వరంగల్–కాజీపేట రైల్వే అభివృద్ధికి 19 కీలక అంశాలపై ఎంపీ డా. కడియం కావ్య ప్రత్యేక దృష్టి

పుడమిటివి న్యూస్

వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

ఎలకంటి నరేష్
తెలంగాణ బ్యూరో చీఫ్

సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలోని సమన్వయ్ సమావేశ మందిరంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అధ్యక్షతన నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే ఎంపీల సమీక్షా సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని రైల్వే రంగ అభివృద్ధికి సంబంధించిన 19 కీలక అంశాలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు.

అందులో ప్రధానంగా వరంగల్ – కాజీపేట ప్రాంతం దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత కీలకమైన రైల్వే కేంద్రంగా ఉందని, ప్రయాణికుల రద్దీతో పాటు బొగ్గు, సిమెంట్, ఎఫ్‌సీఐ, ఎరువులు, గ్రానైట్ తదితర పారిశ్రామిక సరుకు రవాణాలో ఈ ప్రాంతం గణనీయమైన పాత్ర పోషిస్తోందని ఎంపీ డా. కడియం కావ్య వివరించారు. ఈ ప్రాంతానికి రైల్వే పరంగా మరింత ప్రాధాన్యత కల్పించి, మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వరంగల్ పేట కడియం కావ్య స్పష్టం చేశారు.

కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు

రైల్వే జోన్ల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు కొత్తగా ఏర్పడనున్న విశాఖపట్నం జోన్‌కు వెళ్లే పరిస్థితిలో దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే మిగిలే అవకాశం ఉందని ఎంపీ వివరించారు.

ఈ నేపథ్యంలో కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడం అత్యంత ప్రాధాన్యమని ఎంపీ పేర్కొన్నారు. కాజీపేట–వరంగల్ ప్రాంతం భారీ సరుకు రవాణా ఆదాయాన్ని అందిస్తున్న కీలక రైల్వే హబ్ అని, సుమారు 48.6 శాతం వరకు సరుకు రవాణా ఆదాయంలో ఈ ప్రాంతం వాటా ఉందని తెలిపారు.

కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (RMU) పనులను వేగవంతం చేయాలి

కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులు, రైల్వే లింక్, ఇతర మౌలిక వసతుల పనుల ప్రస్తుత స్థితిని ఎంపీ అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీ పూర్తిస్థాయి ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ రకమైన కోచ్‌లు లేదా రైల్వే యూనిట్లు తయారు చేయనున్నారు, ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయి, కాజీపేట–వరంగల్ ప్రాంత యువతకు ఎలాంటి ఉద్యోగ, నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పిస్తారనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

వాగన్ వర్క్‌షాప్ ప్రాంతంలో ROB/ఫ్లైఓవర్

వాగన్ వర్క్‌షాప్ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌లను దాటేందుకు రోడ్ ఓవర్ బ్రిడ్జి/ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి స్థానిక ప్రజల రాకపోకలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు.

కాజీపేట జంక్షన్ అభివృద్ధి

కాజీపేట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరో రెండు ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

కాజీపేట టౌన్ స్టేషన్ ఆధునీకరణ

పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, భవిష్యత్ పారిశ్రామిక మరియు రైల్వే ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకుని కాజీపేట టౌన్ స్టేషన్‌కు దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని కోరారు. స్టేషన్‌ను ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ముఖ్యమైన రైళ్లకు కాజీపేట టౌన్‌లో హాల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కాజీపేట నుంచి కొత్త రైళ్లను ప్రారంభించాలి

కాజీపేటలో ఉన్న పిట్‌లైన్లు, నిర్వహణ సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా కాజీపేట నుంచి మరిన్ని ఆరిజినేటింగ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని ఎంపీ డా.కడియం కావ్య కోరారు.

అలాగే ప్రస్తుతం వారంలో ఐదు రోజులు మాత్రమే నడుస్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిరోజూ నడపాలని కోరారు. దీనివల్ల తిరుపతి వెళ్లే భక్తులు, ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలగడంతో పాటు రైల్వే ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు.

కాజీపేట రైల్వే సబ్-డివిజనల్ ఆసుపత్రి అభివృద్ధి

కాజీపేట రైల్వే సబ్-డివిజనల్ ఆసుపత్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీ కోరారు. పెండింగ్‌లో ఉన్న మొదటి అంతస్తు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. గైనకాలజిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్ తదితర స్పెషలిస్ట్ వైద్యులను నియమించాలి. అవసరమైన వైద్య, సహాయక సిబ్బందిని నియమించాలి. లాలాగూడ రైల్వే ఆసుపత్రి తరహాలో క్లినికల్ ల్యాబ్, డయాగ్నస్టిక్ పరికరాలను ఆధునీకరించాలి. ఇన్‌పేషెంట్, సర్జికల్, ఎమర్జెన్సీ సేవలను ఏర్పాటు చేయాలి. మెరుగైన వైద్య సేవల కోసం టెర్షియరీ కేర్ ఆసుపత్రులతో రిఫరల్/ఎంప్యానెల్‌మెంట్‌ను విస్తరించాని ఈ పనులకు అవసరమైన నిధులను కేటాయించి అభివృద్ధిని వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ కోరారు.

రైల్వే కాలనీల్లో మౌలిక వసతులు

కాజీపేట రైల్వే కాలనీల్లో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఎంపీ కోరారు.

డీజిల్, ఎలక్ట్రిక్ లోకో షెడ్లకు కొత్త FOB

కాజీపేటలోని డీజిల్ లోకో షెడ్, ఎలక్ట్రిక్ లోకో షెడ్‌లకు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేసి సిబ్బంది రాకపోకలకు భద్రత కల్పించాలని కోరారు.

కాజీపేట జంక్షన్‌లో ఉద్యోగులకు విశ్రాంతి గది

ఇతర స్టేషన్ల నుంచి కాజీపేటకు విధుల నిమిత్తం వచ్చే నాన్-సూపర్వైజరీ సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గది ఏర్పాటు చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు.కాజీపేట ప్రాధాన్యతను తగ్గించే చర్యలను నిలిపివేయాలి

కాజీపేటలో రైల్వే కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు.

ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్, ట్రాక్షన్ సబ్‌స్టేషన్లు, జనరల్ ఎలక్ట్రికల్ సర్వీసుల నిర్వహణ కోసం Traction Distribution పోస్టును ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ఇతర డివిజన్లకు సిబ్బంది శిక్షణ కోసం వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా ట్రాక్షన్ సిబ్బంది కోసం గతంలో ఉన్న ట్రైనింగ్ స్కూల్‌ను తిరిగి ప్రారంభించాలని కోరారు.

. కాజీపేటలో మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి

రైల్వే కరెంట్ పోల్ నంబర్ KZJ/3385 నుంచి KZJ/1399 వరకు బోడగుట్ట వైపు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎంపీ కోరారు.

భూపాలపల్లి రైల్వే స్టేషన్, కొత్త రైల్వే లైన్

భూపాలపల్లి ప్రాంత ప్రజలకు రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు భూపాలపల్లిలో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యామ్నాయంగా భూపాలపల్లి జిల్లాకు సమీపంలోని హసన్‌పర్తి రోడ్–హసన్‌పర్తి మండలం లేదా ఉప్పల్–కమలాపూర్ మండలం ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి కొత్త రైల్వే లైన్ ద్వారా అనుసంధానం చేయాలని సూచించారు.

కాజీపేట బస్ స్టేషన్‌కు రైల్వే భూమి కేటాయింపు

కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో 1 ఎకరం రైల్వే భూమిని TSRTC బస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించాలని ఎంపీ కోరారు. రైల్వే–ఆర్టీసీ రవాణా వ్యవస్థలను సమన్వయం చేయడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని తెలిపారు.

ఫాతిమా బ్రిడ్జి వద్ద రెండో ROB

హనుమకొండ–కాజీపేట మధ్య NH-163పై ఫాతిమా బ్రిడ్జి వద్ద రెండో రోడ్ ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణాన్ని చేపట్టాలని ఎంపీ కోరారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపేందుకు ఈ వంతెన ఎంతో అవసరమని తెలిపారు.

. నెహ్రూ నగర్ రైల్వే క్వార్టర్స్ స్థల అభివృద్ధి

నెహ్రూ నగర్‌లో శిథిలావస్థకు చేరిన ఖాళీ రైల్వే క్వార్టర్స్‌ను తొలగించి, ఆ స్థలాన్ని వాణిజ్య దుకాణాల కోసం షట్టర్లుగా అభివృద్ధి చేయాలని కోరారు. దీనివల్ల భద్రత మెరుగుపడటంతో పాటు స్థానిక ఉపాధికి అవకాశం కల్పించి రైల్వేకు ఆదాయం సమకూర్చవచ్చని తెలిపారు.

కాజీపేట స్టేషన్ ప్రవేశద్వారం వద్ద స్టీమ్ ఇంజిన్ నమూనా తరలింపు

ప్రయాణికుల రాకపోకలు, వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు కలగకుండా కాజీపేట రైల్వే స్టేషన్ ప్రవేశద్వారం వద్ద ఉన్న స్టీమ్ ఇంజిన్ మోడల్‌ను తగిన ప్రత్యామ్నాయ ప్రదేశానికి తరలించాలని ఎంపీ కోరారు.

రైల్వే క్వార్టర్స్ నిర్వహణకు సిబ్బంది కొరత

సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (IOW), ఇంజినీరింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా కాజీపేట రైల్వే క్వార్టర్స్ నిర్వహణ సరిగా జరగడం లేదని ఎంపీ జీఎం దృష్టికి తీసుకెళ్లారు. సరైన నిర్వహణ లేక ఉద్యోగులు క్వార్టర్స్‌ను ఖాళీ చేస్తున్న పరిస్థితిని నివారించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు.

రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి

సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన కాజీపేట రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్‌కు 2,500 మంది సభ్యులు ఉన్నప్పటికీ ప్రస్తుతం భవనం, పారిశుధ్యం, ఇతర సౌకర్యాలు అధ్వాన్నంగా ఉన్నాయని ఎంపీ వివరించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఏసీ మరమ్మతులు, తగిన డైనింగ్ సదుపాయం లేకపోవడం తదితర సమస్యలను పరిష్కరించడంతో పాటు, పక్కనే ఉన్న రైల్వే కమ్యూనిటీ హాల్‌ను కూడా ఆధునీకరించి అవసరమైన అభివృద్ధి నిధులు కేటాయించాలని కోరారు.

ఈ సమావేశంలో కాజీపేట, బెల్లంపల్లి రన్నింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రత్యేకంగా ప్రస్తావించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారం నంబర్–6 వద్ద కొనసాగుతున్న గుణదల (GALA) క్రూ డిపోను కాజీపేట లేదా వరంగల్‌కు తరలించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ డిపోలో సుమారు 500 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, సికింద్రాబాద్ డివిజన్‌కు చెందిన సిబ్బంది జోనల్ పరిధికి దూరంగా ఉన్న ప్రాంతం నుంచి సుదీర్ఘ దూరాలు విధులు నిర్వహించడం వల్ల తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిబ్బందికి వైద్య సదుపాయాలు, క్వార్టర్స్ వంటి మౌలిక వసతుల కొరతతో పాటు పరిపాలనా, ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఉన్నందున గునడాల డిపోను వరంగల్–కాజీపేటకు తరలించడం ద్వారా సిబ్బందికి మెరుగైన పని పరిస్థితులు కల్పించడంతో పాటు రైల్వే పరిపాలన మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు.

రంగల్ రైల్వే అభివృద్ధికి నిరంతర కృషి

వరంగల్–కాజీపేట ప్రాంతం తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలో కీలకమైన రైల్వే జంక్షన్‌గా అభివృద్ధి చెందే సామర్థ్యం కలిగి ఉందని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యాలు, సరుకు రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, రైల్వే ఉద్యోగుల సంక్షేమం, ప్రాంతీయ కనెక్టివిటీ వంటి అన్ని అంశాలను సమగ్రంగా దృష్టిలో ఉంచుకుని ఈ 19 అంశాలను రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

కాజీపేట డివిజన్ ఏర్పాటు, కాజీపేట–వరంగల్ రైల్వే మౌలిక వసతుల విస్తరణ, కొత్త రైళ్లు, స్టేషన్ల ఆధునీకరణతో వరంగల్ ప్రాంతానికి రైల్వే రంగంలో మరింత ప్రాధాన్యత తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *