పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల నాయకత్వంపై సదస్సులో మంత్రి సీతక్క

పుడమి టివి న్యూస్


పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల నాయకత్వంపై సదస్సులో మంత్రి సీతక్క

గాడిపల్లి మధు ఆంధ్ర తెలంగాణ ప్రతినిధి పుడమిటివి

:

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగి అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. మహిళలు రాజకీయాల్లో ఎదిగే క్రమంలో ఎదురయ్యే వివక్ష, అడ్డంకులకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో శనివారం నిర్వహించిన “పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు.. మహిళా రాజకీయ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం” అనే అంశంపై జరిగిన సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో AICC కార్యదర్శి గురుదీప్ సింగ్ సత్పాల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, కర్ణాటక మాజీ ఎమ్మెల్యే అంజలి, సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి కోట నీలిమతో పాటు, ఇప్పుడు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తన జీవితం ఎన్నో కష్టాలు, పోరాటాలతో నిండిందని, చిన్నతనంలో ఆకలి బాధలు సహా అనేక సమస్యలను ఎదుర్కొన్నానని తెలిపారు. ములుగు వంటి అటవీ ప్రాంతంలోని పేద కుటుంబంలో జన్మించిన తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు. చిన్నతనంలో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూడలేక నక్సలైట్‌గా మారానని, ఆ తర్వాత న్యాయవాది, ఎమ్మెల్యే, మంత్రి అవుతానని ఎన్నడూ ఊహించలేదని అన్నారు.

“కష్టాన్ని నమ్ముకొని పనిచేశాను.. నేడు మీ ముందు మంత్రిగా నిలబడ్డాను” అని సీతక్క పేర్కొన్నారు. ములుగు ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ పెద్దల సహకారంతో రాష్ట్రంలో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందన్నారు. తన జీవితంలో ఎదురైన కష్టాలను, చేసిన పోరాటాలను ఎప్పటికీ మర్చిపోనని స్పష్టం చేశారు.

మంత్రి పదవిలో ఉన్నప్పటికీ తన మూలాలను మర్చిపోలేదని, ప్రజా జీవితంలో ఉన్నవారు ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండాలని అన్నారు. ఇప్పటికీ ప్రతి వారం రెండు రోజులు ములుగు ప్రజల మధ్య గడుపుతానని, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే తన సిద్ధాంతమని చెప్పారు.

“ప్రజాప్రతినిధులుగా మనం ప్రజలకు జవాబుదారులం. మనం ప్రజలకు బాసులం కాదు.. సేవకులం. చేపకు నీళ్లే బలం.. నాయకులకు ప్రజలే బలం. నీళ్లు లేకుండా చేప బతకలేనట్లే, ప్రజలతో సంబంధం లేకుండా నాయకుడు రాజకీయంగా నిలబడలేడు” అని సీతక్క అన్నారు.

మహిళలు రాజకీయంగా ఎంతటి ఉన్నత స్థానాలకు చేరుకున్నా వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పురుష మంత్రులకు లభించే గౌరవం మహిళా మంత్రులకు ఎప్పుడూ సమానంగా లభించడం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ మహిళలు వెనుకడుగు వేయకుండా అంకితభావం, దృఢ సంకల్పంతో పనిచేస్తూ ముందుకు సాగాలని సూచించారు.

పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం మాత్రమే సరిపోదని, వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం, తగిన గౌరవం పొందాలని సీతక్క అన్నారు. ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు ఇతరులపై ఆధారపడకుండా తమ బాధ్యతలను స్వయంగా నిర్వహించేందుకు అవసరమైన అవకాశాలు, శిక్షణ, సంస్థాగత సహకారం అందించాలని పేర్కొన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబన, రాజకీయ సాధికారత పరస్పరం ముడిపడి ఉన్నాయని మంత్రి వివరించారు. స్వయం సహాయక సంఘాలు, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల ద్వారా మహిళలు వ్యాపారాలు ప్రారంభిస్తూ, ఆర్థిక స్వాతంత్ర్యం సాధిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని తెలిపారు. ఆర్థికంగా బలోపేతమైన మహిళలు రాజకీయాల్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని అన్నారు.

మహిళలపై సామాజిక వివక్షతో పాటు రాజకీయ, డిజిటల్ వేదికలపై వేధింపులు కూడా అడ్డంకులుగా మారుతున్నాయని సదస్సులో చర్చించారు. మహిళా నాయకులు నిర్భయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వాతావరణం కల్పించడంతో పాటు, రాజకీయ శిక్షణ, మార్గదర్శకత్వం, చట్టపరమైన సహకారం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రతి అమ్మాయి సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా లేదా ప్రధానమంత్రిగా ఎదగాలని కలలు కనే పరిస్థితులు రావాలని సీతక్క ఆకాంక్షించారు. మహిళలకు సమాన అవకాశాలు, నిర్ణయాధికారం, గౌరవం లభించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని అన్నారు.

మహిళలు అడ్డంకులను అధిగమించి ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టే సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *