పాకాల కవుల సమావేశం@విలాస రిసార్ట్

 

కవి కాలం సాహిత్యం సామాజికం  పుడమిటివి -ఎంవిఆర్ మానవ వికాస రచనలు పబ్లికేషన్స్

 

డా. తండ హరీష్ -కవి సాహిత్య విశ్లేషకులు

పాఖాల కవుల- కవి సమ్మేళణం విశ్లేషణ

ఈ సారి విలాస రిసార్ట్ ఈ కవులసమ్మేళనానికి వేదికయింది.ముందుగానే అనుకున్న ప్రకారం 28 వ తేదీ ఈ కలయిక ఉంటుందని తెలిసింది.రాధిక అక్క కాల్ చేసి ఎప్పన్నుంచో అనుకుంటున్న తమ్మీ తప్పకుండా రావాలి.ఇంకెవలన్న ఉంటే తీసుకురా అని చెప్పింది.

నేను , రహీమొద్దీన్ అన్న ఇద్దరం మహబూబాబాద్ లో శాతవాహన ఎక్కాము.ఖాజీపేటలో దిగుదాం అనుకున్నాం.చిట్ల ప్రేమ్ కుమార్ అన్న తాజ్ మహమద్ ఖాజీపేటకు దగ్గరలో ఉంటారని వీలుంటే అతనితో రావచ్చని చెప్పినట్టు రహీమన్న నాకు చెప్పిండు.ఖాజీపేటలో దిగాక టిఫిన్ చేద్దామనుకున్నాం.తాజ్ అన్నకు ఫోన్ జేసి మీరు టిఫిన్ చేశారా? లేకపోతే మాతో చేద్దురు అని రహీమొద్దీన్ అన్న ఆహ్వానించాడు.లేదు నేను చేశాను మీరు చేయండి అన్నారు.
అప్పటికే రాగి జావ తాగి ఉన్న నేను సందిగ్ధంలో ఉన్నాను.ఏం కాదు తిను తమ్మి అన్నడు.బయటికొచ్చినంక తెలిసింది గ్యాస్ కొరత వల్ల అదనపు GST పడిందని.అది విన్నాక తిన్న పూరి ఆకలి తీరుస్తుందనుకుంటే కడుపులో నొప్పిని తయారుచేసింది.ఈ మాత్రానికే ఇలా అనిపిస్తే దేశం ఇంకెన్ని నొప్పులను మోస్తుందోనని అక్కడ్నుంచి బయలుదేరాము.

 

తాజ్ అన్న బండి మీద ఇద్దరికే చోటు.మూడో వ్యక్తికి చోటు దొరికిందంటే అది కవిత్వం చలువేనని ,కవి కాబట్టే అది సాధ్యపడిందని నా నమ్మకం.ఖాజీపేట నుంచి సుమారు 25 కిలోమీటర్లు.అతని నవ్వుతూ నవ్వించే సంభాషణ, రహీమ్ అన్న ఛలోక్తుల మధ్య
కాలం ఇట్టే కరిగిపోయింది.ఎండ మమ్మల్నేమి చేయలేక తోకముడిచింది.ముగ్గురం కవులు కలిశామని తనకు తెలిసిందేమో ఎటో పారిపోయింది.

రిసార్ట్ చేరుకోంగనే చిట్ల ప్రేమ్ కుమార్ అన్న,కళ్యాణి అక్క,రాజ్ కుమార్ బండారి అన్న,కొయ్యడి శ్రీనివాస్ సార్,వడ్లకొండ దయాకర్ అన్న,రాజేందర్ సార్ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నరు.రాజ్ కుమార్ అన్న కొడుకు ఫైనాఫిల్ ముక్కలు ఇచ్చి ముద్దుముద్దు మాటలు మాట్లాడిండు.నెల్లుట్ల రమాదేవి మేడం, కాసుల రవికుమార్ అన్న దంపతులు వచ్చాక పక్కనే ఉన్న పెద్ద హాలుకు షిఫ్ట్ అయ్యాము.

అంతలో పుచ్చకుమార స్వామి అన్న, శంకర్ బాబు సార్ చేరుకున్నారు.రమాదేవి మేడం పొట్లపల్లి శ్రీనివాసరావు సార్ వచ్చేదాకా నేటి సమాజ స్థితిగతులను కథల్లోకి అంశంలా ఎలా పట్టుకు రావచ్చు అని మాట్లాడుతూ చాలా విషయాలు చర్చలోకి తెచ్చారు.కథ రాయడానికి వస్తువును ఎలా ఎంపిక చేసుకోవాలి అని చెబుతూ నేడు సిటీల్లోకి చొచ్చుకొస్తున్న లివింగ్ టుగేదర్,కొలీవింగ్,డింక్ కల్చర్ ల గూర్చి వివరణ ఇచ్చారు.భార్య భర్తల మధ్య వివాదాలకు కారణాలు వాళ్ళ తల్లులే అని చెబుతూ చురక పెట్టారు.ఈ స్పీచ్ మధ్యలోనే బాదం జ్యూస్ వచ్చింది.మేడం స్పీచ్ మధ్యలోనే గటగట తాగేశాము.

గాజోజు నాగభూషణం అన్న,రాధిక అక్క మిత్రులు అదే పొయిరాళ్ళ సభ్యులు వచ్చారు.పెట్రోల్ బ్యాంకులో వేచి యుండి ఎట్టకేలకు శ్రీనివాసరావు సార్ చేరుకున్నారు.పూరి తిన్నప్పుడు గ్యాస్ కొరత, కారులో పెట్రోల్ కొట్టించుకుందామంటే పెట్రోల్ కొరత.జనమంతా రోడ్డున పడ్డారని కాసేపు ఆలోచనలో పడ్డాను.అప్పటిదాకా ఈ కార్యక్రమాన్ని కాసుల రవికుమార్ అన్న తన మాటల చాతుర్యంతో నడిపించాడు.

బండారి రాజ్ కుమార్ అన్న ఇక అసలు కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు.కవిమిత్రులంతా తమ కవితలను వినిపించడం, మిగిలిన మిత్రులు స్పందన తెలియజేయటం ,ఏవైనా సలహాలు సూచనలివ్వటం చేశారు.ఇది ఈ సమావేశం జరిగినప్పుడల్లా జరిగే విషయమే.ఈ మధ్యలో ప్రూట్ ముక్కలు వచ్చాయి.తినుకుంటూ హాయిగా కవితల్ని విన్నాము.ఇవి మాకు ఫలహారాలపరంగా సెకండ్ డోస్.నాకు రహీమొద్దీన్ అన్నకు థర్డ్ డోస్ (ఖాజీపేట లో తిన్న పూరీతోకలిపి).మధ్యలో పుప్పాల శ్రీరాం గారు వచ్చారు.కరీంనగర్ ప్రాంత నేపథ్యంలో రాసిన
కవితను వినిపించారు.నాగబెల్లి జితేందర్ సామ్రాట్ అన్న మంచి పాటతో ఆకట్టుకున్నాడు.అందరి కవితల పేర్లు ఇక్కడ రాయటం లేదు కానీ చాలా మంచి కవితలు రాశారు.

ఒక మంచి అనుభూతికి లోనయ్యాము.ఇదో వర్క్ షాప్.నెలకో సారి కవితలు రిపేర్ చేయబడతాయి. కవితల మధ్యలో పల్లీలు వచ్చాయి.ఇది ఎన్నో డోసో మీరే లెక్కపెట్టుకోవాలి.ఇక మధ్యాహ్నం భోజనం ఏరకం వారికి ఆ భోజనం.ఏర్పాట్లు చాలా బాగున్నాయి.ఇంకా మిగిలిన వారి కవితలు మధ్యాహ్నం సెషన్ లో చదివారు.చివరగా గాజోజు నాగభూషణం అన్న కథతో కార్యక్రమాన్ని ముగించాము.

ఈ కార్యక్రమంలో నచ్చే అంశం అధ్యక్షులు ఉండరు.అందరూ సమానమే.అందరి అభిప్రాయాలు పంచుకో బడుతాయి.కొత్తవాళ్ళకు కవిత్వం మీద అభిరుచి పెరుగుతుంది.మొహమాటాలకు తావులేకుండా చెప్పేయడం ఇందులో ఇంకా నచ్చే విషయం.

ఇక విలాస గురించి మాట్లాడితే చక్కని గదులు, గార్డెనింగ్, స్విమ్మింగ్ పూల్.ఇది చిన్న పెండియాల్ కు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.అక్కడికెళ్ళడం ఎంతో మరిచిపోలేని జ్ఞాపకం.రాధికక్క,మోహన్ బావగారి ఆతిథ్యం చాలా బాగుంది.

కవిత్వంకున్న శక్తి అది.ఎంతమందినైనా ఒక్కచోట చేరుస్తుంది.బంధువులను చేస్తుంది.బాధలను పంచుకునేందుకు ఓ వేదికనిస్తుంది.నాకైతే ఎంతో మంది అన్నలనిచ్చింది, గురువులనిచ్చింది,అక్కలనిచ్చింది,చెల్లెళ్ళనిచ్చింది
ఇంకేంకావాలి…

ఇంతమందిని కలుసుకోవడమంటే పండుగేగా..

పుచ్చ కుమార్ అన్న బండి మీద నేను తాజ్ అన్న బండి మీద రహీమన్న ఇద్దరం ఖాజీపేట చేరుకున్నాము.

అదే శాతవాహన
అదే మహబూబాబాద్
అదే ఇల్లు

షరా మామూలే..

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *