
ఎలకంటి నరేష్
పుడమిటివి బ్యూరో

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు ఈ నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలో నిర్వహించబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో సోమవారం హనుమకొండలోని కాలోజి కళాక్షేత్రంలో అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత ఎంతో కీలకం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా అనేక ప్రాణాలను రక్షించవచ్చు. హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగించడం, మితిమీరిన వేగంతో వాహనాలు నడపకపోవడం వంటి ప్రాథమిక నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలి. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం” అని పేర్కొన్నారు.
అనంతరం రోడ్డు భద్రత ప్రాముఖ్యతపై ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
పోలీస్ జాగృతి బృందం , తెలంగాణ సాంస్కృతిక సారథి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు రోడ్డు భద్రతపై నిర్వహించిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకుని, ప్రజల్లో అవగాహన పెంపొందించాయి.
అంతకుముందు పోలీసుల ఆధ్వర్యంలో కాళోజి కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటుచేసిన స్టాల్స్ లో వరంగల్ కమిషనరేట్ పలు ప్రాంతాల్లో జరిగిన ఘోరమైనరోడ్డు ప్రమాదాలకు గురైన వాహనాలను ఏర్పాటు చేసి, సదరు వాహనం రోడ్డు ప్రమాదానికి గురి కావడానికి గల కారణాలు, ట్రాఫిక్ పోలీసులు వినియోగించే సామాగ్రి ని పోలీస్ అధికారులు ఎంఎల్సీ, పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్లుకు వివరించారు.
ఈ కార్యక్రమంలో డిసిపిలు ధార కవిత, అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, రవి, అదనపు డిసిపి ప్రభాకరరావు, ఏఎస్పీ శుభం, ట్రాఫిక్ ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహారావు, ప్రశాంత్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, టి.టి.సి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హనుమకొండ, కేయుసి, సుబేదారి ఇన్స్పెక్టర్లు శివకుమార్, రవికుమార్, రంజిత్‌తో పాటు పోలీసు, రవాణా, రెవెన్యూ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, సర్పంచులు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.