ఆ సిరాచుక్కలు అక్షరాలై మొలికేత్తాయి

 

పుస్తక సమీక్ష

పుడమిటివి సామాజికం సాహిత్యం

నక్క కుమారస్వామి రచించించిన కలం ధార పుస్తక సమీక్ష

పుస్తక సమీక్షకులు
నాగబెల్లి జితేందర్ సామ్రాట్
కవి కథా రచయిత గాయకులు ఎడిటర్ ఇన్ చీప్ పుడమిటివిఎం వి ఆర్ పబ్లికేషన్స్

                                        

నవీన శీలయుగపు ఆది మానవుల సమాధుల సాక్షిగా, కాకతీయుల వారసత్వాన్నిపునికిపుచ్చుకున్న పల్లె, దేశ్ముఖ్ లు ఏలిన అగ్రహారం ఆ పల్లె , నైజాం రాజ్యాన్ని దిక్కరించి.భాష వ్యాప్టికి నిలబడి ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపకులాల్లో ఒకరైన దేవులపల్లి రామానూజ శాస్త్రికి పురుడు పోసిన పల్లె .వామపక్ష ఉద్యమంలో యువకుల రక్తం చిందిన నేల అది, తెలంగాణ తొలిదశ మలిదశ పోరులో ప్రత్యేక రాష్ట్రం కోసం కదిలి బలిధానం చేసిన నూనుగు మిషాల నవ యవ్వనాన్ని కోల్పోయిన పల్లెలో, ఆ మట్టిలో పుట్టిన బిడ్డలే తమ ఊరి పేరు చెప్పుకోవడానికి ముఖం చాటెస్తున్న, చుట్టురా పంటపొలాలు కొండలు గుట్టలు కల్మషం లేని జనం మధ్యలో నుండి నిలువెత్తు రంగ నాయకుల గుట్ట సాక్షిగా ,నా ఊరు వంగపహాడ్ అంటూ తన అక్షరాలతో చైతన్యపు దివిటై అక్షరాల వెలుగులు పంచుతున్న నక్క కుమారస్వామి కలందారగ మొదటి వచన కవిత్వం పుస్తకంతో సాహితిలోకంలోకి అడుగుపెట్టాడు.

ఉమ్మడి వరంగల్ హన్మకొండ జిల్లాలోని హాసన్ పర్తి మండలం వంగపహాడ్ గ్రామంలో నక్క సమ్మయ్య లక్ష్మీల కనీష్ఠ పుత్రుడు నక్క కుమారస్వామీ. సామాజికంగా వెలివాడల జీవితమే శ్రమ, ప్రేమను పంచడంతప్ప కుళ్ళు కుతంత్రాలు లేని కుటుంబంలో పుట్టిన కుమారస్వామికి ఆది గురువులు తల్లీదండ్రులే, ఈ సమాజానికి చదుకోవడం ఎంత అవసరమో గుర్తించి కష్టాన్ని నమ్ముకుని కన్నీళ్లను కంటిపొరల్లో దాచుకొని కుమారస్వామిని ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దారు.

కష్టాన్ని ఇష్టంగా చేయాలని నీతిగా నిజాయితీగా బతుకాలని తన తండ్రి సమ్మయ్య నేర్పిన నడవడికను పునికిపుచ్చుకొని
అందరిలో కలిసిపోడం,సాటి మనుషుల ముఖంలో చిరునవ్వులు పూయిస్తూ నవ్వుతూ జీవిస్తూ నవ్వుల పాలు కాకూడదని తన తల్లీ లక్ష్మి అందించిన మానసిక బలం, తన ఊరు అక్కున చేర్చుకొని అందించిన ప్రేమ తాను ప్రభుత్వ కొలువులో పనిచేసిన పల్లేప్రజల జీవితాలు విద్యార్థి దశలో వామపక్ష భావజాలంతో కలిగిన పోరాటపటిమ హేతువాద దృక్పధం కవిగా రచయితగా సామాజిక చైతన్యయోధుడిగా నిలబెట్టింది.నక్క కుమారస్వామి ప్రాధమిక విద్య పుట్టిన ఊరు వంగపహాడ్ లో పూర్తికాగ, హైస్కూల్ దామేర, ఇంటర్ హాసన్ పర్తి డిగ్రీ ఎల్ బి కళాశాల, పిజి కాకతీయ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు

బాల్యం నుండే అందరిలో సహజతత్త్వం కలిగిన కుమారస్వామి అక్షరాస్యత ఉద్యమంలో, సార పోరాటంలో పాల్గొన్నాడు, విద్యార్థి దశనుండే ఎవరిపైన ఆదార పడకుండా టైలర్ పని నేర్చుకున్నాడు. తన స్వంత ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో విద్యావాలంటీర్గా,,వసుందరహైస్కూల్లోఉపాధ్యాయుడుగా,పనిచేసి అనేకమంది విద్యార్థులల్లో కొత్త వెలుగులు నింపారు.

డిగ్రీ చదువుచున్న సమయంలో ఎల్ బి కళాశాల మాగజైన్ లో తన కవిత ప్రచురితం అయ్యింది, అంతే సామాజిక అంశాలపైన నిరంతరం అక్షరాలను సందిస్తూనే వున్నాడు.సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలపైన అక్షరాలతో యుద్ధం చేస్తూనే వున్నాడు. సామాజిక మాద్యమాలు, డిజిటల్ పత్రికలల్లో ప్రతి రోజు అక్షర పొద్దు అయ్యి ఉదయిస్తున్నాడు.

వామపక్ష ఉద్యమాలతో విద్యార్థి నాయకుడిగా ఎస్ ఎఫ్ ఐ విద్యార్ధి సంఘం కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యక్షునిగా పనిచేశారు. విద్యార్థి సంఘం నాయకుడిగా అనేక పోరాటాలు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అక్షరాలతో పాటలతో ప్రజలను కదిలించాడు.

గ్రామీణ ఉపాధి పథకంలో అధికారిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను అధ్యయనం చేశాడు. ప్రధానంగా తాడ్వాయ్ అటవీ ప్రాంతంలో ఆదివాసుల జీవితాలను చూసి ఆధునిక సమాజంలో ఇంకా చీకటి బతుకులకను అనుభవిస్తున్న అడవి బిడ్డల కష్టాలు, పేదరికం పై తల్లడిల్లి కవిగా వారి పక్షాన అక్షర గొంతుకయ్యాడు.

తన గర్భగుడిలో నవమాసాలు మోసిన తల్లీ తన జన్మకు జారకణమైన తల్లీ దండ్రులపై నేటి సమాజం చూస్తున్న తీరుపై చలించి పోయాడు. తనకు దూరమైనా తన తల్లిదండ్రుల మీదనే మొదటి కవిత అంతులేని శక్తి రూపాలుగా వారి జ్ఞాపకాలను తన కవితలో వినిపించాడు.

బతికి వుండగానే మనుషులుగా తల్లిదండ్రులని చూడని మానవత్వం లేని మనుషులపైన అమ్మ నాన్నలపై ప్రేమచూపండిరా అంటూ తన అక్షరాలను సంధించాడు

ఎందుకురా ఆ నటన
దేనికిరా నీకన్నీళ్లు
నేను రానని తెలిసి రమ్మని పిలవటం.
నేను లేనని తెలిసి గుండెలవిసేలా రోదిస్తూ
ఒక్క సారి లేవమని లేచి చూడమని
నా పార్దివ దేవంపై పడిపడి ఏడవటం
అలసి సొలసి సోకాలు తీయటం
నా శవ యాత్రలో నా ముఖంపై ఎండతగలకుండా
నీడకోసం గొడుగుపట్టడం
ఆ నీడకోసమే కదరా
నేను బతుకి వుండగా చేరదీయమని వేడుకొంటిని
ఇంకా ఎందుకు రా ఆ నటన
బంధువుల ముందు
బడాయి కాకపొతే
బతికి ఉన్నప్పుడే
బుక్కెడుబువ్వ పెట్టు
మరణించాక కాదు
అంటూ కాన్నోళ్లు బతికి వుండగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడమని కవి తపించాడు ఈ కవిత అనేక మంది వృద్ధులయిన తల్లిదండ్రుల హృదయాలను కదిలించింది.

ప్లాస్టిక్ వాడకం పైన అక్షరపోరాటం. చేస్తున్నాడు కవి

ముంచుకోస్తుంది ముప్పు
తెలుసుకొక పోవడం పెద్దతప్పు
ప్రాణికోటికి ప్రమాదం
ప్లాస్టిక్ తో చెలగాటం అంటూ మూగ జీవుల మృత్యువును,
విషయవాయువుల ప్రభావం
మానవాలిని కబలిస్తున్న క్యాన్సర్ మహమ్మారి కి కారణం అయినా ప్లాస్టిక్ పై పోరాటం చేయాలని పిలుపు నిచ్చాడు.

నక్క కుమారస్వామి ఒక సామాజిక తాత్వికుడు సమాజం లో జరిగే దుర్మార్గాలను చూసి చలించి పోతాడు తన భాదను తక్షణమే అక్షరాలై మొలిపిస్తాడు
మణిపూర్ లో మహిళలపై జరిగిన సంఘటనపై కవి హృదయం స్పందించింది మతం పేరు మీద సాగుతున్న ఆకృత్యాలను సమాజం పై ఉంచాడు కుమారస్వామి

.మణిపూర్ లో మంట గలిపిన మతోన్మాదులు
మదమెక్కిన మనువాదులు
మతి చెడిన మానవ మృగాలు మణిపూర్ మహిళలపై సాగించిన నగ్నత్వం పై అక్షరాలను ఎక్కుపెట్టి
భరతమాట ముద్దుబిడ్డలమని చెప్పుకునే
వెదవ సమాజం పై
అమ్మతనాన్ని అవమాన పరుస్తూ ఊరేగిస్తున్న వీళ్లను చూసి భరతమాత సిగ్గుపడుతుంది మీ లాంటి నీచులు తన కడుపులో పుట్టినందుకు అంటూ కవి
అత్యాచారాలను హత్యాకాండను నిరసించాడు

ప్రజాగాయకుడు గద్దర్ మరణించిన వెంటనే
ఎర్రవనంలో ఓ పువ్వు ఎందుకో అలిసిపోయింది
ఎగిసిపడింది ఎదిరించింది
ఎందుకొ సొమ్మసిలిందిఅంటూ గద్దర్ ఆట పాటను స్మరిస్తూ కవితను వినిపించాడు ఆ కవిత సామాజక మాద్యమాలాల్లో వైరల్ అయ్యింది. గద్దర్ పై రాసిన పుస్తకంలో నక్క కుమారస్వామి కవితను అక్కున చేర్చుకున్నారు

ప్రశ్నించే తాత్వాన్ని అలవర్చుకున్న కవి
ప్రశ్న వుంటేనే కదా ప్రగతి తెలిసేది
ప్రశ్నను పాతిపెట్టాలని చూస్తే నిప్పు రవ్వలై నిశ్శబ్దాన్ని చెడిస్తుందని ప్రశ్నకు వున్న శక్తిని తన కవితలో చూపించాడు.

ప్రజాస్వామ్య దేశంలో ఓటుకున్న శక్తిని వినిపించాడు
ఓటును అమ్ముకొని ఐడేళ్లు బానిస కాకు అంటూ వెర్రి జనాలు అనుకుంటే పొరపాటే
ఓటు తో కర్రు తీసి వాత పెడుతారు అంటూ ఓటు బలాన్ని చూపించాడు కవి

దేవుడా సైన్సా అంటూ పంచాంగం పై ప్రశ్నల వర్షం కురించాడు

యువశక్తి ని అక్షరశక్తిగా మార్చాడు
విప్లవ కారులం కాదు
విజయాన్ని ఆశించే విద్యార్థులం అంటూ
విద్యార్థి లోకం శక్తిని చూయించాడు.

బతుకమ్మ బజారు పాలయ్యింది అని వేదనతో కవితను రాశారు కవి
పువ్వులను దేవతగా కొలిచే
బతుకమ్మ డప్పు సప్పులతో ఊరేగిస్తూ ఊపిరి తీస్తున్నారని బతుకమ్మ సంస్కృతిని నాశనం చేస్తున్నారని కవి ఆవేధన చెందాడు.

మరో వైపు మనిషి గా బతుకాలనే తపనతోని
అందాలాలు ఎక్కాలని ఆరాటపడుతావు
మానవత్వం మరచి పోతావు
అందాన్ని చూసి మురసి పోతావు
అది ఏది శాశ్వతం కాదంటూ
నీటిబుడగ జీవితం పై
మానవ సమాజానికి ఒక మంచి సందేశం ఇస్తాడు నక్క కుమారస్వామి

సామాజిక ఉద్యమాలతో పెనవేసుకున్న జీవితం కావడం వల్ల నక్క కుమారస్వామి
చదువుకొని పిరికి వాళ్ళల తయారు అవుచున్న యువత మారాలని కోరుకుంటాడు

గొప్ప చదువులు చదివి
భవిష్యత్ ను కోల్పోతున్న విద్యావంతులు
ఎదురించే దైర్యం వున్న
పిరికి వాళ్ళుగా మారుతున్న తీరుపై కవి ఆవేదన చెందుతాడు.

నిర్భంద విద్య నీరుగారి పోయింది
కార్పొరేట్ చేతిలో బంది అయిపోయింది అంటూ నేటి విద్యావిధానం పై విరుచుకు పడుతాడు

తన ఊరిని రైతు జీవుతాలను స్మరించుకుంటూ
నేను ఎవరిని అంటూరైతు చుక్కను నేను కవి కలంలో
సిరా చుక్కను అంటూ
ప్రకృతి ఒడిలో ఒదిగిన అంతంలేని ఆలోచనను అంటూ తనలోని అంతర్మదానాన్ని వెలుబుచ్చాడు.

కవి సహజంగానే ప్రకృతి ప్రేమికుడు
అంతరించి పోతున్న అడవులపైన అడవినే నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసుల జీవితాలను అమితంగా ఇష్టపడే కవి
గరిక గడ్డిని నోటితో పట్టి
ఇంటి సూరులోన గూడూను కట్టీ జీవించే
ఊరపిచ్చుకను కాపాడుకుందాం అంతరించి పోతున్న పక్షులను బతికించాలని కోరుకుంటాడు.

గ్లోబల్ రాజకీయాల మీద విరుచుకు పడ్డాడు ఉచిత విద్యా వైద్యం అందించలేని వ్యవస్థ చప్పట్లతో కరోనా తరిమి వేయాలనే సంస్కృతీ పైన ధ్వజ మెత్తాడు కవి నక్క కుమారస్వామి

సహజత్వం లేని చవట నాయకులపైన అక్షర అస్త్రం సంధించాడు
పార్టీలు మారడం వారి నైజం
గుడ్డిగా నమ్మడం గుర్తించక పోవడం నీ అజ్ఞానం అంటూ తన కవితలో రాజకీయ నాయకుల నిజరూపం చూపిస్తాడు.

నీరు అవసరం జీవ జాతికి ఎంత అవసరమో గుర్తించి
బొట్టుబొట్టును ఒడిసి పట్టుకోవాలని పిలుపు నిస్తాడు.

కష్టాన్ని కాళ్ళ కింద తొక్కి పెట్టు
కన్నీటిని కనురెప్పచాటున దాచి పెట్టు అంటూ ఒక మానసిక నిపుణుడిగా
తన కవితలతో బోధిస్తాడు కవి కుమారస్వామి.

పుట్టిన ఊరు కష్టంతో సాగే జీవితాలు, అమ్మనాన్నల జీవన శైలి పెరిగిన వాతావరణం, వామపక్ష భావజాలం, విద్యార్థి నాయకుడిగా ఎదగడం ఇవన్నీ కవిలో ఒక సామాజిక దృక్కోణం వైపుకు నడిపించాయి

ఎనబై మూడు కవితలతో “కలం ధార” ను సాహితిలోకమునకు అందించిన కవి నక్క కుమారస్వామి ప్రతి రోజు జరుగుతున్న సంఘటనలపై, తన కవితలను సంధిస్తూనే వున్నాడు.

ఊటచెలిమ లెక్క అక్షరాలసిరా చుక్కలను వర్షిస్తూనే వున్నాడు
అవి ఎందరినో కదిలిస్తున్నాయి ఎన్నో సమస్యలపైన సమాజాన్ని చైతన్యం చేస్తున్నాయి

విద్యార్థిగా, యువకుడిగా నాయకుడిగా, అటు గ్రామ రాజకీయాలల్లో కీలకంగా వ్యవహరించి పాతీకెళ్ళు నిండక ముందే సర్పంచ్ గ పోటీచేసిన నక్క కుమారస్వామి ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థుల జీవితాలల్లో వెలుగులు నింపి ప్రజలతో మమేకమై సాగే ఉద్యోగంలో అధికారిగ కొనసాగుతున్న కవి నక్క కుమారస్వామి ఈ కాలపు సత్యశోదకుడు, దార్షనికుడు.

సమస్యలున్న చోట అక్షరాలను పదునుపెట్టి సామాజిక మాద్యమాలల్లో చైతన్యపు వెలుగై కనిపిస్తాడు
ఆదివాసుల దైవాలు సమ్మక్క సారలమ్మ ఇంకా అంటని మనువాదాన్ని చూసి ఆ తల్లులను గుండె నిండాప్రేమిస్తాడు

కల్మషంలేని, కుట్రలు తెలియని హృదయం కుమారస్వామిది, సహజకవిగా ఏ వాదనలు, ఆలోచనలు చుట్టూ తిరగకుండా మానవ వాదంతో ప్రకృతి వాదంతో సాహితిలోకంలో ఎదుగుతున్న అక్షరవృక్షం నక్క కుమారస్వామి తన కలం నుండి జాలు వారిన కలంధార మెదటి ప్రచురణ కావచ్చు వేలాది కవితలను, కథలను పాటలను రాసిన రాస్తున్న నక్క కుమారస్వామి మరిన్ని పుస్తక ప్రచురణలతో తన సాహితి ప్రయాణం కొనసాగాలని కొనసాగుతుందని ఆశిద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *