ఎంవీఆర్ భవన్ నుంచి
పుడమిటివి జనసాహిత్యం

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవీఆర్ మానవవికాస రచనలు
రోజు పొద్దున్నే అరుగు బయట కూర్చుండి అందరితో మాట్లాడే ఈశ్వరి నాయిన రాఘవయ్య ఇయ్యాల కాలు బయటపెట్టలేదు. ఇంట్లో ఎలాంటి అలికిడి కానరావడం లేదు. బట్టలు ఉతికే “కనకవ్వ”, ఇంటి పనిచేసే చంద్రయ్య, అక్కవ్వలు పటాకుల ముందు నిలబడ్డారు.
పొద్దేక్కిన ఇంట్లో సరి సప్పుడు లేకపోవడంతో ఏమి జరిగిందో తెల్వట్లేదు. ఎప్పుడు రాఘవయ్య దొర ఇల్లు ఎగిలివారంగానే కళకళలాడేది. ఇయ్యాల బోసిపోయినట్టున్నది. పొద్దెక్కుతాంది. ఇప్పటికే సాన సేపయ్యింది. చూసి ఇగ ఉండబట్టలేక, “ఏదైతే అది కానియ్యి. చంద్రయ్య, జర నువ్వు పిట్టగోడ దూకి ఇంట్లో ఏమి జరిగిందో సూసి రమ్మన్నది” అక్కవ్వ.
“ఏందే అక్కి, ఏమంటానవే? నేను గోడ దునికింది రాఘవయ్య దొర సూత్తే ఇగ నా పానాలు ఉంటాయానే అక్కి, నన్నేదో సేయాలనుకుంటున్నవే. ఎడ్డిముఖ పొడ! నిన్ను నేనేం సేత్త? నీకేమైన ఐతే నేను బతికి ఉంటన. నీ మీద నా పేమ ఎట్లుందో తెల్వదా నీకు? గట్ల మాట్లాడుతున్నావు?”
“ఏందయ్యా! పోవయ్య” అంటూ చంద్రయ్యను కౌగలించుకున్నది అక్కవ్వ. చంద్రయ్యకు ఒక్కసారిగా ఏదో మైకం కమ్మినట్టు, “అక్కి” నడుముమీద సెయ్యేసి, ఆమే సెంప మీద మీసాన్ని రుద్ది ఏదో నెమ్మదిగా సెప్పబోతాండు.
అంతే, “ఏందిరా చంద్రిగా, ఇగ సాలు మీ సరసాలు. ఇగురం తక్కువొనికి ఇసయం ఇప్పి సెప్పితే బట్టలు ఇప్పి బజార్ల దాక్కున్నడంట. దొర ఇంట్లో ఏమి జరిగిందో తెల్వక ఆగమవుతుంటే, ఇంట్లో చేసుకునే సరసం మా ముందు జెత్తావురా!” “మొగాడంటే పెళ్లాం సెంపమీద మీసం రుద్ధుడు కాదు. ముఖం మీద మీసం వుంటే సరిపోదు. చీ చీ! గోడ దూకరా అంటే ఏమో జేత్తనవు. నేనే పోయత్త” అంటూ కనకవ్వ అడుగులేస్తాంది.
“ఏయ్ ఆగే! ‘కని’కి నేనే ఏమి జరిగిందో సూసత్త” అంటూ చంద్రయ్య పిట్టగోడ వైపుకు వెళ్లి ఇంట్లోకి దూకిండు. దొర ఇంట్లో దొరసాని ఏడుపు ఇనపడుతాంది. ఇంట్లో ఎవలో సుట్టాలు వచ్చినట్టు వున్నది. దొర అలికిడి ఇనిపిస్తలేదు.
“ఎవలో ముసలామె, ఏడవకు. దొరసాని, ఏడవకు. నాత్రి నుండి ఏమి తినక పోతివి. బిడ్డ జాడ ఎట్లైనా తెలుస్తది. యాడికిబోయిన ఇంటికి తిరిగస్తది. నువ్వు రంది పెట్టుకోకు బిడ్డా” అన్నది. అయినా ఎక్కిఎక్కి ఏడుస్తున్నది.
గీఏడ్పు సూడలేక రాఘవయ్య దొర దొరసాని మీదికి పళ్లు కొరుక్కుంటూ, “ఏడవకే, ఏడవకు. ఇగ నేను బిడ్డ పుట్టలేదనుకుంటా, సచ్చిందనుకుంట. ఇప్పటికే పరువు పోయింది. ఇంకా నీ ఏడుపు ఇనబడితే ఇజ్జతు పోతది. బిడ్డను ఎట్లా పెంచాల్నో తెల్వదు. నోర్ముయ్” అని గట్టిగా అరిసిండు. దొరసాని ఏడుపు ఇనపడకుండ గుక్కబట్టి ఏడ్వబట్టింది.
ఇంట్లో సికాకు భరించలేక, కూతురు ఏడ బోయిందో తెల్వక అటుఇటు తిరుగుతూ తలుపు కాడికి వెళ్లి తియ్యబోయాడు. తలుపుల శబ్దం విన్న చంద్రయ్య, “వామ్మో! ఈడ వుంటే నా పాణమే పోతది” అనుకున్నాడు. అటుఇటు జూసి, పిల్లి అడుగులు వేసుకుంటా పిట్టగోడ దూకి పటాకుల కాడికి దబ్బున ఉరికిండు.
కనకవ్వ, అక్కవ్వలకు చంద్రయ్య ఆగమాగం వచ్చేది సూసి గజ్జున వణికిళ్లు. “ఇగ మనం దొరకి దొరికి పోయామని” భయపడుతాళ్లు.
వాళ్ల భయాన్ని జూసి, “భయం గల కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు, నాకేమైతదో తెల్వక నేను ఆగమాగం వస్తాంటే మీరెందే ఇంత బయపడుతాళ్లు?” అంటూ చంద్రయ్య, ఇద్దరి ముందు వాలిండు.
“ఏమి జరిగింది? ఇట్ల మొస్స బోసుకుంట వస్తానవు?” అంది కనకవ్వ. “ఏమిలేదే” అని ఇసయం సెప్పబోతాండు.
ఇంతల ఊరి పెద్ద దొర మనుషులు రాఘవయ్య దొర పటాకుల కాడికి వస్తాళ్లు. వాళ్లను చూసి ముగ్గురు గబుక్కున పక్కన వున్న గడ్డి వాము ఎనకకి వెళ్లి దాక్కున్నరు.
అడవిలో తంగేడు పువ్వుల సెట్లకాడ రక్తం పడ్డది అని, ఆడ గాజులు, వీరనాగులు తువ్వాల పడ్డదని ఆనోట ఈనోట ఊరంతా తెలిసిపోయింది. గా విషయాన్ని చంద్రయ్యకు కనకవ్వ సెప్పింది. అది విన్న చంద్రయ్య, “అయ్యో పిచ్చిదానా! వీరనాగులే కాదు, రాఘవయ్య దొర బిడ్డ ఈశ్వరీ కూడా నిన్నటి నుండి ఇంట్లో లేదటనే” అన్నడు.దొర ఇంట్ల బిడ్డ లేదని దొరసాని ఏడుస్తాంది. అందుకే దొర ఇంటి తలుపులు తీయలేదని చంద్రయ్య సెప్పబట్టిండు.
“ఇగ మనం ఈడుంటే మంచిది కాదు. దొర మనుషులకు కంట బడకుంట. ఊళ్లలోకి పోయిళ్లు.”
అక్కవ్వ, కనకవ్వలకు ఏదన్న విషయం తెలిస్తే నోట్లో ఆగదు. కనపడ్డోళ్లకి ఈశ్వరీ ఇంట్లో లేదని సెప్పుకుంటా పోతాళ్లు.
వీరనాగులు, ఈశ్వరీ ఇద్దరు లేరని ఊరంతా తెలిసిపోయింది.
అడవిలో వీరనాగులు కోసం సోపతిగాళ్లు వెతుకుతాళ్లు. ఇంతల చంద్రయ్య వాళ్ల జాడబట్టుకొని, శివయ్యను కలిసి, “ఈశ్వరీ కూడా ఇంట్ల లేదట” అని సెప్పిండు. “నీకెట్ల తెలిసింది?” అన్నడు శివయ్య. “వాళ్ల ఇంట్లో ఎవరు బయటకు రాకపోవడంతో నేనే పిట్టగోడ దూకి ఇంట్లోకి పోయినాను. దొరసాని బిడ్డ లేదని ఏడుస్తాంది. బిడ్డ సచ్చిందని రాఘవ దొర అనబట్టిండు.” “అయితే ఆ గాజులు ఈశ్వరివా? అయ్యో! దొర మనుషులు ఇద్దరినీ ఏమైనా చేశార?” అంటూసోపతిగాళ్లకు శివయ్య సెప్పుతున్నాడు. కాసేపు అందరిలో ఏమి మాటలు రావడం లేదు.
ఊళ్లలో వున్న ఆడమగ, సిన్న, సితక, ముసలి ముతక, అందరూ సెట్లు గుట్టలు వెతుక్కుంటా. శివయ్య సోపతిగాళ్లను కలుసుకున్నరు. ఊరంతా రావడంతో శివయ్య సోపతిగాళ్లకు దైర్యం వచ్చింది. అసలు వీరనాగులు ఊరోళ్లకి ఓ దైర్యం, ఈశ్వరి అమాయకురాలు. ఇద్దరికీ ఏమి కావద్దు. బతికుంటే ఊళ్లలోకి తీసుకపోదాం. సచ్చిపోతే వాళ్ల పీనుగలను దొర ఇంటిముందు వేద్దాం అంటూ తలో దిక్కు అడవిల వెతకబట్టిల్లు.