పుడమి టీవీ జనసాహిత్యం
ఏపీ రాష్ట్ర స్థాయి ఉత్తమ గురువుగా గంగాధర నాయుడు
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్, పుడమి టీవీ ఎం.వి.ఆర్. మానవ వికాస రచనలు
“మా బుడ్డోడి బడిలో ఇంగ్లీష్ మాట్లాడకుండా తెలుగు మాట్లాడినందుకు జరిమానా వేశారు. డబ్బులు కాదూగదా , మనం మన పిల్లల్ని అట్లాంటి బడిలో చదివించాలి” ఓ తల్లి మాట. మా పక్కింటి వాళ్లు వాళ్ల మూడేళ్ల కొడుకును నర్సరీలో బడిలో చేర్పించారు. అడ్మిషన్ ఫీజు ఓ పాతిక వేలు. పిల్లోడికి బడిలో సీటు రావాలంటే వాడికి ఏమి పరీక్ష ఉంటుంది అనుకున్నావు? వాడికి సక్కగా మాటలే రావు. వాళ్ల అమ్మానాన్నలకు ఎబిసిడీలు రాపించారంట. అవి తప్పులు రాస్తే కొంచెం అడ్మిషన్ ఫీజు పెరుగుతుందని చెప్పారంట. ఆమ్మో! ఎంత స్ట్రిక్ట్ స్కూల్! అలాంటి స్కూల్లో చదివితే ఎంత గొప్పోడు అవుతాడో తెలుసా? ఇది తెలుగు రాష్ట్రాల్లో అమ్మ భాషను సమాధి చేస్తూ పరాయి భాషపై పెరుగుతున్న మోజు. పాలకులు ఎవరున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇంగ్లిష్ భాషను నెత్తిన ఎత్తుకొని, త్రిభాషా సూత్రాన్ని తుంగలో తొక్కి, మాతృభాషకు పిల్లలను దూరం చేస్తున్నారు. అలాంటి సమయంలో కన్నతల్లిలాంటి తెలుగు భాషను ఎవరో ఒకరు బతికించే వాళ్లకు ఈ నేల ఎక్కడో ఒక చోట పురుడు పోస్తది. తెలుగును ప్రజల నాలుకల పై భద్రపరుస్తుంది. తెలుగు భాషను తనదైన శైలిలో విద్యార్థులకు బోధిస్తూ ఆసక్తిని పెంచుతున్నాడు ఓ ఉపాధ్యాయుడు. అతని సేవకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా గురుపూజోత్సవం వేళ ఘనంగా సత్కరించనుంది
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామ బిడ్డ తెలుగు రాష్ట్రాలు గర్వపడేలా తెలుగు భాషకు జీవం పోస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకుంటున్నారు.ఏ గణితమో, సైన్సో బోధించే ఉపాధ్యాయుడు కాదు, తెలుగు చదువుకుంటేనే బాగుంటుందనే విధంగా విద్యార్థులను తయారు చేస్తున్నాడు. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు తెలుగు చదివితే మార్కులు రావు అని సంస్కృతం వైపుకు మళ్లిన విద్యార్థుల్లో తెలుగు చదవాలనే ఆసక్తిని పెంచాడు.
ప్రొద్దుటూరులో ఎస్.పీ.సి.ఎన్. పురపాలక పాఠశాలలో తెలుగు పండిట్‌గా సేవలు అందిస్తున్న గంగాధర్ నాయుడు 2025-26 విద్యాసంవత్సరంలో తాను బోధించిన తెలుగులో ఆరుగురు విద్యార్థులకు వందకు వంద మార్కులు వచ్చాయి. ఇది మొదటిది కాదు. గతంలో తాను పనిచేసిన పాఠశాలలో అలాగే వచ్చాయి. ఇది సాధారణ విషయం కాదు, ఒక సంకల్పం.
