, మార్కెట్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక విధానాలను వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయడంలో ఈ సంస్థ కీలకంగా ఉంటుంది. ఈ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య కార్యక్రమంలో భాగస్వామిగా ముందుకు వచ్చినందుకు, మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు మద్దతు అందించినందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ అంబానీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

జల్ జీవన్ మిషన్‌కు కేంద్ర సహకారం

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన జల్ జీవన్ మిషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి కొనసాగించాల్సిన అవసరాన్ని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, సానుకూలంగా స్పందించి 2028 డిసెంబర్ వరకు పొడిగించి, సుమారు రూ.30 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ ను ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాయలసీమను ఇకపై గతంలో ఎదుర్కొన్న కరువులతో కాదు.. సీమ సాధిస్తున్న అభివృద్ధితో, సృష్టిస్తున్న విలువతో, కల్పిస్తున్న అవకాశాలతో, ప్రపంచ మార్కెట్లకు చేరుతున్న తన సామర్థ్యంతో గుర్తించబడేలా తీర్చిదిద్దుదాం. రాయలసీమను ప్రపంచ అవకాశాలకు కేంద్రంగా నిలబెడతాం” అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నారా లోకేష్, శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీ నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్, ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ ముఖేష్ అంబానీ, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ తోపాటు కూటమి పార్టీలకు చెందిన శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర స్థాయి ఛైర్మన్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *