పుడమి టివి వార్తలు
చట్టం గుడ్డిది కాదు

వెంకయ్య నాయిడు మాజీ భారత ఉపరాష్ట్రపతి

నాగబెల్లి జితేందర్ సామ్రాట్ ఎడిటర్ ఇన్ చీప్
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ న్యాయ కళాశాల ఆవరణలో న్యాయ దేవత విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్య అతిధి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా న్యాయ దేవతకు సమున్నత రూపం ఇవ్వబడింది. బ్రిటీషు వలసవాదకాలం నాటి గుర్తులు తొలగించి భారతదేశ సమున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా న్యాయ దేవత విగ్రహంలో చారిత్రాత్మక మార్పులు చేసిందని అన్నారు
కొత్త రూపంలో న్యాయ దేవత కళ్లకు గంతలు లేవు. ఒక చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగ ప్రతిని ధరించి ఉంది. “చట్టం గుడ్డిది కాదు” అనే సందేశాన్ని ఇస్తూ, భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా చీరకట్టులో సాంప్రదాయ భారతీయ స్త్రీ రూపంలో, తలపై కిరీటంతో ఈ విగ్రహం రూపొందించ బడిందని చెప్పారు
తప్పు ఒప్పులను చూసి న్యాయం చేస్తుందని చెప్పడానికి కళ్లకు గంతలు తొలగించారు. ఖడ్గం స్థానంలో భారత రాజ్యాంగ ప్రతిని ఉంచారని అన్నారు.. ఇది చట్టం హింసకు చిహ్నం కాదని, చట్టబద్ధమైన పాలనకు ప్రతీక అని సూచిస్తుందని ఒక చేతిలో సమతుల్యతకు ప్రతీకగా త్రాసు అలాగే కొనసాగుతుందని అన్నారు
అత్యవసర పరిస్థితిని ప్రస్తావిస్తూ ఆ పరిస్థితి దుర్మార్గమైనది, చట్టవిరుద్ధమైనది. పదిహేడున్నర నెలలపాటు తాను కూడా జైలులో మగ్గిపోవలసి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీని చీకటి యుగంగా వర్ణించారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠం చెప్పిన గురువులను మరిచిపోయినవాడు మనిషేకాడన్నారు. తెలుగులోనే చదువుకొని తాను ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగానని, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి యన్.వి.రమణ, తదితర ప్రముఖులందరూ తెలుగులోనే చదువుకున్నారన్నారు. మాతృభాషలోనే జ్నాన సముపార్జన సులభమన్నారు.
తెలుగు ప్రాంతంలో తెలుగు పండాలన్నారు. న్యాయ వ్యవస్థను ఉటంకిస్తూ గ్రామీణ ప్రాంతం వారికి ఆంగ్లం అర్ధం కాకపోవచ్చు. న్యాయస్థానంలో వాదనలు, తీర్పులు అన్నీ మాతృభాషలోనే ఉండాలి. వాయిదాలు రెండు పర్యాయాలు మించి వేయకూడదు. న్యాయం అనే పదానికి నిజంగా న్యాయం చేయగలుగుతున్నామా అని ప్రశ్నించుకోవాలి. ఆలస్యమైన న్యాయం అన్యాయంతో సమానం. సత్వర న్యాయం న్యాయవ్యవస్థ లక్ష్యం కావాలి. అవినీతి, అక్రమాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఆకలి, ఆలస్యానికి తావులేని వికసిత్ భారత్ ను రూపొందించుకోవాలి. పశుపక్ష్యాదులను, సమస్త జీవరాశులను, సర్వ మానవులను ప్రేమించే పవిత్రమైన దేశం మనది. దేశవారసత్వమైన వసుధైక కుటుంబ భావనను ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేయవలసిన బాధ్యత భారతదేశ వారసులుగా మనందరిపైనా ఉందన్నారు.
మూడు సంవత్సరాల క్రితమే తెలుగు భాషను న్యాయశాస్త్ర విద్యార్ధులకు ఒక సబ్జెక్టుగా ప్రవేశ పెట్టినట్లు న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం వివరించారు. శతాబ్ది ఉత్సవాల వారోత్సవాలను జయప్రదం గావించిన సందర్భంగా శృంగవరపుకోట మానవ హక్కుల న్యాయవాది, విద్యావేత్త తన గురువులైన మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య వి. విజయలక్ష్మిని, ప్రస్తుత ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం లను దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్.వి.కె. ప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, విద్యార్ధులు పాల్గొన్నారు.