పుడమిటివి సామాజికం సాహిత్యం

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్
చేతిలో కర్రతో బడి మెట్లు ఎక్కుకుంటూ —“మీ సార్ ఎక్కడున్నడు? ఆఫీసులోనే ఉన్నాడా?” అంటూ అక్కడున్న వాళ్లను అడుగుకుంటూ, కర్రతో తలుపు గట్టిగా నెట్టి ఆఫీస్ రూమ్‌లోకి వచ్చి కుర్చీని లాగి కూర్చుంది అమ్మ. “కూసున్నదో లేదో కళ్లకు అవ్వ కనబడుతలేదురా? ఉన్నది ఒక్కడివే కదరా! ముగ్గురు కొడుకుల్ని, ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకున్నా… ఉన్న ఇద్దరు బిడ్డలు ఎప్పుడు వస్తారో తెలియదు. ఒరేయ్, నువ్వైనా కడుపునిండా మాట్లాడవురా! నేను తల్లిని కాదురా? ఏం మనిషివిరా నువ్వు? బుర్రుమని కార్లపోతుంటావు… ఎప్పుడూ సుట్టుమందితోనే ఉంటావు. ఇంతకీ పొద్దుగూకుతాంది… కాసింత తిన్నావా లేదా చెప్పు?” అంటూ కర్ర పైకిలేపింది.ఓ హైస్కూల్ కరస్పాండెంట్‌ని, జర్నలిస్టుని కావచ్చు కానీ అమ్మ ప్రేమ ముందు నేనెంత?అమ్మ లేకపోతే నేనెవరిని?
“నీకు దండం పెడతానే రాజవ్వ… ఇంకా అన్నం తినలేదే, ఇగ తినడానికి వెళ్తున్నా” అనగానే —“బుద్ధి లేదురా! ఇప్పటిదాకా కొంచెమైనా తినకుంటే ఎట్లరా? ఇంట్లోకి పోయి బుక్కెడు తిను అంటూ వెళ్ళిపోయింది
తొంభై ఏళ్లు దాటిన అమ్మతో ప్రతి రోజు మాట్లాడాల్సిందే. పనిమీద పడి మాట్లాడకపోతే ఇగ అంతే. కాసేపు మాట్లాడితే సాలు — “ఇగ నీ పని చేసుకో” అంటూ వ
అంత వయసులో కూడా తెల్లవారకముందే, ఐదు గంటలకల్లా లేచి గేదెల పేడ తీసుకొచ్చి ఊడ్చి, అలుకు చల్లి, ముగ్గు పెట్టేది.

ఒక రోజు వాడమీద వాళ్లు చాలామంది పొద్దుపొద్దుగాలనే ఇంటికాడికి వచ్చారు. నిర్మలక్క, కేతమ్మ అత్త, రాజేశ్వరి వదిన, వెంకటమ్మ, రజిత చెల్లి… ఇలా వాడకట్టు ఆడవాళ్లు వచ్చేసరికి నేను యోగాసనాలు వేస్తుండగా ఆపేసి వాళ్ల దగ్గరకు వెళ్లాను.
నిర్మలక్క అంది —
“ఏందీ తమ్మీ! అవ్వ చేయబట్టి ఇంట్లో లొల్లిలు అయితానాయ్. గీ వయసులో అవ్వ పనిచేయడేంది? అలుకు జల్లి ముగ్గు పెట్టడేంది?”
అప్పుడు అందరి ఇళ్లల్ల ఒకటే మాట —
“రాజవ్వకు గింత వయసొచ్చినా పనిచేస్తాంది. ఇగ మీరు చేయరా?” అనబట్టే అవ్వ చేయబట్టి
పొద్దుగాల లేవగానే ఇంట్లో మహాభారత యుద్ధమే మొదలయితాంది. మనం ఇంత మాట్లాడుతున్నా అవ్వ అలుకు జల్లుతూనే వున్నది.సూడు తమ్మీ
“మీ రాజవ్వ చేయబట్టి ఏందీ తమ్మీ?”మాకీగోస అంటూ వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోయారు
అయినా అమ్మ పని మానలేదు.ఎందుకె అవ్వ పని చేయకుండా ఇంట్లఉండక అంటే
“భూదేవిని మంచిగా చూడాలి. ఇంటిముందు అలికి ముగ్గు పెట్టాలి బిడ్డ. లేకపోతే ఇంటికి మంచిది కాదు” అనేది. పచ్చగడ్డి, చిన్న కాగితం ముక్క కనిపించినా తీసి కాలబెట్టేది.

మా ఇల్లు వారసత్వ వైద్యనిలయం… సామాజిక, రాజకీయ వేదిక. గ్రామానికి సంబంధించిన వ్యక్తులు, రాజకీయ నాయకులు, దీర్ఘకాలిక రోగులు — ఇలా మా ఇల్లు ఎప్పుడూ సందడిగానే ఉండేది.
అమ్మ నిరంతరం పనిచేస్తూనే ఉండేది. మందులు దంచడం, తయారు చేయడం… రోజుకు మా కుటుంబ సభ్యులే కాకుండా వందమందికి పైగా బువ్వ, కూర వండిపెట్టేది. అయినా ఎప్పుడూ అలసటగా కనిపించేది కాదు. ఆర్యసమాజం ఆధ్వర్యంలో నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న నా తండ్రి సత్యదేవ్. ఆర్యసమాజ్ ప్రతినిధులతో కలిసి ఆయన దినచర్య సాగేది. ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన ప్రతినిధులు ఢిల్లీ నుంచి వచ్చిపోతుండేవారు. ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఆర్యసమాజ యజ్ఞం జరిగేది.

ఇక వైద్యంకోసం వచ్చిపోయే వ్యాధిగ్రస్తులు, వాళ్ల కుటుంబ సభ్యులతో ఇల్లు నిత్యం సందడిగా ఉండేది. రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరించారు. మొదట హయగ్రీవాచారి, తర్వాత ముచ్చర్ల సత్యనారాయణ తదితర నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. దేశాయిపేట, పైడిపల్లి, ఏనుమాముల, ఆరేపల్లి గ్రామాల మొట్టమొదటి ఉపసర్పంచ్‌గా, హన్మకొండ సింగిల్ విండో సొసైటీకి మొదటి ఛైర్మన్‌గా, తర్వాత తెలుగు దేశం పార్టీ ఏర్పడిన అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఇల్లు ఎప్పుడూ జనంతో నిండిపోయి ఉండేది. కానీ కష్టం మొత్తం అమ్మదే.

1984 సంక్రాంతి పండుగ రోజు ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదువుతున్న మా సోదరుడు రవీందర్ ఫ్రెండ్స్ వచ్చి నాలుగు రోజులు ఉండిపోయారు. వాళ్లు ఇంట్లోనుంచి బయటకు రాలేదు. నేను అప్పటికి ఐదో తరగతి చదువుతున్నాను. ఎవరు? ఏంటిది? అన్నది తెలియదు. అమ్మకు కూడా అర్థం కాలేదు. అయినా వాళ్లు ఉన్నన్ని రోజులు అన్ని వంటలు చేసి పెట్టింది.తర్వాత తెలిసింది — వరంగల్ ఆర్ఈసీలో ఎం.టెక్ చదివిన మా సోదరుడు రవీందర్ అలియాస్ చూటే పీపుల్స్ వార్ బాట పట్టి అజ్ఞాత జీవితం గడిపాడని. అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే, వాళ్లు తన క్లాస్మేట్లు శ్యామ్,తో పాటు పులి అంజయ్య,రామకృష్ణ, నాగేశ్వర్రావు లు పరుచయమున్న విద్యార్థులని చెప్పాడుఇంటికి వచ్చిన రాజకీయ నాయకులకు, పోలీసులకు, ఆర్యసమాజ్ ప్రతినిధులకు, సుట్టాలకు — ఎవరు వచ్చినా అమ్మకు తెలిసింది ఒక్కటే… అన్నం వండిపెట్టడం. ఇంట్లో బియ్యం లేకపోతే అప్పు తీసుకొచ్చి అయినా బువ్వ పెట్టేది.

నాకు వారసత్వ వైద్యం నేర్పడం కూడా అమ్మే మొదలుపెట్టింది. ఓ పాతికేళ్ల మహిళకు భగేంద్రం చికిత్స చేస్తున్నప్పుడు నా పక్కన కూర్చొని ఎలా చేయాలో చెప్పింది.అప్పుడు నాకు పద్దెనిమిది ఏళ్లు.ఆ సమయంలో అమ్మ చెప్పిన మాటలు నా జీవితానికే దారి చూపించాయి: “ఆమెలో ఎలాంటి ఆలోచన వచ్చినా, నీలో వయసురీత్యా ఆలోచనలు వచ్చినా అదుపులో ఉంచుకోవాలి బిడ్డ. అవకాశం వస్తే తప్పులు ఎవడైనా చేస్తడు. మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్లకుటుంబాలకు చికిత్స చేయడం తప్ప ఇంకేమీ పట్టించుకోవద్దు. ఆడ, మగ చూడొద్దు బిడ్డ. నేను ఎప్పటికీ ఉండను కదా… నువ్వు ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. దేవుడు అందరికీ వైద్యం ఇవ్వలేడు. పేరు చెడిపోతే తిరిగి రాదు బిడ్డ.”అమ్మ చెప్పిన ఆ నైతిక విలువలు వైద్యవృత్తిలోనే కాదు, నా జీవితంలో భాగమైపోయాయి.

ఇద్దరు సోదరులు ఒకే సంవత్సరంలో చనిపోవడం, మా కోడలి పెళ్లి జరిపించడం, ఆర్థిక ఒడిదుడుకులు — ఇలా ఎన్నో కష్టాల మధ్య అమ్మతో పాటుబాధ్యతగా వ్యవహరించి కుటుంబాన్ని ముందుకు నడిపించాం.కరోనా కాలం… అక్టోబర్ 2020.వర్షపు చినుకులు పడుతున్నాయి. రాత్రి పన్నెండు దాటింది. స్కూల్ ముందు ఉన్న బస్సుల దగ్గర ఏదో అలికిడి వినిపించిందని మా ఇంటి సమీపంలోని మౌలానా భాయ్ ఫోన్ చేశాడు.
100కి ఫోన్ చేయగానే పోలీసులు వెంటనే వచ్చారు. వాడవాళ్లు కూడా చేరుకున్నారు.

అందరి అలికిడి విని కొడుకుకేమో అయిందని అమ్మ ఇంట్లోనుంచి బయటకు వచ్చింది. బయట భయంకరమైన వాతారణం.
చేతుల్లో పెద్ద రాడ్లు, సుత్తెలు పట్టుకొని “చోళ ఫైనాన్స్ వాళ్లం” అంటూ గట్టిగా అరుస్తున్నారు కొందరు. ఇంకొందరు బస్సుల లోపలికి వెళ్లి గేర్ బాక్స్ దగ్గర పగులకొడుతున్నారు.ఆ గోల విని అమ్మ కంగారుగా బయటకు అడుగులు వేసింది. ఆ రోజు రాత్రి మారిటోరియం ఒక బస్సుకు రాలేదని వాళ్లు హంగామా చేశారు.
అప్పుడు అమ్మ కాలు జారి పడిపోయింది. వాచ్‌మన్ లాలు దంపతులు అమ్మను ఎత్తుకొని ఇంట్లో పడుకోబెట్టారు.ఆ రోజు నుంచి అమ్మ నడవడం కష్టమైంది. తొంటి ఎముక విరగడంతో ఆపరేషన్ కూడా చేయలేమని వైద్యులు చెప్పారు.అప్పటి నుంచి 4 ఫిబ్రవరి 2021 వరకు మంచానికే పరిమితమై చివరి శ్వాస విడిచింది అమ్మ.

చనిపోయే వరకు బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా లేవు.మంచానికే పరిమితమైనా అమ్మ కంటిచూపు బాగానే ఉండేది. అందరినీ గుర్తుపట్టేది. ప్రతి రోజు అమ్మ దగ్గరకు వెళ్లి మాట్లాడి, కాళ్లు మొక్కి బయటకు వచ్చేవాడిని.
ఆ రోజు మాత్రం అమ్మను దవాఖానకు తీసుకెళ్తానని చెప్పి, మీడియా పనిమీద మహబూబాబాద్ వెళ్లాను. అమ్మను కలవకుండా… కాళ్లు మొక్కకుండా వెళ్లాను.
అక్కడ ఉండగానే అమ్మ చనిపోయిందని తెలిసింది.నాకు ఇప్పటికీ — అమ్మ కాళ్లు మొక్కకపోవడం, నేను తీర్చుకోలేని రుణంగా మిగిలిపోయింది.

అమ్మ దహన సంస్కారాలు ఆర్యసమాజ పద్ధతిలో జరిగాయి. నేను చితిపెట్టి వెనక్కి తిరిగిపోలేదు. ఆవు నెయ్యి, సమిదలు, కర్పూరంతో యజ్ఞగుండంలా అమ్మ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నాను. ఆర్యసమాజాన్ని ప్రాణంలా ప్రేమించిన అమ్మకు, ఆమె కోరుకున్న విధంగానే చివరి నివాళులు అర్పించాను.
రజాకార్ల కాలం నుంచి అమ్మ చనిపోయే వరకు ఆమె చెప్పిన అనేక విషయాలు — ఒకదేశచరిత్రను,మనుషులతత్వాలనునాకళ్లముందునిలబెట్టాయి.కోల్పోతే మళ్లీ తిరిగిరాని కనిపించే దైవాలను అమ్మ నాన్నలను మంచిగా చూసుకోవాలని… ప్రేమను పంచాలని… ప్రతి కొడుకు, ప్రతి కూతురిని కోరుకుంటూ.