సాహిత్యం సామాజికం పుడమిటివి -ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీఫ్
తన ధిక్కార స్వరంతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీనారాయణరావును యాదిచేసుకోవడమంటే, నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు తెలుగు సమాజాన్ని, తెలంగాణను పరిశీలించడమే అవుతుంది. కాళోజీ సాహితీ సభల్లో, ప్రజాసంఘాలు నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడిన ప్రతి మాట సమాజ మార్పు కోసం ప్రజలను సన్నద్ధం చేసేలా ఉత్తేజపరిచేది.
ఓరుగల్లు అనేక ఉద్యమాలకు పురుడు పోసింది. అందులో ముఖ్యంగా కవులు, రచయితలు, కళాకారులు, గాయకుల పాత్ర గొప్పది. కవిత్వం, రచనలు చేసే వారు ప్రజలతో కలిసి పోరాటంలో సాగుతూ, ప్రజల పక్షాన నిలబడితే ఎలా ఉంటుందో కాళోజీని చూసిన వారికి అర్థమవుతుంది.

మా గ్రామంలోని ఓ కళాసంస్థకు కాళోజీ ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భం ఇప్పటికీ నా కళ్లముందే ఉంటుంది. అప్పటికి నాకు పదిహేనేళ్ల వయసు. ఆ సభలో ఓ మంత్రి, పలువురు సాహితీవేత్తలు, కళాకారులు పాల్గొన్నారు. దాదాపు ఐదు ఆరు గ్రామాల నుంచి రెండు వేలకుపైగా ప్రజలు వచ్చారు.
కాళోజీ నేరుగా ప్రసంగం ప్రారంభించారు.
“సభ వేదిక మీద ఉన్న ఈ మంత్రి ఎవరికి పుట్టాడో తెలుసా? వీడికి తల్లిదండ్రులు ఎవరో తెలుసా?” అంటూ ప్రజలను నేరుగా ప్రశ్నించారు.
అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. వేదికపై ఉన్నవారికి కూడా ఏం అర్థం కాలేదు. ప్రజలంతా ఆశ్చర్యంగా మంత్రివైపు చూశారు.
అప్పుడు కాళోజీ నవ్వుతూ చెప్పారు —“ఇతను తన తల్లిదండ్రులకు పుట్టాడు. కానీ ఎమ్మెల్యేగా, మంత్రిగా మన ఓట్లతో పుట్టాడు. మన ఓట్లతో పుట్టిన వీళ్లకు మనమే తల్లిదండ్రులం. కాబట్టి ప్రజలకు సేవ చేయాల్సింది వీళ్ల బాధ్యత.”అంతే… అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రజలు ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు కొట్టారు. దాదాపు రెండు నిమిషాల పాటు చప్పట్లు ఆగలేదు. మంత్రి కూడా చిరునవ్వుతో కాళోజీని ఆలింగనం చేసుకున్నాడు.

మా బాల్యంలోనే కాళోజీ ధిక్కార స్వరాన్ని చూసిన వాడిని నేను. ఒక కవి సమాజాన్ని ఎలా చైతన్యపరుస్తాడో ఆ ప్రసంగం ద్వారా అర్థమైంది. నాయకుల అసలు స్థాయి ఏమిటో ప్రజలకు వినిపించిన కాళోజీ, తన ప్రతి మాటతో ప్రజాకవిగా జనహృదయాల్లో నిలిచిపోయాడు.
1995లో హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. నాకు ఎకనామిక్స్ బోధించిన పర్యావరణవేత్త డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఆ సమావేశానికి రమ్మని చెప్పారు. నేను వెళ్లాను. నా ముందరి బెంచీలో కాళోజీ కూర్చున్నారు. వేదికపై ఉన్న మేధావులు విషయంపై మాట్లాడుతుండగా, వచ్చినవారు శ్రద్ధగా వింటున్నారు. యువకులం కదా… టేబుల్‌పై చిన్నగా శబ్దం చేశాను. కాళోజీ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశారు. తర్వాత లేచి పక్కకు వెళ్తూ —“ఇగ సప్పుడు చెయ్యి… నేను వేరే కాడ కూసుంటా” అన్నారు. నేను వెంటనే రెండు చేతులతో నమస్కరించి క్షమాపణ చెప్పాను. కాళోజీని అక్కడే కూర్చోబెట్టి నేను వేరే బెంచీకి వెళ్లి కూర్చోవాల్సి వచ్చింది. నన్ను పొమ్మనలేక, తానే వెళ్లడానికి సిద్ధమైన వ్యక్తి కాళోజీ. సభలో ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పిన వ్యక్తిగా ఆయన గుర్తుండిపోయారు.
మలిదశ తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంటున్న రోజులు. జేఎన్ఎస్ గ్రౌండ్లో భారీ సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సమయంలో సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. హనుమకొండ చౌరస్తా సమీపంలో నివసిస్తున్న ప్రొఫెసర్ కోతపల్లి జయశంకర్ ఇంటికి కుసుంబ గంగాధర్, కుసుమ జగదీష్‌తో కలిసి నేను వెళ్లాను.గంటకు పైగా మాట్లాడిన జయశంకర్ సార్ —“1969లోనే అనేకమంది యువకుల బలిదానాలు జరిగాయి. కొందరి స్వార్థం కోసం చాలామంది జీవితాలు అగమయ్యాయి. మళ్లీ తెలంగాణ ఉద్యమం చేస్తే ఇంకెంతమంది బలిదానాలు చూడాల్సి వస్తుందో…” అని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత “కాళోజీ ఏమంటున్నారు?” అని అడిగారు.“తెలంగాణ కోసం, భాష కోసం పోరాడుతున్న వ్యక్తి వెనకడుగు వేయడు కదా” అని చెప్పారు.
ఆ తర్వాత కాళోజీ ఇంటికి వెళ్లాం. ఏకశిల పార్క్‌లోని ఆడిటోరియంలో జరిగే సమావేశానికి కాళోజీని తీసుకెళ్లాల్సిన బాధ్యత నాదైంది.ఆటోలో కాళోజీని ఏకశిల పార్క్ వద్దకు తీసుకొచ్చాను. వృద్ధాప్యంలో ఉన్నారు కదా అని ఆటో దిగేటప్పుడు చేయి పట్టుకుని సహాయం చేయాలనుకున్నాను. వెంటనే నా చేతిని పక్కకు నెట్టి —“నేను నడుస్తానులే…” అన్నారు. ఆటో దిగి తనంతట తానే నడుచుకుంటూ వేదిక వద్దకు వెళ్లారు. నాకు తెలిసి కాళోజీ మరణించే వరకుఎవరిసహాయమూ తీసుకోకుండా తన జీవితాన్ని కొనసాగించారు.
1997లో మా గ్రామంలో సాహితీ వేదిక ఆధ్వర్యంలో కవి సమ్మేళనం జరిగింది. కాళోజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్భాశయనం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆ కార్యక్రమంలో పొట్లపల్లి శ్రీనివాసరావు, వి.ఆర్. విద్యార్థి, అన్వర్ తదితర కవులు పాల్గొన్నారు. ఆ కవి సమ్మేళనంలో నేను కాళోజీపై రాసిన కవిత చదివాను —“ఓ కాళన్నా… విన్నావా ఈ యథార్థ గాథ” అంటూ చదివిన ఆ కవితకు కాళోజీ స్పందించి నన్ను దగ్గరకు తీసుకున్నారు. మేమిద్దరం కలిసి ఫోటో దిగాం.అక్కడ ఉన్న పొట్లపల్లి శ్రీనివాసరావు, దర్భాశయనం శ్రీనివాస్‌లతో మాట్లాడుతూ —“మన మిత్రమండలి సమ్మేళనానికి నన్ను రమ్మని ఆహ్వానించండి” అని కాళోజీ అన్నారు.
నక్సల్స్ ఎన్నికలను బహిష్కరించి, ఓటు వేస్తే చంపేస్తామని హెచ్చరించిన సమయంలో కాళోజీ ధైర్యంగా స్పందించారు.“ప్రజాస్వామ్యంలో ఓటు నజన్మహక్కు. నేను ఓటు వేస్తాను. నన్ను చంపుతారా? ఎవరొస్తారో రండి!” అంటూ సవాల్ విసిరారు. ఆ ధిక్కార స్వరం ప్రజాస్వామ్యంపై ఆయన నమ్మకాన్ని చాటింది. అప్పటి వరకు కాళోజీపై వామపక్ష భావజాలం ప్రభావం ఉందనుకున్నవారికి, ప్రజలకు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే ఆయన నిలదీస్తారనే విషయం అర్థమైంది.
2001లో కే. చంద్రశేఖర్ రావు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరిస్తే, మా ఆరేపల్లిలో వి.ఎస్. రెడ్డి, ప్రముఖ న్యాయవాది సహోదర్ రెడ్డి సమక్షంలో తెలంగాణ జెండాను కాళోజీ ఆవిష్కరించి ప్రసంగించారు.“అక్షరరూపం దాల్చిన సిరాచుక్క లక్ష మెదళ్ల కదలిక” అనే మాటలను మా పాఠశాల బీరువాపై రాసుకున్నాను. నిజమే… అక్షరమే బతుకుతుంది. బతికిస్తుంది. కవుల కలాల నుంచి మరణించిన వారి జీవితాలను మళ్లీ జీవింపజేస్తుంది. ఈ భూమి ఉన్నంత వరకు కవులు ప్రజల నాలుకలపై జీవిస్తూనే ఉంటారు.

మిత్రమండలి సమావేశాలకు నేను తరచుగా వెళ్లకపోయినా, కాళోజీ “నా గొడవ” చదివిన వాడిని. కాళోజీ ధిక్కార స్వరాన్ని విన్న వాడిని. ఆయన నిక్కచ్చి జీవితాన్ని చూసిన వాడిని.నాగిళ్ల రామశాస్త్రి, వి.ఆర్. విద్యార్థి, అంపసయ్య నవీన్ పొట్లపల్లి శ్రీనివాసరావు, అన్వర్, వల్లంపట్ల నాగేశ్వరరావు, సిరాజోద్దీన్ వంటి ప్రముఖ కవులు చెప్పిన కాళోజీ సాహిత్య ప్రయాణాన్ని విన్న వాడిని. అందుకే కాళోజీని యాది చేసుకోవడం అంటే హైదరాబాద్ రాజ్యాన్ని, తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాలను అర్థం చేసుకోవడం. ప్రజల గొంతుకగా సాగిన జీవితాన్ని అర్థం చేసుకోవడమనేది నగ్నసత్యం.
కాళోజీ మరణానికి ముందే, తాను మరణిస్తే కట్టెల్లో కాలిపోవడమో, మట్టిలో కలిసిపోవడమో జరగకూడదని నిర్ణయించారు. తన శరీరం వైద్య విద్యార్థుల ప్రయోగాలకు ఉపయోగపడాలని ప్రకటిస్తూ, కొన్నేళ్ల ముందే కాకతీయ మెడికల్ కళాశాలకు దానం చేశారు. అనుకున్నట్టుగానే కాళోజీ తుది శ్వాస విడిచిన వెంటనే కుటుంబ సభ్యులు ఆయన పార్థివ దేహాన్ని కెఎంసీకి అప్పగించారు.
ఒక ప్రజాకవికి ప్రజల స్పందన ఎలా ఉంటుందో, కాళోజీ ఇంటి నుంచి కాకతీయ మెడికల్ కళాశాల వరకు ఆరు గంటలకు పైగా సాగిన అంతిమయాత్రను చూసిన కళ్లకు అర్థమవుతుంది. విద్యార్థులు, మేధావులు, కళాకారులు, సబ్బండ ప్రజలు వేలాదిగా తరలివచ్చి ఉద్యమకవికి కడసారి నివాళులు అర్పించారు.
తెలంగాణ కోసం కలలు కన్న కాళోజీ, తన అంతిమయాత్రలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశారు. తాను మరణించిన తర్వాత ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో జీవించారు. సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన ధిక్కార నినాదం ప్రజల గొంతుకల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది.
ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతర పెడుతాం ప్రాంతేతరుడు దోపిడీచేస్తే ప్రాంతం దాటే వరకు తన్ని తరుముదాం