పుడమి టివి సామాజికం సాహిత్యం

బిసి సాహిత్యం పై విశ్లేషణ

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీప్
భారతదేశాన్ని కులవ్యవస్థ నుంచి వేరుచేసి చూస్తే, ఈ దేశ ప్రజల అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమైనట్లే. ఎంత ప్రజాస్వామ్య దేశంగా గొప్పగా చెప్పుకున్నప్పటికీ, కుల రాజకీయాలే పార్లమెంట్ నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు తమ బలాన్ని ప్రదర్శిస్తున్నాయనేది నగ్న సత్యం. అలాగే వర్గ సమాజం కోసం మాట్లాడే శక్తులు, సంస్థలు విఫలమవ్వడానికి భారతదేశంలో అంతర్భాగమైన కులవ్యవస్థను నిర్లక్ష్యం చేయడం, దాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ప్రముఖ చరిత్రకారుడు డీ.డి. కోశాంబి చెప్పినట్లుగా, క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నుంచే కులవ్యవస్థ పునాదులు బలపడడం ప్రారంభమైంది. మానవ సమూహం చేసే పనిని బట్టి కుల నిర్మాణం జరిగింది. అది మానవ జీవనశైలిలో భాగమైపోయింది. కులమంటే వృత్తి. చాతుర్వర్ణ వ్యవస్థలో ఏర్పడిన కులాల నీడలు ఇంకా మానవ సమాజాన్ని శాసిస్తూ, విభజిస్తూ ఉన్నాయి. సాటి మనుషుల పట్ల వివక్ష చూపడం, అహంకారాన్ని ప్రదర్శించడం జరుగుతూనే ఉన్నా
ఏ కులం, జాతి, మతం అనే విభజనలు లేకుండా నాగరికతకు అడుగులు వేసిన ఆటవిక సమాజంలో వికసించిన ఆలోచనలు, ఆధునిక సమాజంలో నివసిస్తున్న మనిషి అభివృద్ధి పేరుతో వేల సంవత్సరాల మానవ సమాజపు అంచుల్లోకి దిగజారిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. వెలిగే జ్ఞానజ్యోతులు అగ్నిలో ఆహుతైనట్లుగా అనిపిస్తోంది.

భారత రాజ్యాంగంలో చాతుర్వర్ణ వ్యవస్థకు అనుగుణంగా సమాజాన్ని నాలుగు వర్గాలుగా విభజించారు — ఓసీ (అగ్రవర్ణాలు), బీసీ (వెనుకబడిన తరగతులు), ఎస్సీ (షెడ్యూల్డ్ కులాలు), ఎస్టీ (షెడ్యూల్డ్ తెగలు/ఆదివాసీలు). ఇక్కడ “కులం” అనే పదం ఉపయోగించకుండా “వెనుకబడిన తరగతులు”గా పేర్కొన్న ఉత్పత్తి కులాలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి.అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న ఆధిపత్య భావజాలం కలిగిన కులాలు రాజకీయంగా, ఆర్థికంగా బలంగా నిలబడి దేశ రాజకీయాలను శాసిస్తున్నాయి. మరోవైపు సమాన హక్కులను కల్పించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దశాబ్దాలు గడిచినా, కొన్ని కులాలు ఇంకా అంటరానితనాన్ని మోస్తూనే ఉన్నాయి. అసమానతలు, వివక్షలు ఇంకా కొనసాగుతూనే వుంది

రాజ్యాంగంలో వెనుకబడిన కులాలుగా గుర్తింపు పొందిన ఉత్పత్తి కులాలు జనాభా పరంగా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా వెనుకబడిగానే ఉన్నాయి. ప్రతి పల్లెలో ప్రతి మనిషికి అవసరమైన వస్తువులను, ఆహారాన్ని అందించే సబ్బండ కులాల వృత్తులు సమాజానికి పునాది. మట్టిని కుండగా మలిచిన కుమ్మరి ఒక రసాయన శాస్త్రవేత్త. నీటిలో బురదను ముద్దాడి చేపల ఉత్పత్తి చేసే ముదిరాజులు, బెస్తలు సమాజానికి ఆహారాన్ని అందించారు.

పాల ఉత్పత్తులు, మాంస ఉత్పత్తులను పెంచి ప్రజలకు అందించే గొల్ల, కురుమలు జీవనాధారాన్ని నిర్మించారు.ఆకాశమంత ఎత్తైన చెట్టెక్కి అమృతాన్ని ప్రజలకు అందించిన గౌడలు, నూలుపోగును అల్లుకొని బట్టను అందించిన పద్మశాలీలు, మనుషులను ఆరోగ్యంగా ఉంచిన మంగలి వృత్తిదారులు, బట్టలను శుభ్రపరిచిన రజకులు, రైతుకు నాగలి, రాజుకు ఖడ్గం, ఇంటికి పనిముట్లు తయారు చేసిన కమ్మరి, వడ్రంగి, కంచరి, ఔషధ శిల్పులు — ఇవన్నీ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఉత్పత్తి వర్గాలే.

పంట సాగుకి వెన్నే ముఖగా నిలిచిన మున్నూరు కాపులు అందమైన దుస్తులను తయారు చేసే మేరలు, ఇంటికి పందిళ్లు నిర్మించే మేదరులు, పునాది రాళ్లు అందించే వడ్డేరులు, ఇళ్లు కట్టే ఉప్పరులు, ప్రజలకు వినోదాన్ని అందించే దొమ్మరులు, మరణించిన మనిషికి చితిని పేర్చే కాటికాపరులు, గంగిరెద్దుల కళాకారులు — ఇంకా ఎన్నో ఉత్పత్తి, ఆశ్రిత కులాలు బీసీలలో కనిపిస్తాయి.
భారతదేశం అంటే కుల వ్యవస్థతో కూడిన సమాజం. ఇక్కడ ఆధిపత్య కులాల్లో కూడా నిరంతర శ్రమజీవులు, అత్యంత పేదలు ఉన్నారు. గుడిలో దేవుడికి నైవేద్యం పెట్టే పూజారుల్లో కూడా ఆకలితో అలమటించే వారు ఉన్నారు. ఇంకా ఆధునిక సమాజపు పోకడలకు దూరంగా జీవించే ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. అంటరానితనాన్ని మోస్తున్న దళిత బిడ్డలు ఉన్నారు. ఎంత ఆధునికత సంతరించుకున్నా, ప్రతి మనిషి సమాన గౌరవంతో జీవించలేని సమాజంలో మనం జీవిస్తున్నామనేది నగ్నసత్యం
ఇప్పటి వరకు అనేక సాహిత్య ప్రక్రియలు సమాజంలోకి వచ్చాయి. అందులో దళిత సాహిత్యం విస్తృతంగా ముందుకు సాగుతోంది. ఈ సమాజాన్ని తమ ఉత్పత్తులతో ప్రపంచంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టిన ఉత్పత్తి కులాలు, ప్రపంచీకరణ ప్రభావంతో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి.అద్భుతమైన పనితనం, సృజనాత్మకత కనుమరుగవుతోంది. రాజుల నుంచి పేదల వరకు సేవలు చేసిన . అగ్గిపెట్టెలో చీరను నేసిన చేతుల పనితనం చిన్నబోయింది. వందల ఏళ్ల క్రితమే ముక్కును అతికించిన వైద్య నైపుణ్యం కాలగర్భంలో కలిసిపోయింది.
ప్రపంచ మార్కెట్లో చేతివృత్తుల చేతులు నరికివేయబడ్డాయి. ఇప్పుడు వృత్తులు మాయమై కులాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే సమాజానికి సృజనాత్మకతను నేర్పించిన బీసీల సామాజిక సేవ, ఉత్పత్తి జీవితాలపై కొత్త సాహిత్యం ఉద్భవించాలి. కనుమరుగవుతున్న ఉత్పత్తి కులాల నైపుణ్యాన్ని మళ్లీ ప్రపంచ మార్కెట్లో నిలబెట్టాలి.
కులరహిత సమాజాన్ని కోరుకుంటూనే, వృత్తుల నైపుణ్యం, కుటుంబాల జీవన చిత్రాలపై పాటలు, కవితలు, కథలు, నవలలు రావాలి. వెనుకబడిన బతుకు చిత్రాలపై సాహిత్యం మరింత విస్తరించాలి.
“బీసీల కోసం ప్రత్యేక సాహిత్యం అవసరమా?” అనే ప్రశ్నలు సాహిత్యలోకంలో వినిపిస్తున్నాయి. దళిత సాహిత్యంలోనే బీసీ సాహిత్యం కూడా ఉంటే సరిపోతుందని భావించే వర్గాలు ఉన్నాయి. అయినప్పటికీ, బీసీ సాహిత్యం కోసం దశాబ్ద కాలంగా అనేక అవాంతరాలను అధిగమిస్తూ తెలుగు సాహిత్యంలో బీసీ సాహిత్యపు వెలుగును విస్తరించేందుకు అనేకమంది సాహితివేత్తలు కృషి చేస్తున్నారు.
ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిపోయిన ఈ కాలంలో బీసీ సమాజపు ఉత్పత్తి శక్తులను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ కృషి కీలకమవుతుందని ఆశిద్దాం.ఉత్పత్తి రంగాలకు పూర్వ వైభవం తిరిగి రావాలని కోరుకుందాం. వృత్తుల నైపుణ్యాన్ని, జీవితాలను అధ్యయనం చేద్దాం. గొప్ప సాహిత్యాన్ని సృష్టిద్దాం.ఇప్పటి వరకు బీసీల కోసం అనేక సంఘాలు, నాయకులు ముందుకు వచ్చినప్పటికీ, బీసీలు ఐక్యంగా ముందుకు సాగలేకపోవడం ఒక ప్రధాన సమస్య. అయితే బీసీల జీవితాలపై సాహిత్యం విస్తృతంగా వస్తే, బీసీలు రాజ్యాధికారంలో ముందువరుసలో నిలిచే అవకాశం మరింత బలపడుతుంది.