పుడమిటివిన్యూస్

వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ స్వేత

ఎలకంటి నరేష్ – తెలంగాణ బ్యూరోచీఫ్
రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా మన బాధ్యతలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు.
మంగళవారం హనుమకొండ లోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC)వరంగల్ ఫీల్డ్ కార్యాలయం ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ పై రెండు రోజుల ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఔట్రీచ్ ప్రోగ్రాం (ICOP), ఫోటో ఎక్సిబిషన్ ను పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన అనంతరం వరంగల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ తరుణ్ కుమార్ బోడా సీబీసీ రూపొందించిన జాతీయ పతాకం యొక్క ప్రస్థానం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల పై ఫోటో ఎగ్జిబిషన్‌లోని అంశాలను వివరించారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ ప్రసంగిస్తూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటంతో పాటు దేశ అభివృద్ధిలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని సూచించారు. మన రాజ్యాంగంలో రాసుకున్న హక్కులు, బాధ్యతలు ఏవైతే ఉన్నాయో పౌరులుగా మన బాధ్యత ఏంటి అనేవి ఇలాంటి కార్యక్రమాలు మనకి గుర్తు చేస్తాయన్నారు. ఎప్పుడూ మనం హక్కుల కోసం పోరాడడం అనేది ఒక నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇంకోవైపు మన బాధ్యత ఏముంది అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు.
మనకి దక్కిన స్వాతంత్ర్యానికి మనం గౌరవం, విలువ ఇస్తూ, భవిష్యత్తు తరాలకి ఎటువంటి సమాజాన్ని అందిస్తామో అనేది మనపైనే ఆధార పడి ఉంటుందన్నారు. దేశాభివృద్ధి, భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. మిమ్మల్ని మీరు ఎలా మలుచుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉంటుందని యువతను ఉద్దేశించి అన్నారు. మీ జీవితాలు మీరు ఎలా మలుచుకుంటారు అనేది వందకి వంద శాతం మీ చేతుల్లోనే ఉంటుందని, కష్టపడి మన జీవితాన్ని మనమే మెరుగుపరచుకోవాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో విద్యార్థులు చాలామంది ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటం, స్వాతంత్ర్యం కోసం జరిగిన త్యాగాలు, పోరాటాల జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్నారు. స్వతంత్ర భారతదేశంలో జన్మించడం మన అదృష్టం అని అన్నారు. ఇంత గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను వారసత్వంగా పొందడం మనకు లభించిన గొప్ప అవకాశమని తెలిపారు. మన రాజ్యాంగాన్ని పొందడం మన అదృష్టం అని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు మనకు ఉన్నాయని అన్నారు.

దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని, జనవరి 26వ తేదీని ఎంతో ఘనంగా జరుపుకుంటామని, ఇలాంటి కార్యక్రమాలను కూడా ప్రతి సంవత్సరం స్వాతంత్ర్యం వెనుక ఎంతటి కృషి, త్యాగం, పోరాటం దాగి ఉందో మనం ఎప్పటికీ మరచిపోకూడదనే ఉద్దేశంతో నిర్వహిస్తుంటామని అన్నారు. మనం ఈరోజు చూస్తున్న జాతీయ పతాకం ఒక్క రోజులో రూపుదిద్దుకున్నది కాదు అని దాని వెనుక ఎన్నో సంవత్సరాల కృషి, ఎన్నో పోరాటాలు ఉన్నాయని తెలిపారు. మనం పొందిన స్వేచ్ఛను, మనకు లభించిన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంతో కృతజ్ఞతతో గుర్తుంచుకోవాలని అన్నారు. మనకు లభించిన ఈ స్వేచ్ఛను కాపాడుకోవడంతో పాటు, భవిష్యత్ తరాలకు మరింత బలమైన ప్రజాస్వామ్యాన్ని అందించేందుకు మన వంతు కృషి చేయాలన్నారు.

కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర సమాచార శాఖ ఆద్వర్యం లో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ పై పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. విద్యార్థులలో దేశం పట్ల బాధ్యత పెంపొందించటానికి ఇటువంటి కార్యక్రమాలు అవసరం అన్నారు.
ఈ కార్యక్రమం లో కళా బృందాలు ‘హర్ ఘర్ తిరంగా’ పై ప్రదర్శించిన యక్షగానం విద్యార్థులను ఆకట్టుకుంది. క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రజనీ లత,ప్రోగ్రామ్ ఇన్ఛార్జి సమత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.