ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి, గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం

 

 

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్, పుడమిటివి ఎంవిఆర్ మానవవికాస రచనలు

ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి, గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం  పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లా కలెక్టరేట్ సముదాయ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ములుగు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. మేడారం సమ్మక్క–సారలమ్మ దేవాలయాన్ని రామప్ప, వేయి స్తంభాల గుడి తరహాలో అద్భుతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మల్లూరు నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి త్వరలో ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.

భక్తుల సౌకర్యాలు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగుపై చెక్‌డ్యామ్‌లు, స్నాన ఘట్టాల నిర్మాణం చేపట్టి జంపన్న వాగును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు

.
హిళల సంక్షేమానికి ప్రాధాన్యత

మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమ్మక్క–సారలమ్మ బిడ్డలకు ‘సారె’ పేరిట నాణ్యమైన చీరలను అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌లో అక్కాచెల్లెమ్మలకు చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
యువతకు విద్య, ఉపాధి అవకాశాలు

ములుగు జిల్లా యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని సీఎం తెలిపారు. జర్మన్, జపనీస్, కొరియన్ వంటి విదేశీ భాషల్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తామని చెప్పారు.
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ బోధన అందించడంతో పాటు, అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాల ద్వారా ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా యువతను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వివరించారు.

సమ్మక్క–సారలమ్మల ఆశీస్సులతోనే ములుగు నుంచి తమ పాదయాత్ర ప్రారంభమైందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ములుగు జిల్లాను ఏర్పాటు చేశామని తెలిపారు.
ములుగు జిల్లా కలెక్టరేట్ సముదాయం అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుతాయని చెప్పారు. త్వరలోనే ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనాల నిర్మాణాలను కూడా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధి, గిరిజన ప్రాంతాల పురోగతి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల సంక్షేమం, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ములుగు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైన నిధులు కేటాయించి పనులను వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు. ఆదివారం
ములుగు జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరైన సందర్భంగా మంత్రి సీతక్క వారికి ఘన స్వాగతం పలికారు.
ములుగు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు

ములుగు నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా గృహ నిర్మాణానికి సంబంధించి ములుగు నియోజకవర్గానికి 5,000 ఇళ్లను కేటాయించడం ప్రభుత్వానికి ఈ ప్రాంత అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

సాగునీటి రంగంలో రూ.200 కోట్లతో పోట్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, రామప్ప–లక్నవరం అనుసంధాన పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ పనులు పూర్తయితే రైతులకు సాగునీటి లభ్యత మెరుగుపడటంతో పాటు వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

విద్య, వైద్యం, పర్యాటక రంగాలకు ప్రాధాన్యత

సమ్మక్క–సారలమ్మ సన్నిధి అభివృద్ధితో పాటు జిల్లాలో విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి సీతక్క తెలిపారు. నర్సింగ్ కళాశాలల ఏర్పాటు, వైద్య విద్యా సదుపాయాల విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.
ములుగు ప్రాంత ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచేలా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు

గత పాలకులు ఎన్నికల సమయంలో శంకుస్థాపనలు చేయడం, ఆ తర్వాత నిధులు కేటాయించకుండా పనులను నిలిపివేయడం జరిగిందని మంత్రి విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను విడుదల చేసి, నిలిచిపోయిన పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ప్రజలు వాస్తవాలను గమనించాలని మంత్రి సీతక్క కోరారు.
ములుగు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు బలరాం నాయక్, వేం రెడ్డి నరేందర్ రెడ్డి, విప్ డా రాం చంద్ర నాయక్, ఎమ్మెల్యే. మందుల సామేలు జిల్లా కలెక్టర్ హేమంత్ బొర్కడే సహదేవరావు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *