సేద బాయి – ఎపిసోడ్ 04

ఎంవిఆర్ భవనం నుండి
పుడమి టీవీ జనసాహిత్యం

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ – పుడమి టీవీ, ఎంవిఆర్ మానవ వికాస రచనలు

ఊరంతా సిమ్మసీకటిగా ఉంది. కుక్కలు మొరుగుతున్నాయి. కొడుకు ఇంకా ఇంటి జాడ పట్టలేదని లచ్చవ్వ తండ్లాడబట్టింది. ఉండబట్టలేక పెనిమిటిని చూసి, “ఊళ్లోకి వెళ్లి కొడుకు ఎవరికైనా కనపడ్డడో అడిగ రాదయ్య,” అంది. “గీ నాత్రిపూట ఎవరు లేస్తరే లచ్చి? ఎగులు వారంగనే ఊళ్లోకి ఎల్లుతా,” అన్నాడు ఎల్లయ్య. “ఏమి మనిషివయ్య నువ్వు! ఇప్పటిదాకా కొడుకు రాలేదంటే ఈపాటికి ఏడున్నదో తెలుసుకోవాలే. గిట్ల ఇంట్లపంటే ఎట్లా? ఊళ్లకు పోదాం,” అంది లచ్చవ్వ. ఇంతలో బయట అడుగుల సప్పుడు వినిపించింది.

“కొడుకు ఇంటి ముఖాన వత్తున్నట్టున్నడే లచ్చి,” అని ఎల్లయ్య అనంగానే లచ్చవ్వకు ప్రాణం లేచి వచ్చినట్టయింది.తలుపు తీసి చూసింది. సీకట్లో ఎవరు కనబడలేదు.”బిడ్డా… వీరనాగులూ…” అని పిలిచింది. ఎవ్వరూ పలకలేదు. లాంతరు పట్టుకొని దొర మనుషులు ఇంటిముందు నుంచి నడుచుకుంటూ పోతున్నారు. వాళ్లను అడగాలని లచ్చవ్వ ఇంటి బయటకు వచ్చింది. లచ్చవ్వ    పిలవబోతుంటే,”  ఏందే  దివాను తక్కువదానా! ఇంట్లోకి పో. దొర మనుషులు చూస్తే ఇగ ఏమైనా ఉందా?” అని ఎల్లయ్య ఆపాడు.

కాసేపటికి లచ్చవ్వ ఉండబట్టలేక మల్లయ్య, శివయ్య, సమ్మయ్య, సూరయ్య, బొందయ్య ఇళ్లకు పెనిమిటిని తీసుకొని బయలుదేరింది. అందరినీ లేపింది.
ఒక్కొక్కరు ఇంటి బయటకు వచ్చి నిలబడ్డారు.  “ఏందే లచ్చవ్వ! యాళ్ల పాళ్లలేదా? అందరికీ నిద్ర చెడగొట్టినవు ఏందే?” అని శివయ్య అడిగాడు. “కొడుకు ఇంకా ఇంటికి రాలేదు బిడ్డా. ఎందుకో భయం అయితాంది.” “సిన్నపొల్లగాడనే… ఏడున్నడో ఏమో. ఇంటికి వత్తడు. నువ్వేమీ భయపడకు.” “మీకు సమజ్ అవుతలేదు. దొర ఏమైనా జేసిండు కావచ్చు. అందుకే కొడుకు ఇంటికి రాలేదు.” “లచ్చవ్వా! మేమంతా లేమా? వానికి ఏమైనా అయితే ఊకుంటమా? నువ్వు ఇంటికే పోవే.” “నా కొడుకు నా కళ్లకు కనబడేదాకా నేను ఇంట్లకు పోను.” “లచ్చి… జర వినవే. ఈ రాత్రి ఏడని వెతుకుతాం. ఇంటికి పోదాంపదా,”అనిపెనిమిటి ఎంత చెప్పినా వినకుండా మంకుపట్టి నిలబడింది. “ఇగ లచ్చవ్వ… మేము వెతుకుతాం. నువ్వు పోవే,” అని నచ్చజెప్పి ఇంటికి పంపించారు.పోరగాళ్ల
అలికిడి విని ఇళ్ల బయటకు వచ్చారు కొందరు. అప్పటికే అద్దమరాత్రి దాటింది. వీరనాగులు సోపతిగాళ్లంతా ఒక్క కత్తుపొలగాళ్లు. అందరికీ ఇరవై, ఇరవై రెండేళ్లు దాటాయి. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా ముందుగా నిలబడేది వీరనాగులే. ఓ ఇరవై మందికి పైగా జమయ్యారు. అందరి చేతుల్లో లంకకట్టెలు పట్టుకొని ఊరి పొలిమేర కాడికి వెళ్లారు.

ఈ రాత్రి అడవి జంతువులు వస్తాయి ఎట్ల?” అన్నాడు సమ్మయ్య. “ఏమీ కాదు సమ్మయ్య. మనందరం లేమా!” అన్నాడు శివయ్య. “మనం ఎంతమందిమి ఉంటే ఏంది? గుడ్డేలుగులు, కొండ్రీసుగాళ్లు బాగా తిరుగుతాయి.” “అయితే నిప్పు పెట్టు,” అన్నాడు శివయ్య. అగ్గిరాజేసిసెత్తనుఅంటిబెట్టాడు.మంటవచ్చిందో   లేదో ఒక్కసారిగా టపటపమని వాన పడింది. మంట ఆరిపోయింది. అందరూ కలిసి ఓ సెట్టు కింద నిలబడ్డారు. అందరిలో ఒకటే భయం… “వీరనాగులును దొర మనుషులు ఏమి చేయలేదుకదా? దొర సంపియ్యలేదుకదా? వీరనాగులుకు ఏమి కాకపోతే ఇంటికి ఎందుకు రాడు?” అనేక ప్రశ్నలు వాళ్ల మధ్య మేదులుతున్నాయి. సమ్మయ్యకు కోపం ఎక్కువ.వాడిది ఏమి తప్పున్నది “అసలు ఈశ్వరి ఎందుకు ఆ బాయికాడికి పోయింది? ఆమె పోతే తప్పులేదా? వీరనాగులు మీద ఎందుకు?” అన్నాడు. “అసలు బాయిలో పడిపోయేటామెను కాపాడుడే తప్ప.” సమ్మయ్య వేసిన ప్రశ్నలకు అందరిలో కోపం రగిలింది.
“వీరనాగులుకు ఏమైనా జరిగితే ఊకునేది లేదు. అందరం ఒక్క మాట మీద ఉండాలి,” అని శివయ్య అన్నాడు. “సరే,” అన్నారు అందరూ. కాసేపటికి వాన ఎలిసింది. వీరనాగులును వెతికేందుకు నాలుగు దిక్కులా వెళ్లారు.

తెల్లారింది. వీరనాగులు ఇంటికి రాలేదు. ఏమయ్యిండో తెల్వదు అని ఊరంతా పాకిపోయింది. ఇంటి ముందు ఆకిలి ఊడ్చడం, అలుకు జల్లుడు, ముగ్గు పెట్టడం ఏమీ జరగలేదు. పశువులను కొట్టం నుంచి విడిచిపెట్టలేదు. జంగట్లకు పశువులను తీసుకెళ్లడానికి ఊళ్లలో పొలగాళ్లు లేరు. అడవి పొంటిపోయినోళ్లు ఇంకా ఇళ్లకు రాలేదు.   దొర మనుషులు అందరి ఇళ్లకు వెళ్లి, “వీరిగాడు వచ్చిండా?” అని అడుగుతున్నారు. గుడిసెల్లోకి వెళ్లి చూస్తున్నారు. వీరనాగులు ఇంటికి వెళ్లి,  “ఏందే లచ్చి! ఇంకా ఈడనే ఉన్నరా? దొర పిలిసిన యాళ్ల కాలేదా? నీ కొడుకు యాడున్నడే? ఇగ మీరు తీసుకురాకపోతే ఎట్లుంటదో సూడు,” అని బెదిరించి ఇల్లు దాటిపోయారు.

రాలసెట్టు కాడికి ఊరి జనమంతా జమయ్యారు. వీరనాగులు అయ్యవ్వలు, పెద్దనాయిన, సిన్నాయిన, కొడుకులు అందరూ అక్కడికి చేరుకున్నారు.
పెద్దమనుషులు రాలసెట్టు చుట్టూ ఉన్న గద్దె మీద కూర్చున్నారు. గప్పుడే దొర అక్కడికి చేరుకున్నాడు. కుర్చీలో వాలాడు. “ఎడిరా వాడు…” అంటూ బండబూతులు తిట్టుడు మొదలుపెట్టాడు. “పెద్దింటి అమ్మాయి కావాలా రా కొడుక్కి? ఏమే లచ్చి! ఒరేయ్ ఎల్లిగా! నీ కొడుకు రాకపోతే మిమ్మల్ని ఊళ్ల నుంచి ఎల్లగొడుతాం బిడ్డా!” అని గద్దించాడు. అక్కడ అంతా నిశ్శబ్దం. దొర మాటలు తప్ప ఇంకేమీ వినిపించలేదు. ఇగ “ఎవరు వీరనాగులును పట్టుకొని వస్తారో వాళ్లకు పదికుంచెల జొన్నలు, ఒక యాటపోతు బహుమానంగా ఇత్తం ” అని దొర ప్రకటించాడు. ఊరి జనమంతా అక్కడి నుంచి తలో దిక్కు వెళ్లిపోయారు.

సోపతిగాళ్లు పొలిమేరంతా వెతికారు. ఎక్కడా కనబడలేదు. తంగేడు వనం పొంటిపోతుంటే ఎర్రటి పగిలిన సేతిగాజు ముక్కలు, తలరుమాలు  కనిపించాయి.

బురద మట్టిపై రక్తం దార కనిపించింది. శివయ్యకు కన్నీళ్లు ఆగలేదు.”వీరనాగులుకు ఏదో జరిగింది. ఇక్కడే ఎక్కడో ఉంటడు,”అనివెతకసాగారు.సిన్నప్పుడు వాగులో ఈతకు పోయినప్పుడు శివయ్య కొట్టుకుపోతుంటే ఎవ్వరూ దైర్యం చేయలేదు. వీరనాగులే శివయ్యను బతికించాడు. సిర్రాగోనే ఆట… ఇట్లా ఎన్నో జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వెతుకుతున్నారు. ఎదురుగా నక్కల గుంపు కనిపించింది. ఆకాశంలో పీతురు గద్దలు తిరుగుతానై, వాటిని చూసి జరగ రానిది ఏదో జరిగిందని నక్కలు కనిపించిన వైపుకు అందరూ పరిగెత్తారు...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *