
సీఎం రేవంత్ రెడ్డి.

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్, పుడమిటివి ఎంవిఆర్ మానవవికాస రచనలు
మేడారం నుంచి ములుగు వరకు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సీఎం పర్యటన.
వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాల అందజేత.
రూ.16,007 కోట్ల గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రణాళికకు ములుగు నుంచి శ్రీకారం.
నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభం.
మల్లూరు నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు.
జంపన్న వాగు సమగ్ర అభివృద్ధికి చర్యలు.
మేడారం వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అభివృద్ధి.
ములుగు సమగ్ర అభివృద్ధి, గిరిజన సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి.
**
ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.
మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల దర్శనం, చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ, శుద్ధ తాగునీటి కేంద్రం ప్రారంభం, గ్రామీణ రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం, అభివృద్ధి పనుల పైలాన్, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు కామారెడ్డి జిల్లా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్య సభ సభ్యులు
వేం నరేందర్ రెడ్డి మేడారం చేరుకున్నారు.
ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయని రాజేందర్ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.
అక్కడి నుంచి కాన్వాయ్‌లో మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల ప్రధాన ముఖద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి గిరిజన పూజారులు డోలు వాయిద్యాలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, నృత్యాల నడుమ సాదర స్వాగతం పలికారు.
అనంతరం వనదేవతల గద్దెల వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తులాభారంలో 66 కిలోల నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని వనదేవతలను ప్రార్థించారు. పూజల అనంతరం గిరిజన పూజారులు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల జ్ఞాపికలను మర్యాదపూర్వకంగా అందజేశారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు చేయూత పింఛన్ మంజూరు చెక్కులు, పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శుద్ధ తాగునీటి కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఆలయ పూజారులు, డోలు వాయిద్య కళాకారులు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో ముచ్చటించి వారితో కలిసి చిత్రాలు దిగారు. మేడారం ప్రధాన కూడలిలో తనను కలిసేందుకు వచ్చిన ప్రజలు, అభిమానులను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు.
మేడారం కార్యక్రమాలు ముగించుకున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో ములుగు జిల్లా కేంద్రానికి బయలుదేరారు. ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, స్థానిక ప్రజాప్రతినిధులు,విజిల్‌లా అధికారులు, స్వాగతం పలికారు.
అక్కడి నుంచి ములుగు గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన గ్రామీణ రహదారుల అభివృద్ధి పైలాన్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి ఆవిష్కరించి రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో నూతన అధ్యాయానికి ములుగు నుంచి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.16,007 కోట్లతో 2,145 గ్రామీణ రహదారులను 7,448 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసే భారీ ప్రణాళికను ప్రభుత్వం చేపట్టింది. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సూచించే పైలాన్‌ను ఆవిష్కరించారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, రూ.63.50 కోట్లతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన సుమారు రూ.868 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.
ములుగు సమగ్ర అభివృద్ధే లక్ష్యం: ముఖ్యమంత్రి
కలెక్టరేట్ సభా వేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులతోనే గతంలో పీసీసీ అధ్యక్షుడిగా తాను చేపట్టిన పాదయాత్రను ములుగు గడ్డ నుంచి ప్రారంభించానని గుర్తుచేశారు. రాష్ట్ర నలుమూలల గ్రామాలు, గూడేలు, పల్లెల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నామని, ప్రజలకు ఇచ్చిన భరోసా మేరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ములుగు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. సమ్మక్క–సారలమ్మ సన్నిధిని మరింత వైభవంగా తీర్చిదిద్ది మేడారం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
మేడారం సమ్మక్క–సారలమ్మ దేవాలయ ప్రాంతాన్ని రామప్ప, వేయి స్తంభాల గుడి తరహాలో విశిష్టంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు మేడారం ఆధ్యాత్మిక, గిరిజన సాంస్కృతిక విశిష్టత మరింత వెలుగొందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
మల్లూరు నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనతో పాటు మల్లూరు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మేడారం వచ్చే భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. జంపన్న వాగుపై అవసరమైన చోట చెక్‌డ్యామ్‌లు, స్నాన ఘట్టాల నిర్మాణం చేపట్టి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
గోదావరి తీరంలో ఉన్న ములుగు జిల్లాలో సాగునీటి కొరత లేకుండా చేయడానికి అవసరమైన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష నిర్వహించి అవసరమైన నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. ఆదివాసీ బిడ్డల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు.
యువతకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఆ తర్వాత నైపుణ్య విద్యపై దృష్టి సారించి అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
12వ తరగతి అనంతరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలు, స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా యువతకు సాంకేతిక, వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ములుగు ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం అందుబాటులోకి రావడం
ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.
జర్మనీ, జపాన్, కొరియా వంటి దేశాల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు జర్మన్, జపనీస్, కొరియన్ తదితర విదేశీ భాషలతో పాటు సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ‘సమ్మక్క–సారలమ్మ’ పేరుతో మహిళలకు నాణ్యమైన చీరలను అందించనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ ఏడాది డిసెంబర్లో చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క పర్యవేక్షణలో చీరల ఎంపిక, రూపకల్పన జరిగిందని పేర్కొన్నారు.
నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం అందుబాటులోకి రావడం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకేచోట ప్రజలకు మరింత సులభంగా అందుతాయని పేర్కొన్నారు. త్వరలోనే జిల్లాలో ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనాల నిర్మాణాలను కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.
ములుగు సమగ్ర అభివృద్ధి, గిరిజన ప్రాంతాల పురోగతి, మహిళల సంక్షేమం, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు, మెరుగైన వైద్య సేవలు, సాగునీరు, రహదారులు, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం: మంత్రి సీతక్క
ముందుగా మంత్రి ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, ములుగు జిల్లా, ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్నారని తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతమైన ములుగును హైదరాబాద్ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
నూతన కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క–సారలమ్మ సన్నిధిని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం, ములుగు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పలుమార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ములుగు నియోజకవర్గానికి రాష్ట్రంలో అత్యధికంగా 5 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం ఈ ప్రాంతంపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
సాగునీటి రంగంలో పొట్లపల్లి ఎత్తిపోతల పథకం, రామప్ప–లక్నవరం అనుసంధాన పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సమ్మక్క–సారలమ్మ సన్నిధి అభివృద్ధితో పాటు జిల్లాలో విద్య, వైద్యం, పర్యాటకం, గృహ నిర్మాణం, సాగునీరు, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా కట్టుబడి పనిచేస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివ్య, మేడారం కార్యనిర్వహణ అధికారి వీరస్వామి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.