నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్
ఎం వి ఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్
చొక్కాను విప్పి పక్కకు పడవేసి చేతిలోని తుపాకిని గోడకు నిలబెట్టి సిగరెట్ వెలిగించి లాకప్‌లో వుండాల్సిన రౌడీ షీటర్లను తన ముందు కూర్చుండ బెట్టుకొని ముచ్చట్లో మునిగిపోయాడు, సెంట్రీ డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ వి.కె, అప్పటికే రాత్రి పన్నెండు దాటింది పాతికేళ్ళు నిండని యువతీ గేటును పక్కకి జరిపి స్టేషన్ లోపలికి అడుగులు వేస్తుంది. ఒక గదిలో మాత్రం వెలుతురు కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ ఆవరణంతా చిమ్మచీకటిగా వుంది.
కొందరు ఆకతాయిలు వెంటపడి వేదిస్తున్నారు కాపాడండి సార్ అంటూ నేరుగా సిగరెట్ కాలుస్తున్న వ్యక్తి దక్కరికి వెళ్లి నిలబడింది. టిషర్ట్ జీన్ ప్యాంట్ వేసుకున్న ఆమెను చూసిన కానిస్టేబుల్ ఇదంతా ఇక్కడ మామూలే ఇక్కడి నుండి వెళ్ళవమ్మ అంటూ గదమాయించాడు. అయినా ఆ యువతి సార్ భయంగా వుంది సార్, ఇప్పుడే ట్రైన్ దిగి వస్తున్నాను పోకిరి గాళ్ళు వెంటపడి వేదిస్తున్నారు కాపాడండి సార్ అంది. కానిస్టేబుల్‌కు చెవికెక్కడం లేదు. అతని పక్కనే వున్న నలుగురుని బతిమిలాడింది, వాళ్ళల్లో ఓ వెకిలి నవ్వు మీపేరు ఏమిటి అని అడిగింది నా పేరు వరంగల్‌లో ఎవరిని అడిగిన చెప్పుతారు వెళ్ళవమ్మా అన్నాడు.
ఎదో గొడవ జరుగుతుందని ఏఎస్సై, గది నుండి బయటకు వచ్చి నిలబడ్డాడు. ఎదురుగుగా వున్న యువతిని చూసి ముందుగా యూనిఫామ్‌ను సర్దుకొని నిటారుగా నిలబడ్డాడు. పొద్దున్నే పూల బొకే ఇచ్చి వచ్చిన మేడంను సివిల్ డ్రెస్‌లో వచ్చిన యువతిని పోల్చుకున్నాడు. వామ్మో డిఎస్పీ సుమతి మేడం ఉద్యోగ విధుల్లో చేరిన ఒక్క రోజు గడవక ముందే ఇంత రాత్రి మట్వాడ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక్ష మవ్వడంతో అతనిలో వణుకు పుట్టింది వెంటనే సెల్యూట్ కొట్టాడు. అది చూసి బిత్తర పోయి ఎవరో పోలీస్ అధికారి అని మనసులో అనుకోని నడి ఎండలో నిలబడ్డట్టు కానిస్టేబుల్ వి.కె.కు చెమటలు పట్టాయి. వెంటనే చొక్కాను వేసుకొని తుపాకి చేతులోకి తీసుకున్నాడు. పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వస్తే మాట్లాడే ఓపిక లేని వాళ్ళపై ప్రజలకు పోలీసుల మీద విశ్వాసం ఎందుకు వుంటుంది. సెంట్రి డ్యూటీలో వున్నావ రౌడీలతో కలిసి పనిచేస్తున్నావా అంటూ వార్నింగ్ ఇస్తూనే చెంప చెళ్ళు మనిపించింది.
ప్రొబేషనరి అధికారిగా హైదరాబాద్‌లో పనిచేస్తున్న క్రమంలోనే వ్యభిచార ముఠాను పట్టుకోవడం కోసం రెండు గంటలపాటు ఒంటరిగా వారిలో కలిసిపోయి వాళ్ల గుట్టు విప్పింది. వందలాది మంది మహిళ బాధితుల జీవితాల్లో గొప్ప వెలుగు నింపి శబాష్ సుమతి అని అధికారులు ప్రజల మన్ననలు పొందింది.
హన్మకొండ, నగరం నడిఒడ్డున రాత్రి జన సంచారం సమయంలోనే హన్మకొండ పోలీస్ స్టేషన్‌ను పీపుల్స్ వార్ నక్సల్స్ పేల్చి వేయడం వెనువెంటనే తెల్లవారే లోపు పద్మాక్షమ్మ గుట్ట ఎన్‌కౌంటర్ సంఘటన భయాందోళనల నుండి ప్రజలు తెరుకుంటున్న సమయం మరోవైవు తెలంగాణ ఉద్యమం రాజుకుంటున్న సమయంలో సుమతి మొదటి పోస్టింగ్ వరంగల్ పట్టణ డిఎస్పీగా చేరింది. కొద్ది రోజుల్లోనే నగరంలోని సమస్యల మీద అధ్యయనం చేయడం మొదలు పెట్టింది. సమస్యలను ఎలా పరిష్కరించి ప్రజలకు పోలీసుల మీద నమ్మకం కలిగించాలనే ఆలోచన చేస్తున్న క్రమంలో నాయనమ్మ మాటలు, రియల్ హీరో తన తండ్రి ప్రజల సమస్యలపై చెప్పిన తీర్పులు గుర్తుకొచ్చాయి. కాసేపు తన ఊరి వైపుకు ఆలోచన మళ్ళింది.
ఊరికి దూరాన కృష్ణమ్మ పరుగులు తలాపు ఒడ్డున తుంగభద్ర నది ప్రవాహం నల్లరేగడి నేలలు పచ్చని పంట పొలాలు ప్రకృతి అందాలతో స్వాగతం పలుకుతుంది. తెలంగాణకు ఆఖరి పల్లె జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కలగొట్ల గ్రామంలోని బడుగుల తిరుపతిరెడ్డి సుజాతమ్మల కూతురు సుమతి
బడిలేని పల్లె నుండి తన ముగ్గురు ఆడపిల్లల్ని కొడుకును చదివించాలనే సుజాతమ్మ సంకల్పం వారిని విద్యావంతులను చేసింది. తన తాత బడుగుల తిమ్మారెడ్డి నాయనమ్మ నాగలక్ష్మిలు వందఎకరాల భూస్వాములు, సుమతి తండ్రి తిరుపతిరెడ్డి శ్రమను నమ్ముకున్న గొప్పరైతు, భూమిని ప్రేమించిన వ్యక్తి ఊరి మనిషి ఊరిలో ఎవరికీ ఏ చిన్న కష్టం వచ్చిన తోడైయ్యేది.

ఆ ఇల్లే ఓ రచ్చ బండగా వుండేది. ఒక వైపు తిరుపతిరెడ్డి వ్యవసాయం చేస్తూనే ఊరి ప్రజల సమస్యలకు పరిస్కారం చూపేది. ఊరంతా వెంటవున్న కొన్ని సమస్యలకు అధికారుల వద్దకు వెళ్ళాల్సి వచ్చేది చూసిన నాయనమ్మ సుమతితో అంది. మీ నాయిన అందరికి న్యాయం చేసిన పట్టణానికి పెద్ద ఆఫీసర్ల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ కావలి అంటూనే నాయనమ్మ నా మనుమరాలు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతుందని కనిపించిన ప్రతి మనిషికి చెప్పేది
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కార్తీక మాసంలో శివభక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు శ్రీశైలం వెళ్లాలంటే కలగొట్ల గ్రామం దాటి వెళ్ళాలి. సుమతి తండ్రి తిరుపతిరెడ్డి నాయనమ్మ నాగలక్ష్మి ప్రతి శివ భక్తున్ని మల్లయ్యగా పలకరిస్తూ సాక్షాత్తు శివుడే నడిచి వస్తున్నాడు అన్నట్లు పాదాలను కడిగేది వారి పాదాలకు గాయాలు అయితే మందును రాసేది ఒకరు కాదు ఇద్దరు కాదు వేలాది మందికి సేవ చేస్తూనే వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేసి పూజించేవాళ్ళు ఊరంతా కూడా ఆ కార్యక్రమంలో బాగ స్వాములు అయ్యేది
ఓ రోజు ఆవు చనిపోయింది. తన కుటుంబంలో ఓ మనిషి చనిపోయినట్లు తిరుపతిరెడ్డి బోరుమని ఏడవడం ఊరంత కన్నీళ్లు పెట్టుకున్నారు. మనుషులనే కాదు ఇతర జీవులను ప్రేమించే గొప్ప వ్యక్తి తన తండ్రి కావడం తన తండ్రిని హీరోలల్లో గొప్ప హీరోగా తన మనసులో నిలుపుకుంది. విలువల నుండి అనుభవాల ఆలోచన, సమస్యలను పరిష్కకరించే తన తండ్రి ఊరి కోసమే పుట్టాడని ఊరునమ్మింది, బడుగుల జీవితాల్లో వెలుగుల నింపుతున్నందుకేనేమో తన ఇంటి పేరు బడుగులగా మారిపోయింది. మనిషిగా ఎట్లా వుండాలో తన తండ్రి నుండి స్వీకరించిన సుమతి పోలీస్ అధికారిగా సమర్థవంతంగా పనిచేయాలని నిర్ణయించుకుంది
నగరంలో డిఎస్పీగా అడుగు పెట్టినప్పటి నుండి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ప్రజలు నేరుగా సుమతి మేడంను కలవడానికి వస్తున్నారు.
ఓ రోజు ఇద్దరు మహిళలు సుమతి కలిశారు. తమ భర్తలు ప్రభుత్వ ఉద్యోగులు వారానికి రెండు మూడు రోజులు కూడా ఉద్యోగం చేయడం లేదు. పేకాట క్లబ్‌ల్లో ఉండి ఇంటి ముఖం సైతం చూడటం లేదని కన్నీరు కార్చారు. వాళ్ళు ఉన్నత స్థాయి అధికారులు. కుటుంబం గడవడం ఇబ్బందిగా వుంది మేడం మా కుటుంబాలను నిలబెట్టమని వేడుకున్నారు మీకు న్యాయం చేస్తానని మాటిచ్చింది. అక్కడి నుండి వాళ్ళు వెళ్లిపోయారు తన ముందున్న ఫోన్ తీసుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించి ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. మూడు రోజుల పాటు పేకాట కేంద్రాలు క్లబ్‌లపై నిఘా ఏర్పాటు చేసింది.
పొద్దున్నే అన్ని పోలీస్ స్టేషన్‌లకు సమాచారం ఇచ్చి అలర్ట్ చేసింది. ఉదయం నుండి రాత్రి ఏడుగంటల వరకు అన్ని పేకాట క్లబ్‌లపై ఒకే సారి రైడ్ చేసింది. ఎక్కడ పడితే అక్కడ అదుపులోకి తీసుకుంది. ఐదు వందల మందిని నడి రోడ్డుపై కూర్చుబెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నత విద్యను అభసిస్తున్న విద్యార్థులు, వ్యాపారులు చివరకు పోలీసులు వున్నారు. జనం ముందే అందరి తాటతీసింది. ఈ సంఘటన వరంగల్ హన్మకొండ, కాజీపేట ట్రై సిటీలో సంచలనం రేపింది. ప్రజలు సుమతికి జైజేలు పలికారు. ఆపద వస్తే పోలీసులున్నారు. సుమతి మేడం ఉందన్న దైర్యం కలిగింది. ఇంకేముంది బాధితులు క్యూలు కట్టడం మొదలు పెట్టారు.
ఒక వైవు కరువు తాండవం చేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రైతులు అప్పులపాలై విగత జీవులుగా మారుతున్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రపంచం దృష్టి పెట్టింది. విత్తనాలు,పురుగుమందులు ఎరువుల అధిక ధరకు విక్రయించడం కల్తీచేయడం అలవాటుగా మారిపోయింది. కొరత సృష్టించి బ్లాక్‌లో అమ్ముతున్నారన్న సమాచారం అందుకొని నిఘా వేసింది. ముకుమ్మడిగా షాప్‌లపై దాడి చేశారు. రైతు బిడ్డగా రైతులను మోసం చేస్తున్న వారిని చెండాడింది. డీలర్‌ల చొక్కా పట్టుకొని లాగింది. వాళ్లపై కేసులు నమోదు చేసి అక్రమాదారులను వెంటాడి జైలు పాలు చేసింది. ఈ విషయం ఉమ్మడి వరంగల్‌నే కాదు,ఉత్తర తెలంగాణాలో వ్యాపారులకు వణుకు పుట్టించింది. దీంతో రైతుల గుండెల్లో చరగని ముద్రవేసుకుంది. రైతుల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంచి నేనున్నానే భరోసా ఇచ్చింది.
ఆడపిల్లలు రోడ్డు మీదకు వస్తే ఆకతాయిల ఆగడాలు రోజు రోజు పెరిగి పోవుచున్నాయి. కాలేజీలకి వెళ్లేందుకు బయటపడే పరిస్థితి నెలకొంది. సాధారణ మహిళగా కాలేజీ బస్టాప్ సెంటర్‌లల్లో పర్యటించి, వేదిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని బుద్ది చెప్పింది.
ములుగు రోడ్డు, వరంగల్ కాజిపేట్ రైల్వే స్టేషన్ బస్టాప్‌లల్లో ఆటోలల్లో ప్రయాణించే వారిపైన నిర్మానుస్య ప్రాంతాలకు తీసుకెళ్లి దారిదోపిడి చేయడం, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న సమాచారం అందుకొని, కొన్ని రోజుల పాటు నిఘాపెంచారు. రోజురోజుకి బాదితుల నుండి ఫిర్యాదులు ఎక్కువ వస్తున్నాయి స్వయంగా అనుమానిత ఆటో అడ్డాల వద్ద సాధారణ మహిళగా నిలబడిరది. మఫ్టీ పోలీసులను రంగంలోకి దింపి ముఠాల గుట్టును చేధించి బాధితులకు భరోసా ఇచ్చి దుండగులకు తనదైన శైలిలో కఠినంగా శిక్షించింది.
వరంగల్ ట్రై సిటీలో నిత్యం రద్దిగా వుంటుంది, ప్రధానంగా ఆటోలల్లో ఎక్కువ మందిప్రయాణిస్తారు, ఆటోలకు నంబర్లు ఉండవు ఎక్కడి నుండి వస్తారో తెలియని పరిస్థితి నేరాలు ఎక్కువ జరిగి నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉందని ఆటో యూనియన్, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించింది. మొట్ట మొదటి సారిగా వన్‌వేను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలకు పరిస్కారం చూపింది.
ఒక్కసారిగా ఓరుగల్లు నగరమే కాదు దేశం యావత్తు ఉలిక్కి పడిరది. వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఆగాల్సిన గోల్కొండ ఎక్స్ ప్రెస్ ఆగకుండా వేగంగా అండర్ బ్రిడ్జ్ కింద పడిపోయింది. సమాచారం తెలుసుకున్న సుమతి పది నిమిషాలల్లో అక్కడికి చేరుకుంది. కొన్ని బోగీలు ఆకాశంలో తెలియాడుచున్నాయి. ఆ ప్రాంతమంత రక్త సిక్తంగా వుంది. ప్రయాణికుల ఆర్తనాదాలు ఆమెలో పోలీస్ దుస్తుల్లో వున్న ఓ అమ్మ కనిపించింది. తమ బిడ్డలకు ఆపదవస్తే ఎలా అమ్మ నిలబడుతుందో అలా బోగిలల్లో చిక్కుకున్న ప్రయాణికులను తన చేతులతో మోసుకవచ్చింది.
నింగి వైపుకు వేలాడుతున్న బోగిలల్లో గాయాలై గుండెలవిసేలా రోదిస్తున్న వారిని కిందకు తీసుక రావాలని పెద్ద సాహసమె చేసింది. తానే స్వయంగా తాడును పైకి వేసి బోగిలల్లోవున్న వారి ప్రాణాలు కాపాడింది, బోగిలో కిటికీ చువ్వల మధ్య ఇరుకున్న ప్రయాణకుడి రోదన అందరిని కదిలించింది. అతన్ని కిందకు దింపడం కోసం తానే బోగిలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో బోగి లోయలో పడిపోయే పరిస్థితిని గమనించిన అధికారులు వారింంచిన అతన్ని రక్షించే ప్రయత్నం చేసింది. అతన్ని చేరుకునే లోపే ఆ ప్రయాణికుడు ఊపిరి వదిలాడు. సుమతి అక్కడ పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించలేదు. తాను ఒక రక్షణ కవచమై నిలబడటం వల్లనే వందలాది మంది ప్రయాణికులకు ప్రాణం పోసింది. 02 జూలై 2003లో జరిగిన గోల్కొండ సంఘటన రైలులో ప్రయాణించే ప్రయాణికులనే కాదు, అండరు బ్రిడ్జి క్రింద చేపలు అమ్ముకుంటున్న వాళ్ళు చేపలు కొనడానికి వచ్చిన వాళ్ళు కొంతమందిపై ఇంజన్ నేరుగా వాళ్లపై పడిరది. గోల్కొండ సంఘటన గుర్తుకు వస్తే సుమతి చేసిన సాహసమే గుర్తుకు వస్తుంది.
తన కుటుంబ నేపథ్యం, తనలోని సాహసం సుమతిని గొప్ప అధికారిణిగా నిలబెట్టింది.
ఫిక్కి స్పెషల్ జ్యూరి అవార్డ్, బెస్ట్ కోవిడ్ వారియర్ అవార్డ్, తెలంగాణ రాష్ట్ర విశిష్ట పురస్కారాలు అందుకుంది.
ఓరుగల్లు మట్టిపై సుమతి శతకం కనిపిస్తుంది. గుండాలు, రౌడీలు, దొంగలు, వైట్ కాలర్ నేరస్తులపైన ఉక్కుపాదం మోపి తనదైన ముద్రవేసింది. వరంగల్ రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్‌కు చెందిన ఆటో డ్రైవర్ పి చంద్రమోహన్ సుమతిపై అద్భుతమైన కవితను అందించాడు. ‘‘అమ్మవో అక్కవో’’ అంటూ ఆమే చేసిన సేవలపై స్పందించి అక్షరాలాల్లో చూపించాడు.
ఓరుగల్లు మట్టిపై అడుగు పెట్టిన వెంటనే పోలీస్ అధికారి ఎలా వుండాలో చూపించిన సుమతిలో తొంబై ఏళ్ల వయసులోసైతం కత్తిపట్టి యుద్ధం చేసిన రాణి రుద్రమదేవి సాహసం కనిపిస్తుంది. దుష్టులను చెందాడే భద్రకాళి అవతారం. కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారలమ్మలు దీవించినట్టు. సాహసాన్ని ఒడిసి పట్టుకొని రణరంగములో వెన్నుచూపని వీరవనితై విజయదుందుభి మోగిస్తుంది. ప్రజల రక్షణ కోసం గ్రీక్ పదంలో చెప్పినట్ట ‘ఏథిన’ (అథిన ,athina) జ్ఞానం కలిగిన యుద్ధదేవత అవతారం ఎత్తిన పోలీసు అధికారి కనిపిస్తుంది.
నేరస్తుల పట్ల కఠినంగా, మనుషులపట్ల, సాటి జీవుల పట్ల ప్రేమగా, ఎందరికో అమ్మగా బాధితులను అక్కున చేర్చుకున్న దేవతల ప్రజలకు రక్షణ కవచమై నిలదొక్కుకుంటున్న సుమతి లాంటి అధికారులు సామాజిక బాధ్యతతో పుట్టుకు రావాల్సిన అవసరం సమాజానికి ఎంతైనా వుంది. ఈ దేశ సంస్కృతిని, అమ్మతనాన్ని, బడుగుల జీవితాల్లో తమ ఆస్తులను అమ్మి ఆకలిని తీర్చి, వాళ్లకు ఇళ్లను నిర్మించిన ప్రతియింటికి, మనిషికి, నేను వున్నాననే ధైర్యాన్ని ఇచ్చిన తన తండ్రి వారసత్వాన్ని మోసుకెళ్లుతూ శభాస్ సుమతి అంటూ ప్రజల హృదయాలల్లో చెదరని ముద్రవేసుకున్న మీ జీవన ప్రయాణం వరంగల్ ప్రజలకు ఇచ్చిన దైర్యం ఎప్పటికీ మరచిపోరు.
వరంగల్ ఆంధ్రజ్యోతిలో నేను పనిచేస్తున్న సమయంలో వరంగల్ పట్టణ డిఎస్పీగా వచ్చిన సుమతి పోలీసింగ్ విధానం సామాన్య ప్రజలకు ధైర్యాన్నిచ్చింది, మీడియా రంగం తన సహసంపై ప్రత్యేక కథనాలు అందించింది.
గోల్కొండ సంఘటన జరిగిన కూతవేటు దూరంలో జర్నలిస్ట్ కామేష్ అక్కడే వున్నాడు. తన కళ్ళ ముందు జరిగిన సంఘటనపై ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పదిహేను నిమిషాలల్లో అక్కడికి చేరుకున్నాను. బ్యూరోచీప్ ప్రసెన్, జర్నలిస్ట్ మిత్రులు జయరాజ్, సూర్యప్రకాష్, ఫోటో జర్నలిస్ట్ దాసరి శ్రీనివాస్, సంఘటన స్థలంలో, క్రైం రిపోర్టర్ కాంచనపల్లి రమేష్ కోఆర్డినేట్ చేయడం, ప్రసేన్ గైడ్ చేయడం, ఎడిషన్ ఇంచార్జ్, సబ్ ఎడిటర్‌లు అంత కలిసి అన్ని పత్రికల కంటే ముందుగా ఈవినింగ్ ఎడిషన్ ఇచ్చారు,
పోలీస్ అధికారి సుమతి సాహసాన్ని కళ్ళారా చూశాను. ఎవరి ఒత్తిడిలకు తలొగ్గకుండా బాధితులకు వెన్నెముకై నగరంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టి మంచి ఆఫీసర్‌గా నిలబడింది. వరంగల్ డిఎస్పీగా మొదటి పోస్టింగ్ కావడం, సివిల్, ట్రాఫిక్, క్రైం మహిళా, డిఎస్పీగా పదహారు పోలీస్ స్టేషన్‌లకు అధికారిగా కొనసాగడం అందరి మన్ననలు పొంది ఐజి ఇంటలీజెన్స్ ఎస్.ఐ.బి .చీఫ్.గా సేవలందిస్తున్న సుమతి మేడంకు ఓరుగల్లు ప్రజల పక్షాన, మీడియా పక్షాన అభినందనలు.
