సాహిత్యం సామాజికం పుడమిటివి -ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్
పుడమిటివి చారిత్రకం


నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్
ప్రపంచ వారసత్వ సంపదగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రకటించడం మన వరంగల్ కాకతీయుల వారసత్వ వైభవం ప్రపంచ సంపదగా నిలవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్న ఈ ప్రపంచానికి, ఎనిమిది వందల ఏళ్ల క్రితమే “శాండ్‌బాక్స్ ఇంజినీరింగ్ విధానం”, నీటిలో తేలే ఇటుకలు, సప్తస్వరాలు పలికే రాతి స్తంభాలతో అబ్బురపరిచే నిర్మాణ శైలి ద్వారా కాకతీయులు తమ అసామాన్య ప్రతిభను చాటారు.

రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా చైనాలో జరిగిన సమావేశంలో ప్రకటించడంతో మీడియా ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. నేను 6టీవీ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధిగా అదే రోజు రామప్పపై ఒక మాక్ లైవ్ పంపించాను. “రామప్ప ప్రత్యేకతలపై పూర్తి కథనం పంపించాలి” అని 6టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ చెప్పడంతో, ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయానికి చేరుకున్నాను. అక్కడి అద్భుత కట్టడాలను గైడ్ సహాయంతో చిత్రీకరిస్తూ తిరిగాను.
క్రీ.శ. 1173లో గణపతిదేవుని సేనాధిపతి రేచర్ల రుద్రుడి పర్యవేక్షణలో శిల్పి రామప్ప చేతుల మీదుగా ప్రారంభమైన ఈ నిర్మాణం సుమారు నలభై ఏళ్ల పాటు కొనసాగి 1213లో పూర్తయింది. ఒకటి కాదు, రెండు కాదు… ఎన్నో అద్భుతాలు అక్కడ కనిపిస్తాయి.

ఆ కాలంలోనే హైహీల్ చెప్పులు ధరించిన నర్తకి శిల్పం చూసి ఆశ్చర్యపోయాను. “పాతకాలం వాళ్లకు ఏమి తెలుసు?” అనుకునే వారికి ఆ శిల్పమే సమాధానం. కాకతీయుల నాగరికత, జీవన శైలి ఎంత ఉన్నతంగా ఉందో అది తెలియజేస్తుంది. పేరిని నృత్య భంగిమలు, నల్లరాతి కట్టడాలు, గుడిని మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగు శిల్పాలు, ప్రతి ఏనుగు శిల్పం ఒక్కో ప్రత్యేకతను చూపించడం శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం.

గర్భగుడి ముందు ఉన్న నాలుగు నల్లరాతి స్తంభాల మధ్యుగా వచ్చే వెలుతురు శివలింగంపై పడే విధానం అద్భుతంగా ఉంటుంది. రాతి స్తంభాలను తట్టితే “స రి గ మ ప ద ని స” అనే సప్తస్వరాల తరంగాలు వినిపిస్తాయి. గుడి ముందు ఉన్న నంది శిల్పం “శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లు” కనిపించడం అక్కడి ప్రత్యేకత. ఇలా అన్నింటినీ కవర్ చేస్తూ, శివుడికి అభిషేకం చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన బావి దగ్గరకు వెళ్లాను. ఒక్కసారిగా నా బాల్య జ్ఞాపకాలు కళ్లముందు మెదిలాయి.
1986లో నేను 7వ తరగతి చదువుతున్న సమయంలో, మా ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి విద్యా విజ్ఞాన యాత్రగా రామప్ప, కాళేశ్వరం ప్రాంతాలకు ప్రత్యేక బస్సులో వెళ్లాం. మా తరగతి మిత్రులతో పాటు కొంతమంది గ్రామస్తులు కూడా వచ్చారు. రామప్ప గుడి ఆవరణలో ఉన్న బావి పక్కనే పెద్ద రేగు చెట్టు ఉండేది. ఆ సమయంలో చెట్టంతా రేగు పండ్లతో నిండిపోయి ఉండేది. ఆ బావిలో మట్టిఇటుకలను వేస్తే నీటిలో తేలడం చూసి కాకతీయుల నిర్మాణ నైపుణ్యాన్ని ఆశ్చర్యంగా గమనించాం.
మాతో పాటు మరికొన్ని పాఠశాలల విద్యార్థులు, పర్యాటకులు కూడా వచ్చారు. పిల్లలమే కదా… అందరూ రేగుపళ్ల కోసం చెట్టుపైకి రాళ్లు విసురుతున్నారు. నేను మాత్రం తేలే ఇటుకలను చూడటానికి బావి దగ్గరికి వెళ్లాను. అంతే… ఎవరో విసిరిన రాయి వచ్చి నా తలకు బలంగా తగిలింది. రక్తం కారడం మొదలైంది. షర్ట్ అంతా రక్తంతో తడిసిపోయింది. పెద్ద గాయం అయ్యింది. అయినా నాకు కన్నీళ్లు రాలేదు.

మా దోస్తులు అందరూ నా దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. ఎవరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. దూరం నుంచి గమనించిన మా లిల్లీ సుమతి టీచర్, జయ టీచర్ పరుగెత్తుకుంటూ వచ్చారు. వాళ్లు తమ కొంగుతో రక్తాన్ని తుడిచారు. “ఏమైంది బిడ్డా…” అంటూ ఆందోళనతో నన్ను ఓదార్చారు. రక్తం ఆగకపోవడంతో గాయంపై తమ కొంగును గట్టిగా అదిమిపట్టి, దగ్గరలో ఉన్న బోరింగ్ దగ్గరకు తీసుకెళ్లి తలను కడిగారు. “ఏమీ కాదు బిడ్డా…” అంటూ తల్లిలా ఆదరించారు. వాళ్ల చీరలపై రక్తం అంటినా పట్టించుకోలేదు. ఆ క్షణంలో వారు గురువులు కాదు… అమ్మలయ్యారు.
నేను మాత్రం ఏడవకపోవడం చూసి, “ఇంత మొండిగా ఉన్నావేంటి బిడ్డా… మేమే తట్టుకోలేకపోతున్నాం” అంటూ వాళ్లే కన్నీళ్లు పెట్టుకున్నారు.
అక్కడి నుంచి బస్సు కాళేశ్వరం వైపు బయలుదేరింది. ఇద్దరు టీచర్లు నన్ను తమ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇంటికి చేరుకునే వరకు కంటికి రెప్పలా చూసుకున్నారు.వార్త కోసం వెళ్లిన నాకు, ఆ బావి దగ్గరకు అడుగు పెట్టగానే ఆ రోజులు మళ్లీ కళ్లముందు ప్రత్యక్షమయ్యాయి. ఆ జ్ఞాపకం నన్ను నా బాల్యంలోకి తీసుకెళ్లింది.

అమ్మలా ప్రేమను పంచిన జయ టీచర్ ఇక లేరు. ఆమె చనిపోవడానికి కొద్దిరోజుల ముందు కలిశాను. “నేను చనిపోతే తప్పకుండా రావాలి” అంటూ తన కొడుకుకి నా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చింది. కానీ ఆమె చనిపోయిన విషయం కొద్దినెలల తర్వాత తెలిసింది. ఆ జ్ఞాపకం గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి.
లిల్లీ సుమతి టీచర్, జయ టీచర్ మా గురువులే కాదు… మాకు తల్లులు. నాకే కాదు, ఆరేపల్లిలో చదివిన వందలాది మంది విద్యార్థులకు వాళ్లంటే అపారమైన అభిమానం. ముఖ్యంగా సుమతి మేడం అంటే మా ఊరంతా గౌరవం. ఆమె గణితం చెప్పడం మొదలెడితే ఒక్క విద్యార్థి కూడా వేరే వైపు చూడడు. అరటిపండు ఒలిచినట్టు లెక్కలు చెప్పేది. కన్నతల్లి ప్రేమను పంచేది. ఉద్యోగిగా కాదు, గురువుగా కాదు… దేవుడు ఇచ్చిన తల్లిలా ప్రతి విద్యార్థి గుండెల్లో నిలిచిపోయింది. ఆరేపల్లి మట్టిని తాకితే చాలు… వాళ్లు చెప్పిన విద్యాబోధన గుర్తుకు వస్తుంది.

నేను 7వ తరగతి అర్ధ వార్షికపరీక్షలల్లో గణితంలో 94మార్కులు వచ్చాయి. 95మార్కులకు బదులు ఒక్క మార్క్ తక్కువ వచ్చిందని సుమతి మేడం దగ్గరికి వెళ్లాను, అప్పటికి నాలుగు దాటింది అందరూ ఇంటికి వెళ్లారు మేడం నా పేపర్ మళ్ళీ సరి చూసింది ఒక్క మార్క్ కోసం నేను పట్టుబట్టడం మేడం హన్మకొండ కు ఇంటికి వెళ్ళడానికి ఒక గంట ఆలస్యమయ్యింది.
జయ టీచర్ గట్టిగా మాట్లాడేది మేము గ్రామం నుండి చైతన్య యూత్ ద్వారా స్కూల్ కు వెళ్ళాం అరేయ్ ఇటు రారా అంది మగ వాళ్ళు ఎక్కడైనా మూత్రానికి వెళ్లుతారురా ఆడపిల్లలకి అసలు మూత్రశాలలు లేవు ఏమి చేస్తున్నారురా అంది ఆ మేడం అన్న మాటలకు ఊరి పెద్దలంత మూత్రశాలలు కట్టించారు
నా మా జీవితాలల్లో చెరగని ముద్రవేసిన జయ టీచర్,సుమతి టీచర్లను పాత జ్ఞాపకాలను కదిలించిన ఆ బావి నుంచి బయటకు వచ్చి, గుడి ఆవరణ వైపు నడిచాను. ఉత్తరం వైపున ఉన్న కన్నడ–తెలుగు శాసనాలున్న శిలాఫలకం దగ్గరకు వెళ్లాను. ఎన్నోసార్లు రామప్పకు వచ్చినా, ఆ శాసనాలను మాత్రమే గమనించాను. కానీ మా కెమెరామెన్ పాషా మాత్రం శిలాఫలకంపై చెక్కిన చిత్రాలను గమనించాడు.
గైడ్‌ను అడిగితే పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ శిలాఫలకంపై నాలుగు దిక్కులా చెక్కిన చిహ్నాలు నాకు ఎంతో ఆలోచన కలిగించాయి. తూర్పున సూర్యచంద్రులు, దక్షిణంలో ఆవుదూడ, పడమర వైపు శివలింగం, ఉత్తరంలో గణపతి చిత్రాలు కనిపించాయి. కాలం, వ్యవసాయం, పశుసంపద, దైవ విశ్వాసం… ఇవన్నీ కాకతీయుల పరిపాలనా తత్వాన్ని తెలియజేసే రాజముద్రలుగా అనిపించాయి. నా ఓరుగల్లు శిల్పకళా నైపుణ్యం, కాకతీయుల పరిపాలన ప్రపంచ మేధావులను ఈ నేలవైపు తిప్పింది. ప్రపంచ వారసత్వ సంపదగా ప్రపంచపటంలో రామప్ప నిలవడం నిజంగా చారిత్రాత్మక విజయమే.
ఇంకా రామప్ప గుడి వెనుక దారిలో ప్రతి అడుగడుగునా రంగురంగుల సీతాకోకచిలుకలు కనువిందు చేస్తాయి. పచ్చటి పొలాలు, చిన్నచిన్న చెట్ల మధ్య మట్టిబాటలో నడుస్తుంటే, మన అడుగుల శబ్దానికి ఒక్కసారిగా వందలాది సీతాకోకచిలుకలు ఎగిరిపడుతూ మన చుట్టూ అలుముకుంటాయి. ఆ క్షణం మనల్ని మనం మరిచిపోతాం.

రామప్ప చెరువుకు వెళ్లే దారిలో తూము ఉంటుంది. అక్కడి నుంచి నీళ్లు పంటపొలాలకు వెళ్తాయి . కట్టకింద కూరుకుపోయిన శివాలయం కూడా ఉంది. అలాంటి ఎన్నో ఆలయాలు రామప్ప పరిసరాల్లో మట్టిలో కలిసిపోయి ఆదరణ కోల్పోయాయి. గుట్టల నడుమ విస్తరించిన రామప్ప చెరువు పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అక్కడ బోటింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణ. గా కనిపిస్తుంది
చారిత్రక కట్టడాలు మన వారసత్వ సంపదలు. అద్భుతమైన పాలన అందించిన కాకతీయుల శిల్పసంపద, ఇంజినీరింగ్ నైపుణ్యం, జీవనశైలి, కళలు… ఈ భూమి ఉన్నంతకాలం నిలిచే చరిత్ర. ఇంకా వెయ్యిస్తంభాల గుడి, ఖిలా వరంగల్ కోట వంటి అనేక కట్టడాలు కూడా ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరాల్సి ఉంది.
రామప్ప గుడికి ప్రమాదం పొంచి ఉన్న సమయంలో నిలబడ్డ మేధావులు, కవులు, కళాకారులు, చరిత్ర నిపుణులు పాండురంగా రావు, జర్నలిస్ట్ చంద్రశేఖర్, ప్రజల కృషి ఫలితమే నేడు రామప్ప ప్రపంచ స్థాయిలో నిలబడటానికి కారణమైంది.