నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమి టివి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, విద్య, పరిశ్రమలు, స్థానిక సంస్థలు తదితర అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ శాఖల కృషితోపాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పరిశ్రమల భాగస్వామ్యాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. మంగళవారం మంగళగిరిలోని అరణ్యభవన్‌లో శ్రీ నాగబాబు గారి అధ్యక్షతన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026–27 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, హరిత ప్రణాళికలు, వాటి అమలుకు అవసరమైన కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ… “ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా నర్సరీల ద్వారా 10 కోట్ల మొక్కలను సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి దశలో 500 మండలాల్లో 500 నర్సరీలకు అనువైన స్థలాలను గుర్తించి, 15 వేల ప్రైమరీ బెడ్లను ఏర్పాటు చేయాలి. మొక్కలు నాటడంలో సంఖ్య కంటే నాణ్యతకు, నాటిన మొక్కల సంఖ్య కంటే వాటి మనుగడ శాతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. స్థానిక వాతావరణం, నేల స్వభావానికి అనువైన జాతులను నర్సరీల్లో పెంచాలి. రావి, మర్రి, వేప, చింత, కానుగ, ఉసిరి, పనస, మోదుగ, ఇప్ప, రేల వంటి స్థానిక జాతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. రైట్ ట్రీ–రైట్ ప్లేస్ అనే విధానాన్ని పాటించాలి.
రహదారుల వెంబడి పచ్చదనం విస్తరణకు ప్రణాళిక
రహదారుల వెంట పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతి మండలానికి ప్రత్యేక ప్లాంటేషన్ టార్గెట్‌ను నిర్దేశించడంతో పాటు భూమి లభ్యత, మొక్కల ఎంపిక, నాటడం, నీటి సరఫరా, రక్షణ, సర్వైవల్ మానిటరింగ్‌పై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. 3 నుంచి 5 మీటర్ల ఎత్తు ఉన్న బలమైన మొక్కలతో ట్రీ బ్యాంక్స్ ఏర్పాటు చేసి రహదారులు, పట్టణాలు, ప్రభుత్వ ప్రాంగణాల్లో వ్యూహాత్మకంగా వినియోగించాలి. ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలను గుర్తించి పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భూములు, పట్టణ ఓపెన్ స్పేస్‌లను అవెన్యూ ప్లాంటేషన్లు, బ్లాక్ ప్లాంటేషన్లు, మియావాకీ, డెన్స్ ప్లాంటేషన్లకు వినియోగించాలి.
తీర ప్రాంత పరిరక్షణతోపాటు గ్రీన్ ఎకానమీకి ప్రోత్సాహం
రాష్ట్రానికి ఉన్న దాదాపు 1,053 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరాన్ని కాపాడుకోవడానికి పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలి. కోస్టల్ గ్రీన్ బెల్ట్స్, సముద్ర అలల ఉధృతిని తగ్గించే మడ అడవులను పెంపకం. తీరంలో రక్షణగా నిలిచే తాటి చెట్ల తోటలను పెంచడం, గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయాలి. నర్సరీలను కేవలం మొక్కల పెంపక కేంద్రాలుగా కాకుండా గ్రీన్ ఎకానమీ సెంటర్స్ గా అభివృద్ధి చేయాలి. స్థానిక యువత, మహిళా సంఘాలకు మొక్కల పెంపకం, నిర్వహణ, సంరక్షణలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఏపీ గ్రీన్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కూడా సృష్టించాలి.
పరిశ్రమల భాగస్వామ్యంతో హరిత కార్యక్రమాలు
పరిశ్రమల భాగస్వామ్యంతో సీఎస్ఆర్, సీఈఆర్ వనరులను వినియోగించుకోవాలి. వన్ ఇండస్ట్రీ–వన్ విలేజ్, వన్ ఇండస్ట్రీ–వన్ గ్రీన్ జోన్, వన్ ఇండస్ట్రీ–వన్ గ్రీన్ కారిడార్ వంటి నమూనాలను అభివృద్ధి చేయాలి. ఏపీ గ్రీన్ లో పారదర్శకత, జవాబుదారీతనం కీలకం. నర్సరీ నుంచి ప్లాంటేషన్ వరకు జియో ట్యాగింగ్, డిజిటల్ రికార్డులు, డ్యాష్‌బోర్డును బలోపేతం చేయాలని సూచించారు. “ఎక్కడ నాటాం? ఎన్ని నాటాం? ఎన్ని బతికాయి?” అనే మూడు ప్రశ్నలకు ప్రతి స్థాయిలో స్పష్టమైన సమాధానం ఉండాలి. ప్రతి లక్ష్యానికి వ్యక్తిగత బాధ్యతను నిర్దేశించాలి. ఎవరు బాధ్యత వహిస్తారు, ఎక్కడ అమలు చేస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, నిర్వహణ ఎవరు చేపడతారు, ఎంత సర్వైవల్ రేటు సాధించాలి అన్నది ముందుగానే నిర్ణయించుకోవాలి.
మనం నాటేది మొక్క కాదు.. మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు
పెద్ద లక్ష్యాలను స్పష్టమైన టార్గెట్లు, నిర్దిష్ట కాలపరిమితులు, బాధ్యతలు, నిరంతర పర్యవేక్షణతో చిన్నచిన్న దశలుగా విభజించి అమలు చేస్తే 2047 నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించవచ్చు. కేవలం మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తయినట్లు భావించరాదు. ఒక విత్తనం నాటినప్పటి నుంచి అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు నర్సరీ, నాటడం, రక్షణ, మనుగడ, ఎదుగుదల అనే ఐదు దశల్లో పూర్తి బాధ్యత తీసుకోవాలి. ప్రతి దశకు స్పష్టమైన లక్ష్యాలు, బాధ్యతలు, పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి. ఈ రోజు మనం తీసుకునే పర్యావరణ పరిరక్షణ నిర్ణయాల ఫలాలను రాబోయే తరాలు అనుభవిస్తాయి. 20 ఏళ్ల తర్వాత మన పిల్లలు ఈ నిర్ణయాల ఫలితాలను చూస్తారు. కాబట్టి మనం ఇప్పుడు నాటేది కేవలం ఒక మొక్క కాదు.. మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది. 2047 లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే సమన్వయంతో, బాధ్యతాయుతంగా, నిరంతర పర్యవేక్షణతో హరిత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ సొసైటీ కమిషనర్, సీఈఓ శ్రీ బీ. ఎన్. ఎన్. మూర్తి, పీసీసీఎఫ్ శ్రీ పి. వి. చలపతిరావు, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, పర్యావరణం, అడవుల శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ బి. మొహమ్మద్ దివాన్ మైదీన్, ఏపీసీసీబీ మెంబర్ సెక్రటరీ శ్రీ ఎస్. శరవణన్, విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియా, హార్టికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, వీబీ జీ రామ్ జీ డైరెక్టర్ శ్రీ వై. వి. కె. షణ్ముఖ్ కుమార్, అన్ని జిల్లాల డీజీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొన్నా