తెలుగులో వందకు వంద వస్తాయంటే అయితే, గియితే ఏ గణితంలోనో, ఏ సామాన్య శాస్త్రంలోనో, ఏ సాంఘిక శాస్త్రంలోనో రావాలి కానీ తెలుగులో రావడమా? విచిత్రం కాకపోతే ఏమిటి? అని ముక్కుమీద వేలు వేసుకొన్న వాళ్లు ఉన్నారు. ఇది ఓ ఉపాధ్యాయుడిగా గంగాధర్ నాయుడు తన భాష కోసం, తెలుగు కోసం చేస్తున్న కృషి ఫలితం. ఇది తెలుగు ప్రజల్లో, విద్యావ్యవస్థలో తెలుగు భాషకు ప్రాణం పోస్తున్న యదార్థ ప్రయాణం. తెలుగు భాషపై పట్టు పెంచెందుకు గంగాధర్ నాయుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని తన తరగతి గదిలోనే విద్యార్థుల తలరాతలు మార్చడం లేదు, ఒక యూట్యూబ్ ఛానెల్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుగు వ్యాకరణం, తెలుగు భాషపై పట్టును వేలాది మంది విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర దేశాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐ కుటుంబాలకు సైతం చేరువయ్యారు. తెలుగును ప్రేమించే అనేకమంది భారతీయ కుటుంబ సభ్యులు తమ పిల్లలకు తెలుగును నేర్పిస్తున్నారు. ఇది గంగాధర్ నాయుడు చేసిన కృషికి దక్కిన గొప్ప గౌరవంగా చెప్పవచ్చు. ఒక్క గంగాధర్ నాయుడు తాను బోధించిన విద్యార్థులకు తెలుగులో వంద మార్కులు రావడం వల్ల అందరి దృష్టి పడింది. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడం, భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో అవార్డు వస్తుంది. ఇది వాస్తవం. కానీ తెలుగు భాషను ఖండాంతరాలు దాటించి తెలుగును బతికించిన రాయలసీమ రత్నాల నేలలో ఆ కృష్ణదేవరాయలు తెలుగు పదబంధాలతో సాహిత్యం వెలుగులు పంచిన ఆస్థాన కవులు, సాహితీవేత్తలు, భాషాకోవిదులు, ప్రేమికుల ఆత్మఘోష గంగాధర్ నాయుడిలాంటి వాళ్ల నుండి మళ్లీ తెలుగు భాష విస్తరించే విధంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
గంగాధర్ నాయుడికి అవార్డు రావడమంటే తెలుగు భాషకు రావడం. ఒక నన్నయ, తిక్కన, పోతన, వేమన, ఒక కాళోజి, ఒక జాషువా, దాశరథి ఇలా భాషను బతికించాలని కృషిచేసిన వారిలో ఆధునిక భాషా ప్రేమికుడు గంగాధర్ నాయుడు నిలుస్తారు..
ఇప్పటిదాకా పరాయి భాష ఇంగ్లిష్ మీద మోజు చూపించిన పాలకులు ఇప్పుడు జర్మన్ భాషను నేర్చుకోమని ప్రచారం చేస్తున్నారు. కారణం భాష కాదు, ఆయా దేశాల్లో దొరికే ఉపాధి. దానికోసమే ఇంగ్లిష్ ప్రధానమై ఇవాళ దేశంలోని అనేక మాతృభాషలను కనుమరుగు చేసే ప్రయత్నం కొనసాగుతుంది.
మన దేశంలోని జ్ఞాన సంపదను, ఉత్పత్తి రంగాలను, ఉపాధి వృత్తులను ధ్వంసం చేసి విదేశీ చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి భాష లెక్కనే అది ఒక భాషైనప్పటికీ పరాయి భాష తెలుగును మింగేస్తుంది.
ప్రజలు సైతం తెలుగు మీడియం స్కూళ్లకు స్వస్తి పలికేలా పెరుగుతున్న డిమాండ్‌తో ప్రభుత్వాలు గత్యంతరం లేక ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు అడుగడుగునా ప్రారంభించాయి. ఇది భాషను కనుమరుగు చేసే ప్రయత్నం అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గంగాధర్ నాయుడికి అవార్డు రావడం చర్చకు తెరలేపింది. ఇది తెలుగు భాషపై విద్యార్థి లోకంలో, తల్లిదండ్రుల్లో కొత్త ఆలోచనలు చిగురించేలా చేస్తుందనేది ఆశిద్దాం.
నాతో పాటు ప్రొద్దుటూరులో తెలుగు పండిట్ శిక్షణ పొందిన గంగాధర్ నాయుడు తెలుగు భాషకు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. నా మిత్రుడికి రాష్ట్ర స్థాయి అవార్డు రావడం అభినందనీయం. మిత్రుడికి అవార్డు అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిగారికి , విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి , విద్యాశాఖ అధికారులకు, తెలుగు భాష ప్రేమికులందరికీ కృతజ్ఞతలు.

