
ప్రముఖ కవి అన్వర్ మట్టిబిడ్డల పుస్తకం పై ప్రముఖ కవి అన్వర్ స్పందన. అన్వర్ , ప్రముఖ కవి, రచయిత

మట్టిబిడ్డల పుస్తక రచయిత
నాగబెల్లి జితేందర్ సామ్రాట్ఎడిటర్ ఇన్ చీప్
పుడమిటివి న్యూస్ &ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్
…….
ఆరేపల్లి మట్టి చాలామంది జీవితాలను గొప్పగా పరిమళింపజేసింది.కొందరిని చరిత్రకు పరిచయం చేసింది. కొందరిని వర్తమానంలో నిలబెట్టింది. కొందరిని భవిష్యత్ మార్గదర్శకులను చేసింది. ఈ మట్టి కన్నీళ్లు ఇచ్చి ఏడవడం నేర్పింది. మనసు ఇచ్చి ప్రేమించడం నేర్పింది. ప్రమీదను చేసి దీపంగా వెలిగించింది. ఈ మట్టి పట్టెడన్నంతోపాటు ప్రాణశక్తిని, జీవశక్తిని నింపి ఊరి చరిత్రలో పునాదిరాళ్లను చేసింది.

. ఈ మట్టి చాలా మందినే కన్నది కానీగుండె నిండా కొందరినే మోసింది.. ఆరేపల్లి మట్టి జ్ఞాపకాల దొంతరల్లోంచి బతికిన కొందరి, బతుకుతున్న కొందరి జీవితాల్ని అక్షరం చేసి వూరి మట్టిపూల పరిమళాలను కలిపి విస్తృతం, విశాలం, విస్తాపనం చేస్తున్నడు కవిమిత్రుడు, గాయకుడు, సీనియర్ జర్నలిస్టు నాగబెల్లి జితేందర్ సామ్రాట రాడని ఒత్తిడిలో వున్న మనుషుల హృదయాల మీద స్వేచ్ఛగా, ప్రేమగా, స్నేహంగా, సమాజ అభివృద్ధిలో భాగంగా అందరి గుండెల్లో నిలిచిపోయిన ఊరి మట్టి బిడ్డల జీవితాల్ని జ్ఞాపకంగా బరువెక్కిన గుండెతో, చెలుమలూరిన కన్నులతో స్వరమెత్తి కలం కదిలించిండు జితేందర్.. ఇది గుప్పెడు మనుషుల చరిత్రే కావచ్చు …ఆరేపల్లిలో పుట్టి గుభాళించిన జీ.వితాల చరిత్ర ఇద
మౌనంగా మనసులోనే చాలాకాలంగా దాచుకున్న జ్ఞాపకాలు ఇవి. అర్థరాత్రుళ్లు ఒక్కొక్కరు గుండె మీద కూసొని కంటిమీద నిద్ర లేకుండా చేసిన జ్ఞాపకాలు ఇవి. గతాలను, మరచిపోలేని జీవితాలను అక్షరాలుగా వర్తమానం చేశాడు జితేందర్. ఈ మట్టి బిడ్డలను ఈ తరానికి, భవిష్యత్ తరాలకు పరిచయం చేస్తూ కొత్తగా మళ్లీ జీవితాలనిచ్చాడు అక్షరాలుగా !
*
. సమాజాన్ని నిర్మించాలి అంటాం – ఇటుకలు గోడలతో కాదు. మనుషులతో, మనుషులతో, మానవత్వంతో నిర్మించాలి. నాగబెల్లి జితేందర్ మాత్రం తన సమాజాన్ని ఆలోచనల అక్షరాల నిప్పురవ్వలతో నిర్మించాడు. అవి చిటపటమంటూనే వెలుగుల్ని పంచుతాయి.
అవునూ, ఆరేపల్లి మట్టి బిడ్డల యథార్థ జీవిత గాధలు వెలిగి, కాంతులీని ప్రకాశవంతం కాలేకపోయాయి. అదే ఊర్లో పుట్టి పెరిగిన ఆ తరం మట్టి బిడ్డలకు, ఈతరం ఊరి బిడ్డలకు కూడా తెలవని చాలా గాధలు తన దృష్టికొచ్చినంతవరకు ఇందులో ఉన్నాయి. ఆ గాధల్ని కేవలం ఆరేపల్లి జన సామాన్యంలోకే కాకుండా తెలంగాణ ప్రజాబాహుళ్యంలోకి, తెలుగు సాహిత్య యవనిక మీదికి గుండె నిండుగా మోసుకు వస్తున్నడు జితేందర్.
. ఈ మట్టి బతుకుల జీవిత గాధలు బహు కొందరితోపాటు కేవలం తనకే తెలవడానికి గల కారణం … తనలోని ‘ఇన్వెస్టీగెటివ్ జర్నలిస్ట్ ‘. నేలను చదునుచేసి , పుటంపెట్టి, సాగుచేసి పంటతీసినట్టు , ఈ గాధల్ని మనుషుల గుండెల మూలాల్లోకి వెళ్లి శోధించి, మనసు కకావికలమై, కన్నీరు కారుస్తూ రాసిండు. ప్రతి కథ వెనుక కేవలం ఉద్వేగమే కాదు, నిద్రపోని రాత్రులు, దిగులు, చెప్పలేని వేదన అనుభవించిండు. ఎవరితో పంచుకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థమై అర్థంకాక తనదైన సాహిత్య ప్రయాణంలోని మనసుకు చెప్పుకున్నడు. ఒక ఆర్తితో, ఒక తపనతో, ఎనలేని ప్రీతితో ఇదే ప్రాణమన్నట్టు పెనవేసుకుపోయి ఈ గాధల్ని రచించిండు. గత సంవత్సరకాలంగా ఫేస్ బుక్, వాట్సాప్ లలో రాసింది రాసినట్టుగా పోస్ట్ చేసి ఒక ఇంట్రెస్ట్ ను, ఒక అవసరతను క్రియేట్ చేశాడు.
*
ఇవన్నీను సామాజిక జీవన గాథలు. వివిధ వర్గాల, ప్రజల జీవితాల్లోంచి ఉద్భవించిన యదార్థం.. కథలు ఎక్కడో లేవు – చూసే కళ్ళనుబట్టి, వినే చెవులని బట్టి, మాట్లాడే నోటిని బట్టి, ఆలోచించే మెదడును బట్టి, స్పందించే హృదయాన్ని బట్టి కథలు ఎక్కడో లేవు – మన చుట్టూతే నిజ జీవిత గాధలు ఎన్నో, ఎన్నెన్నో …అగుపిస్తయి, వినిపిస్తాయి, మనల్ని విస్మయపరుస్తయి, కదిలిస్తయి, కన్నీళ్లు పెట్టిస్తయి. ఇవన్నీ వెతలు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వెత. దుఃఖం, అవమానం, వెలివేత, ఓటమి, నిద్రలేని రాత్రులు, ఒంటరితనం ఎదురీత, కష్టం, ఉమ్మడి తత్వం, కులం, మతం, నిర్లిప్తత, అన్నీ కలగలిసిన దుఃఖ ప్రవాహం …
. ఇది ఫక్తు ప్రజల చరిత్ర. ముఖ్యంగా మట్టి మనుషుల, గ్రామ శ్రమజీవుల బతుకు చరిత్ర. ఊరితో, కుటుంబాలతో ముడిపడిన బతుకుల కన్నీటి చరిత్ర. ఆరాటాలు, ఆశయాలు లేని స్వీయ వ్యక్తిగత మానవోత్తముల చరిత్ర. మోసంలేని, దగా చేయని, ఎవ్వరిని ముంచని, ఏ అండదండలు లేని సాధారణ ప్రజల అసాధారణ జీవిత గాధలు.ఇందులో గతించిన వారి గత వైభవంతోపాటు వర్తమానంలో నిలబడ్డ మనుషుల అంతరంగ హృదయావిష్కృత చరిత్ర చదివి మనమూ స్పూర్తిపొందొచ్చు. నిజమే, ఇది ఆరేపల్లి మట్టిబిడ్డల చరిత్రకారుల చరిత్ర. ఊరి బడి, గుడి, మజీద్, కొండమీది దర్గా, ఆర్యసమాజం, గ్రామపంచాయితీతోపాటు వూరి మట్టిలోపుట్టి పెరిగి తమ జీవితాలను శాశ్వతత్వంబొనరించుకున్న మహామహుల జీవితం ‘శిలాశాసనంలాంటి అక్షర లక్షల చరిత్ర’.
నిన్నటి వరకు అంతగా తెలవని చరిత్ర. ఇవ్వాల్టినుంచి చెప్పుకునే చరిత్ర. రేపటికి బాటలువేసే ఊరి పునాదిరాళ్ల చరిత్ర.
. నా చిరకాల మిత్రుడు, స్ఫూర్తిమంతమైన రచనలతో తన జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న రచయిత , గాయకుడు, విద్యాదాత, సీనియర్ జర్నలిస్ట్ నాగబెల్లి జితేందర్ సామ్రాట్ కు హృదయపూర్వక అభినందనలు.
. ఆరేపల్లి మట్టిమీద పుట్టుంటే బాగుండు అన్నంత స్ఫూర్తినిచ్చిన యదార్థ జీవిత గాధలు ఇవి. నాకు ఆరేపల్లితో ప్రజాకవి కాళోజీ గారి వెంట వెళ్లిన రోజునుంచి (అక్షర సాహితి దశాబ్ది ఉత్సవం -1997 ) ప్రత్యక్ష పరోక్ష అనుబంధం వల్లనే ఈ నాలుగు మాటలు రాసే అవసరం, అవకాశం వచ్చినందుకు ‘ఆరేపల్లి మట్టికి సలాం’లతో పరిపరి దండాలు.