· ప్రభుత్వ ప్రాథమ్యాల జాబితాలో ఎరువుల ఉత్పాదనకు సహజవాయువు సరఫరా
· ఖరీఫ్ నేపథ్యంలో నిరుటితో పోలిస్తే యూరియా నిల్వలు గణనీయంగా అధికం
దేశంలో సహజ వాయువు (సరఫరా నియంత్రణ) ఉత్తర్వు-2026ను కేంద్ర ప్రభుత్వం ఇవాళ జారీ చేసింది. ఈ మేరకు ఎరువుల రంగాన్ని తన ప్రాథమ్యాల జాబితాలో చేర్చింది. దేశీయ ఎరువుల ఉత్పత్తి ప్రభావితం కాకుండా చూడటంతోపాటు సహజ వాయువు సరఫరా కోసం ఎరువుల కర్మాగారాలను ‘ప్రాధాన్య రంగం-2’ కిందకు చేర్చింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం:
· ఎరువుల కర్మాగారాల్లో గత 6 నెలల సగటు సహజ వాయువు వినియోగం ఆధారంగా ఇకపై కనీసం 70 శాతం సరఫరా అవుతుంది.
· ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయం… ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో సంఘర్షణల ఫలితంగా తలెత్తిన ‘ఎల్ఎన్జీ’ సరఫరా సమస్య నుంచి ఎరువుల ఉత్పత్తికి భంగం కలగకుండా చూడటం ఈ ఉత్తర్వు లక్ష్యం.
· దీని ప్రకారం ప్రాధాన్య హోదా ఇవ్వడం వల్ల రైతులకు సకాలంలో ఎరువులు అందే వీలుంటుంది. ప్రపంచమంతటా గ్యాస్ సంక్షోభం ఉన్నప్పటికీ వ్యవసాయ కార్యకలాపాలకు అంతరాయం ఉండదు.
ఎరువుల ఉత్పత్తి కోసం సహజ వాయువు సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రైతు అవసరాలు తీర్చడాన్ని అగ్ర ప్రాథమ్యాలలో ఒకటిగా కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పశ్చిమాసియాలో రాజకీయ అస్థిరత వల్ల మన దేశంలో ఖరీఫ్ సీజన్‌పై ప్రతికూల ప్రభావం పడకుండా ముందు జాగ్రత్త తీసుకుంది.
పరిశ్రమ ప్రతినిధులు.. పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఎరువుల విభాగంలో ఉన్నత స్థాయి సమావేశం
ఈ అంశంపై ఇవాళ ఎరువుల విభాగంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని అన్ని ఎరువుల కంపెనీల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొని, తమ సన్నాహాలు, సమస్యల గురించి వివరించారు. ఎరువుల కర్మాగారాలు నిరంతరాయంగా నడిచేలా చూడటం కోసం శక్తివంచన లేకుండా సకల చర్యలూ చేపడతామని మంత్రిత్వశాఖ తరఫున అన్ని కంపెనీలకూ సూచనలిచ్చారు. పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఎరువుల సాధారణ… ఆపద్ధర్మ నిల్వలకు కొరత లేదు
సముద్ర రవాణా, సరకు రవాణా ఓడల రాకపోకలకు అంతరాయం ఏర్పడినప్పటికీ, దేశంలో ఎరువుల నిల్వలు తగినంతగా ఉండేలా చూస్తున్నామని ఎరువుల విభాగం రైతులకు హామీ ఇచ్చింది. ఏదైనా అనూహ్య పరిస్థితి ఏర్పడితే ఇబ్బంది లేకుండా చూసేందుకు తగిన మేర నిల్వలున్నాయని ప్రస్తుత సమాచార ఆధారిత వివరాలను ప్రకటించింది:
· తక్కువ వినియోగ దశలో ముందస్తు నిల్వకు చురుగ్గా చర్యలు తీసుకున్నందువల్ల ఆపద్ధర్మ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి.
· ఖరీఫ్ సీజన్‌కు ముందు దేశంలో మొత్తం ఎరువుల నిల్వ 180.12 లక్షల టన్నులుగా ఉంది.
· గత సంవత్సరం (2025 మార్చి 10) ఇదే కాలంలో 131.79 ‘ఎల్ఎంటీ’ నిల్వతో పోలిస్తే 36.6 శాతం పెరుగుదలను ఇది సూచిస్తుంది.
· ఈ పెరుగుదల ప్రధానంగా కీలక భూ పోషకాలలో… ముఖ్యంగా డీఏపీ, (25.17 ఎల్ఎంటీ), ఎన్పీకేఎస్ (56.30 ఎల్ఎంటీ) నిల్వలు బాగా పెరిగాయి.
నిల్వల (లక్షల టన్నులలో) వివరాలు (2026 మార్చి 10 నాటికి)
ఎరువు |
నిల్వల స్థితి (10.03.2026) |
నిల్వల స్థితి (10.03.2025) |
యూరియా |
61.51 |
50.90 |
డీఏపీ |
25.17 |
11.55 |
ఎన్పీకే |
56.30 |
32.29 |
ఎంఓపీ |
12.90 |
14.41 |
ఎస్ఎస్పీ |
24.24 |
22.64 |
మొత్తం |
180.12 |
131.79 |
దేశీయ లభ్యతకు భరోసా
దేశంలో అత్యధికంగా వినియోగించే యూరియా లభ్యత 61.51 ‘ఎల్ఎంటీ’కి పెరిగింది. ఈ సమాచార ఆధారిత జాబితాను బట్టి, ఖరీఫ్ సాగులో ప్రపంచ సరఫరా వ్యవస్థల ఇబ్బందుల నుంచి భారత్ సురక్షితంగా ఉందన్నది స్పష్టమవుతోంది. అంతర్జాతీయ రవాణా అవరోధాల వల్ల రైతులకు దేశీయంగా కొరత రాకుండా ఈ వ్యూహాత్మక నిల్వలు తోడ్పడతాయి.
అన్ని రకాల సబ్సిడీ ఎరువుల నిరంతర సరఫరా దిశగా ఎరువుల విభాగం ఇప్పటికే తగిన నిల్వలను నిర్వహిస్తోంది. కాగా, 2026 ఫిబ్రవరి నాటికి ప్రభుత్వం 98 ‘ఎల్ఎంటీ’ యూరియాను దిగుమతి చేసుకుంది. రాబోయే మూడు నెలలకు అదనంగా 17 ‘ఎల్ఎంటీ’ యూరియా సరఫరా దిశగా ప్రణాళిక కూడా సిద్ధమైంది. ప్రపంచంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నప్పటికీ అన్నదాతల ప్రయోజనాలను పరిరక్షణలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ చురుకైన విధానం నిదర్శనం.