పుడమిటివిన్యూస్

ములుగు జిల్లా. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.

ఎలకంటి నరేష్ తెలంగాణ బ్యూరో చీఫ్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 16వ తేదీన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ సందర్శన, గిరిజన సంస్కృతి సాంప్రదాయాల నడుమ ముఖ్యమంత్రి వనదేవతల దర్శనానికి ప్రణాళిక బద్ధంగా అన్ని పనులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల ప్రాంగణంలో చేపడుతున్న ఏర్పాట్లను, హెలప్యాడ్, కమాండ్ కంట్రోల్ రూమ్ లను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వస్సల్ టోప్పో లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా తొలుత మేడారం చేరుకుని శ్రీ సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాక సందర్భంగా హెలిప్యాడ్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రత, వాహనాల రాకపోకలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
సమ్మక్క–సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణంలో కలియ తిరుగుతూ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై గుత్తేదారుతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ, అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పనులు పూర్తయిన వెంటనే మిగిలిపోయిన గ్రానైట్ రాళ్లు, నిర్మాణ వ్యర్థాలను తొలగించి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సంబంధిత గుత్తేదారునకు ఆదేశించారు.
గిరిజన సంస్కృతి, సంప్రదాయాల నడుమ ముఖ్యమంత్రి వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించే సందర్భంగా ఆశీర్వచనాలు, శేషవస్త్రాల సమర్పణ, మొక్కులు చెల్లించడం తదితర కార్యక్రమాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే పక్కాగా సిద్దం చేసుకోవాలని ఆలయ ఈవోను కలెక్టర్ ఆదేశించారు.
వనదేవతల ప్రాంగణం చుట్టుపక్కల గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ చేపట్టి మొక్కలు నాటాలని, ఆలయ ప్రాంగణంలో గ్రానైట్ రాళ్లతో ఏర్పాటు చేసిన భారీ పీటీ బీమ్స్‌ను పూలతో ఆకర్షణీయంగా సుందరీకరించాలని సంబంధిత అధికారులను సూచించారు. ఆలయ ప్రాంగణం ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా కనిపించేలా సుందరీకరణ పనులను పూర్తి పూర్తి చేయాలన్నారు.
వనదేవతల దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలించనునన్నందున అవసరమైన ఏర్పాట్లతో సిద్ధం చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.అన్ని చోట్ల పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, వాహనాల నియంత్రణ, ప్రోటోకాల్, రాకపోకలు, ఆలయ పరిసరాల్లో భద్రత తదితర అంశాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్ జి, ఆర్డీవో కృష్ణవేణి, డీఎస్పీ రవీందర్, ఆలయ ఈవో వీరస్వామి, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యామ్ సింగ్, గుత్తేదారులు ఆదినారాయణ, తాడ్వాయి తహసిల్దార్ సురేష్ బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.