సేద భావి- నవల ఎపిసోడ్ – 01

వందేళ్ల క్రితం ఉమ్మడి వరంగల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో జరిగిన యదార్థ ప్రేమ కథ సేదబావి నవల

 

నాగబెల్లి జితేందర్ సామ్రాట్
ఎడిటర్ ఇన్ చీఫ్ పుడమి టీవి -ఎం వి ఆర్ మానవ వికాసరచనలు పబ్లికేషన్స్

రాత్రి నాగలి ఇడిసినప్పటి నుండి కోడెద్దులు ఎందుకో కొట్లాడుకొంటున్నాయి. ఎగులువారంగానే దొడ్డి కాడ పెండ తీసి అలుకు జల్లుదామనుకున్న లచ్చవ్వ ఎద్దుల్ని చూసి జడుసుకున్నది. ఆ జోడెద్దుల తీరు సూస్తాంటే నిప్పుల మీద అడుగులు వేసినట్టుంది. ఎడ్లు ఏడ మీదికి వస్తాయేమోనని భయంతో గుడిసెవైపుకు పరుగెత్తుకుంటూ, “ఏందయ్యో, జర తలుపులు తీసి బయటకు రమ్మని” పిలవబట్టింది. 

ఎంత పిలిచినా పెనిమిటి రాకపోవడంతో తలుపును గట్టిగా గుద్దింది. డబెల్‌మని శబ్దం రావడంతో గుడిసెలో నుండి ఎల్లయ్య తలుపు తీసి, “ఏందే లచ్చి,పొద్దుగాల్నే మొత్తుకుంటున్నవేందే ?” అంటూ నిద్రముఖంతో ఇంట్లో నుండి బయటకు వచ్చిండు.

“అగజూడయ్య, ఎడ్లు ఎట్లా జేత్తున్నాయో సూడు. వాటిని ఎట్లయినా ఆపాలే,” అన్నది.  ఎదురుగా ఎడ్ల కొట్లాట చూసి, “గివిట్ని నేనేడ ఆపుతానే. ఇగ అవి ఎవ్వలు ఆపినా ఆగయి. తొందరగా సిన్నోడు వీరనాగులును పిలువే,” అన్నడు.  పొద్దున్నే ఊళ్లోకి వెళ్లి వస్తున్న వీరనాగులును చూసి, “బిడ్డా, జర తొందరగా ఇటు రావ. ఎడ్లు కొట్లాడుకుంటున్నాయి బిడ్డా,” అన్నది. వీరనాగులు ఒక్క ఉదటున ఎడ్లకాడికి పోయి ఎద్దుల ఈపు మీద గట్టిగా సరిసిండు. అంతే, వాటి కొట్లాట వానబడి ఎలిసినట్టయింది.ఎద్దులు కదలకుండ నిలబడ్డాయి.

కొడుకా వీరనాగులు “రెండు రోజులల్ల నాట్లు ఎయ్యాలే. నేలనంత కలియ దున్నాలి. కొడుకా, నువ్వైతనే పని జల్దీ జేత్తావు. నాగళ్లు కట్టు బిడ్డ అన్నది లచ్చవ్వ, సరే నవ్వా, అన్నడు వీరనాగులు, ఎడ్లకు కాసింత మేత యేసి, అవి తిన్న వెంటనే పొలం కాడికి ఎళ్లుత,” అంటూ వీరనాగులు గుడిసెలోకి పోయిండు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *