పుడమిటివి సాహిత్యం సామాజికం
జీవితపాఠం పుస్తక సమీక్ష

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
పుడమిటివి ఎడిటర్ ఇన్ చీఫ్

రచయిత కశివోజ్వల భాస్కరా చారి
ప్రతి మనిషి జీవితంలో ఒక కథ ఉంటది. అది మరొకరికి పాఠంగా నిలుస్తది. మనిషిలో మానసిక స్థైర్యాన్ని ఆత్మ బలాన్ని పెంచడంలో కథా సాహిత్యం తన పాత్రను పోషించింది. నేరుగా మనుషుల స్వభావాలను అందించలేని పరిస్థితులలో జంతువుల ప్రవర్తనతో పోల్చి మనుషుల స్వభావాలను ఆపాదించడంలో కథా సాహిత్యం గొప్ప పాత్ర నిర్వహించింది. కొన్ని కథలు ఒక సమాజాన్ని పూర్తి స్థాయిలో మార్చడానికి సమయాత్తం చేస్తే మరికొన్ని మనిషిలో పేరుకపోయిన తత్వాన్ని బహిర్గతం చేస్తాయి. దీంతో మానవ సమాజం ఎలా జీవించాలో తెలియజేయడంలో కథలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల జీవన విధానాన్ని వస్తువుగా ఎంచుకొని ప్రస్తుత సమాజంలో కనుమరుగవుతున్న నైతిక విలువలు కుటుంబ వ్యవస్థ మీద కదిలించి సమాజ మార్పు కోసం మానవీయ కోణంలో జీవిత పాఠంగా కశివోజ్వల భాస్కరాచారి తన కథలతో సాహితీ లోకంలోకి అడుగుపెడుతున్నాడు.
ప్రకృతిని ప్రేమించడం సాటి మనుషుల పట్ల మానవీయ కోణంలోఉండే సహజతత్వాన్ని ఇప్పటికే కోల్పోతున్న సమయంలో మంచి రచనలు ఎక్కడో మనిషిని కదిలిస్తాయి మార్పు తీసుకొస్తాయనేది సత్యం. అలాంటి రచనలు అందించడంలో అనేకమంది కవులు, రచయితలు, వివిధ మార్గాలను ఎంచుకొని ప్రజల్ని చైతన్యం తేవడంలో కీలకపాత్ర పోషించారు.

సామాజిక స్పృహ వున్న రచయితలు దిగజారిపోతున్న మానవ విలువలపై ఇప్పటికే అక్షరయుద్ధం చేస్తూనే వున్నారు. కవిత్వం, వ్యాసాలు, నవలలు, పాటలు మనిషిని కదిలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనేది వాస్తవం.
కథలు మనిషి జీవితాన్ని కళ్ళముందుంచేటట్టు తమ జీవిత ప్రయాణంలో జరిగిన ఏదో ఒక సంఘటన కథకుడు అందించడంతో పాఠకుడు కథలో లీనమైపోయి తనలో మార్పుకు శ్రీకారం జరుగుతుంది. కథ రచయిత విషయాన్ని వస్తువును ఎంచుకోవడంలో ఒక స్పష్టత కనబర్చినపుడు అది సామాజిక చైతన్యాన్ని రగిలిస్తుంది. ఆ కోణంలోనే కశివోజ్వల భాస్కరాచారి రచించిన పన్నెండు కథలు కాలచక్రం వలె అనేకఅంశాలను లేవనెత్తి ప్రస్తుత కాలంలో జరిగే విషయాలను కథలో చెప్పడం వల్ల ప్రతి మనిషి హృదయాన్ని కదిలిస్తుంది.
