సేదబాయి నవల ఎపిసోడ్ 08

                                                                                                        ఎంవిఆర్ భవన్ నుండి                                         

                                                                                                         పుడమిటివి జనసాహిత్యం                                                                       


                                                                                                       నాగబెల్లి జితేందర్ సామ్రాట్                                                                      

                                                                                ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమిటివి ఎంవిఆర్ మానవ వికాసరచనలు పబ్లికేషన్స్

ఎదురుగ వున్న ఈశ్వరిని వదిలించుకొని వీరనాగులు బయటకు వెళ్ళాలి అనుకున్నాడు. అడుగు ముందుకు పడటం లేదు. చిరుతల రామాయణం మధ్యలో ఆపితే ఊరోళ్లంతా తిట్లు తిడుతారు ఇగ పోదాం అనుకోని కదలబోయాడు, అంతే పాదానికి పంచె అడ్డుపడి ఈశ్వరి ఎదమీద ఒదిగాడు. ఈశ్వరీ ఒక్క సారిగా ఉలిక్కి పడింది

ఎక్కడ ఈశ్వరి కింద పడుతుందోనని నడుముపై చేయి వేసి గట్టిగా పట్టుకున్నడు’ ఈశ్వరి ఈశ్వరి ఇప్పుడైనా మాట్లాడవ మా దొరసానివి కదూ, జర నువ్వు మాట్లాడితే ముత్యాలు రాలినట్టుంటది … జరా, జరా మాట్లాడు దొరసాని అరే గింత మొత్తకుంటాంటే ఇనబడనట్టు సేత్తున్నవు నువ్వంటే నాకు పాణం దొరసాని, నీమీద నాకు ఎంత పేమంటే ఎంత పేమంటే నిన్ను సూడకుంట ఒక్క రోజు ఉండలేక పోతున్న.పెందరాలే లెగంగానే నిన్ను సూడటానికి మీ ఇంటిముఖంవత్తా నువ్వు కనిపించక పొతే పాణం ఎట్లనో అయితది దొరసాని… దొరసాని జరా మాట్లాడు…..ఈశ్వరి వణుకుతున్న పెదాలతో అయ్యో ఏమికాలేదయ్య,ఏమికాలేదంటే యినవెంది అన్నది హమ్మయ్య అంటూ ఈశ్వరి ముఖం వంక చూసిండు.ఆ చీకట్లలో ఈశ్వరి ముఖం చంద్రబింబమోలే మెరిసి పోతుంది. ఈశ్వరి ఎంతఅందంగా వున్నవు మన ఊరి చేరువులో పూసిన తామర పువ్వులోలే అవునా అంటూ కీలుక్కున నవ్వింది. నీ నవ్వు ముఖం ముద్దబంతి పువ్వొలే బంగారు రంగులో మెరిసి పోతుంది.ఇంత అందమున్న మనిషిని సుట్టు పదిఊళ్లల్లా సూడలే, ఎంత అందం నీది, నిన్ను సూడకుంట ఉంటానా నువ్వు నాదగ్గర వుంటే ఈ లోకం తెల్తలేదంటూ నెమ్మదిగా ఈశ్వరిని మరింత దగ్గరకు తీసుకున్నాడు. గంతే వడితిరిగిన మీసం ఈశ్వరి పెదాలను తాకింది. ఈశ్వరి తన్మయత్నంలోకి పోయింది. వీరనాగులు ఒళ్ళంతా చెమటలు పట్టాయి.ఇద్దరిలో మౌనం ఇద్దరి మధ్య గాలి కూడా దూరలేనంతగా బుసలు కొడుతున్న జంటనాగులోలే శ్వాస మాత్రమే వినిపిస్తుంది.

ఇంతల ఒరేయ్ వీరుగా ‘జర రారా ‘అందరూ కలిసి తన్నేటట్టు ఉన్నారు. అంటూ రాజయ్య పిలిసిండు. ఈ రాజి గానికి ఏడ పనిలేదు వీనయ్య ఏదో ఎత్తిపోయినట్టు, పిలుత్తాండ. ఇయ్యాల గాక పొతే మళ్ళా ఎప్పుడైనా నాటకం ఏయవచ్చు అనుకుంటా నోట్ల,నోట్లనే గులగ బట్టిండు. మళ్ళా ఓరి వీరుగా నీ దుంపతెగ నిన్ను నమ్ముకుంటే మా పాణం తీసేతట్టున్నావు కదరా జర రారా అంటూ అక్కడ వున్నా చిరుతల రామాయణం జట్టుగాళ్ళు కేకలెయ్య బట్టిళ్లు. సేసేది ఏమిలేక ఈశ్వరి మళ్ళా కలుత్త అంటూ మరింత దగ్గరకు తీసుకొని, విడిచివెళ్లలేక, వెళ్ళలేక ఆమెను నిమ్మదిగా వదిలి జట్టుగాళ్ళ దగ్గరికి దోతిని గట్టిగా పట్టుకొని పరిగెత్తాడు.

ఏమిరా వీరుగా ఏమయిందిరా నీకు, ఎప్పుడు కథ మద్యల బయటకు పోనోనివి ఇయ్యాలెంది గింత ఇబ్బంది పెడుతున్నావు. గీజనం నువ్వు లేకపోతె కథసెప్పిన ఎవరు ఇనరురా అగో ఆడవున్న కిరీటం నెత్తి మీద పెట్టుకొని తొందరగా రారా…జట్టుగాళ్ళు అనగానే వీరానాగులు,అంతా సర్దుకొని జనం మధ్యకు వచ్చిండు.

కథ సెప్పుడు మొదలయ్యింది.సీతా రాములు పచ్చని అడవిలో నడుస్తున్నరు.వాళ్ళ వెంట లక్ష్మణుడు నడుస్తున్నాడు. రాముడు అడిగిండు. ఎందుకు లక్ష్మణ నీ ప్రియ సఖి ఊర్మిలను ఇంటివద్దనే వదిలి మాతో వస్తున్నావు. రామా తండ్రి తర్వాత తండ్రిలాంటిది నువ్వే కదా రామా నువ్వు తల్లీగా కొలిచే సీతాదేవి అడవులకు వెళుతుంటే ఎట్లా వుంటాను రామా, నేను మీతో అడుగు బయట పెట్టినప్పటి నుండి ఊర్మిల నిద్రలోకి పోయింది. నీసేవా చేసుకుంటే దైవసేవ చేసినట్లే రామా అంటూ రాముడితో కలిసి నడుస్తున్నారు. రాముడు సీతాదేవి లక్ష్మనుడు నడుస్తున్న అడవి అందాలు వర్ణించలేమన్నట్లు సుందరంగా వుంది.

వీరనాగులు పచ్చని అడవి పారె సెలయేర్లు పక్షుల రాగాలు వర్ణిస్తూ పాటమొదలు పెట్టిండు డప్పుసప్పుట్లతో రాముడి పాత్రలో వీరనాగులు పాట పాడుతుంటే మంత్రముగ్ద్యులయ్యి జనం సప్పట్లు కొట్టబట్టీళ్ళు కుర్చీలో కూసున్న ఈశ్వరి తండ్రి రాఘవయ్యతో పాటు , ఈశ్వరి సప్పట్లు కొట్టబట్టీళ్ళు, ఇగ ఈశ్వరి ముఖం చూసుకుంటా వీరనాగులు పాట లగాంచి పాడబట్టిండు.

ఇంతల  రాఘవయ్య  ఇంట్లో పనిచేసే సర్వయ్య వీరనాగులు ముఖం చూపిస్తూ చెవిలో ఏదో గుసగుస సెప్పబట్టిండు. రాఘవయ్య ముఖం కోపంతో ఎర్రబడ్డది. చిరుతల రామాయణం ఈ రోజుకు అయిపోయిందని రాజయ్య సెప్పిండు ఊరోళ్లంతా ఎవరి ఇళ్లళ్లకు వాళ్ళు పోయిళ్ళు వీరనాగులు ముఖం సూసుకుంట ఈశ్వరి ఇంటిముఖం బట్టింది. అందరూ పోయేదాక,చూసి రాఘవయ్య కాసేపు అక్కడే ఉండి, ” ఒరేయ్ వీరనాగులు’ రేపు పొద్దున ఇంటిముందు కనపడు యాది పెట్టుకో వీరుగా యాది మర్సినవో సూడు జరా గుర్రుగా సెప్పి ఇంటి దారి పట్టిండు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *