పుడమి టివి న్యూస
ఎలకంటి నరేష్ తెలంగాణ బ్యూరో చీఫ్
రాబోయే దీపావళిని పురస్కరించుకొని హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా బాణసంచా నిల్వ చేసినా, విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హసన్ పర్తి ఇన్స్పెక్టర్ ఆకునూరి మహేందర్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగ వేళ ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. బాణసంచా విక్రయాలు జరపాలనుకునే వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా నివాస ప్రాంతాల మధ్య అనుమతి లేని ప్రదేశాలలో బాణసంచా నిల్వ ఉంచడం పూర్తిగా నిషిద్ధమన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి బాణసంచా అక్రమంగా కలిగి ఉన్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా నిలువ ఉంచినట్లు గుర్తిస్తే సరుకును సీజ్ చేయడమే కాకుండా బాధ్యులపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
ప్రజలు, వ్యాపారులు పోలీసులకు సహకరించి సురక్షితమైన వాతావరణంలో దీపావళి పండుగను జరుపుకోవాలని ఇన్స్పెక్టర్ ఆకునూరి మహేందర్ కోరారు..