భాస్కరాచారి రాసిన ప్రతి కథ మానవీయ కోణంలో వుంది. ప్రకృతి ప్రేమికుడిగా కనిపిస్తుంది. ఇంటిముందున్న ఒక వేప చెట్టుమీద రాసిన కథ పక్షులకు, జంతువులకు, మనుషులకు ఎలా నీడగా నిలుస్తుందో చెప్తూనే శిశిర్ అనే పిల్లవాడు తన బాల్యంలో సాధారణ ఆట వస్తువులపై జోలికి వెళ్ళకుండా ఆ చెట్టును ప్రేమించడం, ఆ చెట్టును నరికి వేయాలని చూసినపుడు ఆ చెట్టుకు శిశిర్‌కు ఉన్న బంధాన్ని రచయిత కళ్లముందు చూపించాడు. ఒక చెట్టు నెలమట్టం చేస్తే ఎన్ని జీవాలకు నష్టం జరుగుతుందో ఆ కథ ద్వారా వివరించాడు.
మనిషిలో శతృత్వం, ద్వేషం, సాటి మనిషి పట్ల క్రూరత్వం ఉంటుంది కావచ్చు కాని తనను నరికివేయాలనుకున్న మనిషికి సైతం నీడనిచ్చేది ఒక చెట్టు మాత్రమే. ఆ చెట్టును నరకడం ప్రకృతిలో సకల జీవులకు ఎంత నష్టం జరుగుతుందో వేప చెట్టు కథ ద్వారా ఒక చిన్న పాత్రతో కదిలించి ప్రకృతిని కాపాడుకునేటువంటి విధంగా రచయిత కథను కొనసాగిస్తాడు.
సమాజంలో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. కుటుంబ బంధాలు కనుమరుగైనప్పుడు అందరూ ఉన్నా మనుషులు అనాథలుగా మిగిలిపోతారనేది నిజం. సొంత కొడుకులే తల్లిదండ్రుల్ని వదిలేసుకుని జీవిస్తున్న ప్రస్తుత ప్రపంచంలో ప్రతి వృద్ధుడు అనాథాశ్రమంలో చివరి గడియలు గడపాల్సివస్తుంది. పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులను వదిలేసుకునేటువంటి కొడుకులకు గుణపాఠంగా భాస్కరాచారి రాసిన “జీవిత పాఠం” కథ కనిపిస్తుంది. తన భార్య వేధింపుల వల్ల తండ్రిని అనాథాశ్రమంలో వేసిన ఒక కొడుకు చివరకు తండ్రిని అనాథాశ్రమం నుండి ఇంటికి రప్పించేవరకు జీవితపాఠం కథ కొనసాగుతుంది.
మనుషులు మనిషిగా ప్రవర్తించని సమయంలో తన కళ్లముందు జరిగిన సంఘటన అతన్ని కలచివేసింది. మÖడు కుక్కలు ఒక పంది కొట్లాడుకోవడం గమనించిన వ్యక్తి తన పిల్లల కోసం కుక్కలతో పోరాటం చేసి కాపాడుకున్న పందికి ఒళ్ళంతా గాయాలైన తన పిల్లలు బతికి బయటపడ్డారనే ఆనందం కనిపించినట్టు అనిపించడంతో అప్పటిదాకా నాన్న అనాథాశ్రమంలో వదిలేసిన కొడుకు తండ్రి తీసుకురావాలనే ధైర్యం వచ్చింది. తండ్రిని వదిలేసుకోలేక భార్యను ఎదిరించలేక మానసిక క్షోభకు గురై చివరకు వైద్యుని దగ్గర సిగ్గు విడిచి నిజాలు మాట్లాడుతున్న అని చెప్తూ తన అంతర్గతంగా కుమిలిపోతున్న అనేక విషయాలను చెప్పి కొంత ఊరటపొందటం అదే సమయంలో పంది కుక్కల కొట్లాటను గమనించడం తాను చేసిన పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నంలో బాగంగా తన భార్యకు ఫోన్ చేసి ధైర్యంగా నా తండ్రిని ఇంటికి తీసుకువస్తున్నానని చెప్పి అనాథాశ్రమం నుండి తండ్రిని అక్కున చేర్చుకోవడం కథలో కనిపిస్తుంది. కథకుడు సమాజంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులల్లో మానవ సంబంధాలు బలపడాలనే ఆకాంక్షను ఈ కథలో వెలిబుచ్చాడు.
పైడిపల్లి గ్రామంలో విశ్వబ్రాహ్మణ కులంలో కశివోజ్వల బాలరాజు అనసూర్య దంపతులకు కనిష్ఠ పుత్రునిగా జన్మించాడు. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఉన్నత విద్యను అభ్యసించాలనే సంకల్పంతో గ్రామ వాతావరణానికి దూరమయ్యాడు. తన సోదరులు లింగాచారి ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు., పూర్ణచంద్రచారి గ్రామ డీలర్‌గా సామాజిక కార్యకర్తగా తన ఊరితో పాటు చుట్టు ప్రక్కల గ్రామాలల్లో అందరికీ సుపరిచితుడు. భాస్కరాచారికి చిన్నతనం నుండే సాహిత్యం పట్ల మక్కువ.
తను పుట్టి పెరిగిన పైడిపల్లి కాకతీయ రాజుల వారసత్వ సంపద చివరి మట్టికోట కావడం అక్కడ సైనికపురి కూడా ఉండడం అనేక దేవాలయాలు ఆ పల్లెలో కన్పిస్తాయి. ఎల్లమ్మ గుట్ట, మార్కేండయ గుట్ట, దేవుని గుట్ట, దేవతల బావి, కాకతీయుల సామ్రాజ్యంలోని వెయ్యి స్తంభాల దేవాలయ నిర్మాణ సమయంలోని పైడిపల్లిలో శివుని గుడి నిర్మాణం జరిగిందని ఆధారాలున్నాయి. ఇలాంటి గ్రామంలో తొలితరం విప్లవ భావజాలం కలిగిన యువత నడియాడిన నేలగా చరిత్రకెక్కినప్పటికీ యువతలో సామాజిక స్పృహను రగిలించి ఈ దేశం తల ఎత్తుకునేలా తన అక్షరాలతో సమాజాన్ని దేశంవైపు నడిపించినా వివేకనందుని స్ఫూర్తి రచయిత భాస్కరాచారిలో కనిపిస్తుంది.

మన జీవితాలల్లో జరిగే సాధారణ అంశాలతో ప్రతి వ్యక్తిలో ఒక పాఠంగా రచయిత తన నైపుణ్యతను కనబరచాడు. 12 కథలు ఒక వార్షిక కాలాన్ని సూచించినట్టు ఒక మనిషిలో సహజ సిద్ధంగా జరిగే మార్పును, ప్రకృతితో ముడిపెట్టి తన రచనను కొనసాగించడం మరో విశేషం. రచయితది మొదటి పుస్తకంగా సాహితీకారులకు పాఠకులకు కనబడవచ్చు కానీ రచయిత తన పద్నాలుగవ యేట నుండే పాటలు, కథలు, నాటికలు రాసి తన సమాజం ముందు ప్రదర్శించడం, వినిపించడం కొనసాగించాడు. అది పుస్తక రూపం రావడానికి ముప్పైయేండ్లు పట్టింది. ఒక రకంగా రచయిత తన చైతన్యాన్ని ఒక కాలానికి తనకు తాను వెనక్కి నెట్టివేసుకున్నాడనిపిస్తుంది.
రచయిత భాస్కరాచారిలో అక్షర చైతన్యాన్ని ముప్పైయేండ్ల క్రితమే నేను ప్రత్యక్షంగా చూసి ఉన్నాను. ఆ కోణంలో భాస్కరాచారి నాకు ఆత్మీయ మిత్రుడిగా ఈ సాహితీ ప్రపంచంలో ఇప్పటికి ఆ పరంపర కొనసాగడం నాకు సంతోషంగా ఉంది. ప్రతి కథను జీవిత సత్యంగా మలచి అనేక మంది జీవితాలల్లో వెలుగులు నింపుతున్న ఈ అక్షరయోధుడు మరిన్ని పుస్తకాలతో సాహితీ సమాజంలో ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ రచయితకు అభినందనలు.