భావుకుడు!

పుడమిటివి జనసాహిత్యం

దండమూడి శ్రీచరణ్
కవి రచయిత
9866188266

అలౌకిక అద్భుత సౌందర్యాన్ని వీక్షిస్తాడు.

తన ఊహలకు రెక్కలు తొడిగి,

అనంత కాల్పనిక విహాయాసంలో విహరిస్తాడు.

తన ఆత్మ సంగీతాన్ని హృదయంతో ఆలకిస్తాడు.

తారలతో తోరణాలు కడతాడు.

సెలయేరులో మిల మిలలు ఏరుకుంటాడు.

అవని అంతా వర్ణ శోభితంగా భావిస్తాడు.

అన్ని అద్భుతాలను ఒకచో చేర్చి,

అన్ని రాగాలను మేళవించుకొని,

తన మనో నేత్రం ద్వారా

ఓ సౌందర్య రాశిని సృజించుకుంటాడు.

ఆమెకు తన ప్రాణాన్నే ధారపోసి,

ఊపిరులూదుతాడు.

అలా తన ఊహా ప్రేయసిని రూపు కడతాడు.

ఆమె అప్సరాంగనల కన్నా అపురూపం

అతనికి.దైవం కన్నా పూజనీయం

ఆమె అతనికి.ఆమెను ఆరాధిస్తాడు.

ఆమెతో కలలు పంచుకుంటాడు.

ఆమెకు కబురు పంపుతాడు.

ఆమె కోసం నిదుర మాని పలవరిస్తాడు.

ఆమె కోసం వీధులు తిరుగుతాడు.

ఆమె తలపులలో లోకం మరచి జీవిస్తాడు.

ఆమె విరహంలో విలపిస్తాడు.

ఆమె పరోక్షంలో ఆమెకై తపిస్తాడు.

ఆమె అతనికి దక్కక దుఃఖిస్తాడు.

అతని నిలువెల్లా ఆమె తలపులే నిండిపోతాయి.

అతని మనసంతా ఆమె.అతని ప్రాణమే ఆమె

.ఆమె లేని అతని జీవితం దుర్భరం.

అతని ప్రేమ కన్నీరవుతుంది.గానమవుతుంది,

శిల్పమవుతుంది,కవిత్వమవుతుంది.

అలాంటి భావుకుడికి

యదార్థ జగత్తులో ఆమె లభించక

అతని బ్రతుకు దుర్భరమవుతుంది.

అతని వెతుకులాట,శోధన,అన్వేషణ

అతనిని పిచ్చివాణ్ణి చేస్తుంది.

హృదయం గాయమవుతుంది.

అతని నిరంతర అన్వేషణలోనే

అతని ఆనందమూ, దుఃఖమూ.

అతడి విముక్తి తన ఊహా ప్రేయసిని

వాస్తవ జగత్తులో పొందినప్పుడే.

అది సాధ్య పడక అతను

వెఱ్ఱివాడై తిరుగాడుతుంటాడు

తన ఊహా జగత్తులో.

తన నీడ వెంట తానే సంచరిస్తాడు.

తనకు తానే భారమవుతాడు.

తనలోనే తాను లీనమవుతాడు

అతని అశ్రువులు అక్షరాలవుతాయి.

అతడి గాయాలు గేయాలవుతాయి.

అతడు తనలో తానొక

ఏకాంత సౌందర్యాన్ని సృజించుకుంటాడు.

అందులో బంధీ అవుతాడు.

అందులోనే అతనికి

సంతోషమూ,సల్లాపమూ,సంతాపమూ.

అతడొక ప్రేమైక జీవి.

అతడొక ఏకాంత ప్రాణి.

అతడొక ప్రాణమున్న వేణువు.

అతడు తనకు తానే అర్ధమవని ప్రహేళిక!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *