పుడమిటివి జనసాహిత్యం -సామాజిక కవిత్వం
పొట్లపల్లి కలం
– పొట్లపల్లి శ్రీనివాసరావు
9849254078
చదువుల తల్లికి అనుంగు పుత్రుడు,
విద్యార్థుల జ్ఞాన బోధనకు ఆది గురువు,
చదువుకున్న రోజుల్లోని నిన్నటి మాట.
వింత పోకడల ఆధునిక నాగరికత,
చదువున్నా లేకున్నా ఒంటబట్టిన విశృంఖలత,
సంపాదనలో కొట్టుమిట్టాడే తల్లిదండ్రుల బతుకుబాట,
ఉద్ధరించాల్సిన సంతానం నడిబజార్లో సయ్యాట.
పిల్లల చేతుల్లో పుస్తకాలు బరువై,
సెల్ ఫోన్, రీల్స్, గేములు చేరువై,
కాస్ట్లీ టూవీలర్,ఫోర్ వీలర్,
చదువు కొనే సంతలో లగ్జరీ
భవిష్యత్తు యావ లేదు,
పబ్బులు, షికార్లదే ధ్యాస.
అమ్మ ఒడిలో పుడతాం,
గురువు బడిలో మనిషిగా మారాలి కదా!
ఎదిగే కొద్దీ విశాలత కోల్పోయి,
గురువంటే భయం లేక,
గురువులనే భయపెడుతూ,
నిషా చరులమై సంచరిస్తున్నాం.
కులం లేని అక్షరానికి, మతం లేని జ్ఞానానికి,
రంగులద్ది మల్లగుల్లాలు పడుతున్నాం,
ప్రశ్నించలేని నోర్లన్నీ కత్తులు, కటార్లతో,
గుంపులు గుంపులుగా గొంతు చించుకుంటున్నాం.
జీతం కోసం, టార్గెట్ కోసం,
ఆత్మాభిమానాన్ని అవనతం చేస్తున్నాం,
పాఠం చెప్పే నోటితోనే క్షమాపణ చెప్పిస్తున్నాం...
కళ్ళున్న సమాజమా.. చూస్తున్నావా?
పిల్లల ముందు తలదించే దీనస్థితి,
విద్య కారుస్తున్న కన్నీరు
*. *. * * *
నల్ల బోర్డు మీది తెల్లని అక్షరాలు,
నుదిటిన దిద్దే వెలుగు రేఖలు,
దారి చూపే పాలపుంతలు,
బోధకులు బోధివృక్షాలు
ఆరిపోని దీపాలు, అలసిపోని నావికులు.
