సమగ్ర భూ రీ సర్వే (నక్ష) పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

 

వరంగల్ జిల్లా కలెక్టర్
సత్య శారద

రాష్ట్ర ప్రభుత్వం భూ వివాదాల పరిష్కారం మరియు యాజమాన్య హక్కుల నమోదు కోసం చేపట్టిన సమగ్ర భూ రీ సర్వే (నక్ష) కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.

శనివారం వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలోని భవానీకుంట తండాలో వివిధ శాఖల అధికారులతో పాటు సర్వే బృందాల సహకారంతో జిల్లా కలెక్టర్ పంట పొలాల్లో నేరుగా పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే జరుగుతున్న భూముల సరిహద్దులు, కొలతలు మరియు సంబంధిత రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమగ్ర భూ సర్వేలో భాగంగా జియో కోఆర్డినేట్లు, డ్రోన్ సర్వే మరియు మ్యాపింగ్ సాంకేతికతలను వినియోగించి భూముల హద్దులను ఖచ్చితత్వంతో, ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వేను పూర్తి చేయాలని సూచించారు.

పైలట్ ప్రాజెక్ట్ కింద వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో నక్ష సర్వే చేపట్టి భూముల హద్దులు, మ్యాపింగ్ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. సర్వేలో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది ఆయా భూములకు సంబంధించిన వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు.

అనంతరం వర్ధన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నక్ష సర్వేను సమర్థవంతంగా, వేగవంతంగా పూర్తి చేయడానికి పలు సూచనలు చేశారు. మున్సిపల్ పరిధిలోని 10,240 ఎకరాల వ్యవసాయ భూమిలో 6,379 ఎకరాలకు రీ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.

అలాగే మొత్తం 4,652 ఇండ్లకు గాను సర్వే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 158 బ్లాకులలో 102 బ్లాకుల్లో రీ సర్వే పూర్తయినట్లు తెలిపారు. మిగతా బ్లాకుల్లో కొనసాగుతున్న సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా భూముల కొలతల శాఖ అధికారి శ్రీనివాసులు, ఆర్డీవో సుమ, తహసిల్దార్ విజయ్ సాగర్, ఎంపీడీవో వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

 

ఎలకంటి నరేష్
బ్యూరో చీఫ్ పుడమి టీవీ న్యూస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *